iDreamPost
iDreamPost
‘ఇజ్జత్ కా సవాల్…’ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ.. అనేది స్పష్టమైంది. ఆ పార్టీ అధికారికంగా ప్రకటించకున్నా… పార్టీ క్యాడర్ దీనిపై స్పష్టతతో ఉన్నారు. అదేవిధంగా తానే సీఎం అభ్యర్థినంటూ ప్రియాంకా గాంధీ సైతం పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియాంక సీఎం అభ్యర్థిత్వం అనేది కత్తిమీద సామే. ఇది కాంగ్రెస్ పార్టీ కన్నా… నెహ్రూ.. గాంధీ కుటుంబాలకే పెద్ద సవాల్. ఒకవైపు సీట్లు తగ్గినా సీఎం యోగి సారథ్యంలోని బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అఖిలేష్ ఆధ్వర్యంలో సమాజ్ వాది పార్టీ గణనీయంగా సీట్లు పెంచుకుంటుందని, కాంగ్రెస్ స్వల్పంగా ఓట్లు శాతం పెంచుకున్నా నామమాత్రమేనని కూడా అంటున్నాయి.ఈ నేపథ్యంలో ప్రియాంకం సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గౌరవమైన సీట్లు.. ఓట్లు సాధించకుంటే ఆమెకు రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ అంటే ఒకప్పుడు నెహ్రూ.. గాంధీ కుటుంబాలకు కంచుకోట. జవహర్లాల్ నెహ్రూ.. ఫిరోజ్ గాంధీ.. ఇందిరా గాంధీ… సంజయ్ గాంధీ… రాజీవ్‌గాంధీ.. సోనియా గాంధీ… రాహూల్ గాంధీ… ఇలా దేశ ప్రధానులు.. ఇందిర కుటుంబంలో కీలక సభ్యులు ఉత్తరప్రదేశ్ నుంచే పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ 75 ఏళ్లల్లో నెహ్రూతో పాటు అతని కుటుంబనికి చెందిన వారు సుమారు 37 సంవత్సరాలు ప్రధానులుగా ఉన్నారు. అటువంటి కుటుంబానికి తొలి నుంచి అండగా నిలబడింది యూపీ. ఈ రాష్ట్రంలోని ఫుల్‌పురా నుంచి జవహర్‌లాల్ నెహ్రూ మూడుసార్లు, ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలి నుంచి రెండుసార్లు, ఇందిరాగాంధీ ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. ఆమెథీ నుంచి సంజయ్ గాంధీ ఒకసారి, రాజీవ్ గాంధీ నాలుగుసార్లు, రాహూల్ గాంధీ మూడుసార్లు ఎంపీలుగా గెలిచారు. కుటుంబంలో నాలుగు తరాలవారు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి యూపీలో ఎవరో ఒకరు ఎంపీగా ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు అదే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ… ఇందిర కుటుంబం ఉనికికోసం పాట్లు పడుతోంది.
ఇందిర ముఖ కవళికలతో పుట్టి.. మరో ఇందిరగా అభిమానులు పిలుచుకునే ప్రియాంక గాంధీ కాలికి బలపంకట్టుకుని తిరుగుతున్నా ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ పుంజుకోవడం లేదు. యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. ఇటీవల యూపీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు వెళుతున్న కాన్వాయ్ ఢీకొట్టిన ఘటనలో మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి కాన్న ప్రియాంకా గాంధీ ఎక్కువగా పోరాటం చేసింది. గత నాలుగేళ్లుగా ప్రియాంక గాంధీ యూపీలో పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలయాలకు వెళుతూ హిందూ వ్యతిరేక ముద్రను తొలగించుకుంటున్నారు. మహిళ, యువత ఓట్లు లక్ష్యంగా పలు ఎన్నికల తాయిళాలు ప్రకటిస్తున్నారు. ఈ కారణంగా త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు.. సీట్లు పెరుగుతాయని సర్వేలు చెబుతున్నా అవి వేళ్లమీద లెక్కపెట్టుకునే స్థాయిలోనే ఉండడంతో ఆ పార్టీకి మింగుడుపడని అంశంగా మారింది.యూపీకి ఎన్నికలు ప్రకటించిన తరువాత ఆ పార్టీ కొద్దిమేర పుంజుకుంది. 2017లో ఆ పార్టీ కేవలం 6.3 శాతం ఓట్లు మాత్రమే సాధించగా, ప్రస్తుత ఎన్నికల్లో 8.9 శాతం వస్తుందని తేలింది. ఈ పెరుగుదల వల్ల ఆ పార్టీకి పెద్ద ప్రయోజనం లేదు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కకపోవడం కాంగ్రెస్ పార్టీ చివరియత్నంగా ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. నిజంగా ఇది సవాలే. పోరాటాలు చేస్తున్నా… శ్రమిస్తున్నా రాని ఫలితం కనీసం ప్రియాంక సీఎం అంటే కాంగ్రెస్‌కు వస్తుందో లేదో చూడాల్సి ఉంది.
ప్రియాంకాను సీఎం అభ్యర్థి ప్రకటించడం సోనియా కుటుంబ రాజకీయాలకు విరుద్ధమనే చెప్పాలి. ఎన్నికల్లో గెలిస్తే తమ కుటుంబ ఘనతగా, ఓడిపోతే స్థానిక నాయకత్వం లోపంగా చెబుతుంటారు. అటువంటిది ఇప్పుడు కుటుంబ పరుపునే పణంగాపెట్టి యూపీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీని నిలపడం విశేషం. ఇందుకు దారితీసిన పరిస్థితులు చూస్తుంటే.. యూపీలో ప్రాభల్యం కోల్పోయిన తరువాతనే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రాలేదు. యూపీలో 1989 అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి ఆ పార్టీ క్రమేపీ తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. ఇక్కడ గెలవకుంటే దేశ వ్యాప్తంగా పార్టీకి మైలేజ్ రాదు. అలాగే బీజేపీయేతర పక్షాలు కాంగ్రెస్ పార్టీని గుర్తించవు. ఈ కారణంగానే సోనియాగాంధీ కుటుంబం రాజకీయ జూదానికి తెరదీసిందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.