ఉగాది అంటే కొత్త సంవత్సరం. సంతోషాన్ని తెస్తుందని మన తెలుగు వాళ్ల నమ్మకం. కానీ ఈ ఉగాది మనకి కరోనా విషాదాన్ని తీసుకొచ్చింది. 21 రోజులు లాక్‌డౌన్ అని ప్రధాని మోడీ ప్రకటించాడు.
చైనాలో ప్రారంభమైనప్పుడే దీని సీరియస్‌నెస్‌ని అంచనా వేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. తెలివైన అమెరికానే ఆ పని చేయలేకపోయింది. ప్రపంచాన్ని కభళిస్తున్నప్పుడు, ఇటలీ, ఇరాన్‌లో మృత్యువు పరచుకుంటున్నప్పుడైనా ఎవరూ మేల్కొనలేదు. ఎయిర్‌పోర్టులు కట్టడి చేసినా సరిపోయేది. ఇప్పుడు ప్రధాని మాటలు వింటూ ఉంటే పరిస్థితి సీరియస్‌గానే ఉందని అర్థమవుతోంది.
దేశాన్ని రక్షించుకోడానికి కఠిన ఆంక్షలు తప్పవు. ప్రాణాలతో పని కాబట్టి ఎవరికి వాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే ఈ దేశంలో సగానికి పైగా జనాభా రెక్కల కష్టం మీద అరకొరగా జీవించేవాళ్లే. వాళ్ల పరిస్థితి పైన ప్రధాని ఏమీ మాట్లాడలేదు.
డబ్బులుంటేనే తిండి గింజలు కొనడం కష్టంగా ఉన్న లాక్‌డౌన్ పేపథ్యంలో డబ్బులు లేని వాళ్ల సంగతేంటి? ఇంట్లో చిన్నచిన్న బిడ్డలుంటారు. వాళ్లకి పాలు కావాలి, పౌష్టికాహారం కావాలి. ఏమిటి మార్గం? మందులు , చికిత్స అవసరమైన ముసలి వాళ్లు ఉంటారు. అవి ఎలా అందుతాయి? ఇంటి నుంచి బయటికి రాకూడదు సరే, ఇల్లే లేని వాళ్లు దేశం మొత్తం మీద పది లక్షలకు మించి ఉన్నారు. వాళ్లు ఎక్కడ ఉంటారు?
ఇప్పుడు బతికి ఉన్నవాళ్లెవరు గతంలో ఇలాంటి ఉపద్రవాన్ని చూసి ఉండరు. ప్రపంచ యుద్ధాలు కూడా కొన్ని దేశాలకే పరిమితం. కానీ ప్రపంచ మొత్తం ఒక వైరస్‌తో యుద్ధం చేస్తూ ఉంది. ఆర్థికంగా అన్ని వ్యవస్థల్ని ఇది కుప్ప కూల్చేస్తుంది.
మూడు రోజుల క్రితం కూడా ఎవరికీ తెలియదు. మహా ఒకట్రెండు రోజులు అనుకున్నారు. ఆదివారం సాయంత్రానికి 31 వరకు ఉంటుందని అర్థమైంది. కానీ ఇప్పుడు డెడ్‌లైన్ మారింది. ఇది దాటితే డెత్. ఒకరి అజాగ్రత్త ఎందరి ప్రాణాలైనా తీస్తుంది.
మళ్లీ మామూలు రోజులు ఎప్పటికి వస్తాయో తెలియదు. మూతపడినవన్నీ తెరుచుకుని యధాస్థితి రావడానికి ఏడాది పట్టొచ్చు. ఇంకా ఎక్కువైనా కావచ్చు.
కొన్ని లక్షల మంది ఉపాధి దెబ్బతింటుంది. నిరుద్యోగంతో సామాజిక జీవనం అల్లకల్లోలం అవుతుంది. నేరాలు పెరుగుతాయి. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ఆదాయం కోల్పోతుంది కాబట్టి, ప్రజల్ని ఆదుకోవడం కష్టమవుతుంది. ఉత్పత్తులు అమ్ముకోలేక రైతులు దివాళా తీస్తారు. ప్రజలు రుణాల్ని చెల్లించలేరు కాబట్టి బ్యాంకింగ్ రంగం దెబ్బ తింటుంది.
గ్రేట్ డిఫ్రెషన్ (1929-33) గురించి పుస్తకాల్లో చదవడమే తప్ప చూసింది లేదు. అమెరికాని కమ్ముకున్న ఆర్థిక మాంద్యం, వందేళ్ల తర్వాత కరోనాతో వచ్చింది.
ఉగాది రోజు కోయిలమ్మ వస్తుంది కానీ, మనుషులంతా ఇళ్లలో బందీలుగా ఎందుకున్నారో దానికి అర్థం కాదు. శతాబ్దాలుగా పక్షుల్ని పంజరంలో పెట్టిన పాపమేమో!
ఉగాది పచ్చడి ఈ సారి మొత్తం చేదుగానే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఐసోలేషన్ అంటున్నారు కానీ, మనిషి సమూహంలో ఒంటరిగా మారి చాలా కాలమైంది.
6133