న్యాయమూర్తులు సోషల్ మీడియాలో సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. తమ తీర్పులను సమర్ధించుకునే అవకాశం తమకు లేకపోవడంతో న్యాయమూర్తులు సోషల్ మీడియాలో సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశ ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ కోపానికి గురైన ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కాలంలో న్యాయవ్యవస్థలు, న్యాయమూర్తుల గురించి సమతూకంతో వార్తలు వచ్చేవి. కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించే నైజాన్ని అలవర్చుకున్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా వదిలివేసిన విషయాలను సోషల్ మీడియా ప్రజల దృష్టికి తీసుకువస్తోంది. దీంతో చాలామంది సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు.ఏపీలో ఎప్పుడూ లేనిది ఈ మధ్య కాలంలో న్యాయవ్యవస్థలపై సోషల్ మీడియాలో చర్చ ఎక్కువగా జరుగుతుంది. సోషల్ మీడియా లోవచ్చిన కామెంట్ల మీద న్యాయస్థానం కొందరికి నోటీసులు జారీ చేసింది కూడా.
‘మై లార్డ్’ అంటూ సంబోధించే న్యాయమూర్తులపై ప్రజలకు నమ్మకం సడలడానికి ఈ మధ్య కాలంలో వచ్చిన తీర్పులు కారణమంటూ కొన్ని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. కరోనాతో లాక్ డౌన్ విధించడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులలో చిక్కుకున్నారు. వీరిని ఆదుకునే ప్రయత్నాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరిగారు. దీనిపై కొందరు ఏపీ హైకోర్టులో కేసులను దాఖలు చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించిన హైకోర్టు వైసీపీ ఎమ్మెల్యేలు ‘సూపర్ స్పైడర్స్’ గా ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడమే గాకుండా అందరికి నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి చంద్రబాబు భారీ ర్యాలీతో అమరావతికి చేరుకున్నారు. అభిమానుల కోసం మధ్య మధ్యలో చంద్రబాబు విజయనాదం చేస్తూ విక్టరీ సింబల్ చూపారు. దీనిపై కొందరూ కేసు వేయగా దీనిని విచారించిన కోర్టు ఈ కేసును ఇక్కడ కాదు డిజాస్టర్ మేనేజిమెంట్ కు వెళ్ళమని ఆదేశాలు జారీ చేయడంతో సోషల మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి .
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వ విధి విధానాలపై కోర్టులు జోక్యం పరిమితం. కానీ ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 327 కేసులు హైకోర్టులో నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల సమీక్షపై ఎక్కువ కేసులు ఉండటం గమనార్హం. మూడు రాజధానుల బిల్లు, ఇళ్ల స్థలాల పంపిణి, ఇంగ్లీష్ మీడియం లాంటి పలు ప్రభుత్వ విధానాలకు కోర్టులు స్టే ఇచ్చింది. దీని వల్ల అనేకమంది సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేశారు. వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ ఘటన నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనలో హైకోర్టు రమేష్ కుమార్ కు విచారణ జరగకముందే స్టే ఇవ్వడంతో ఆశ్చర్యపోయారు.
న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించడం ఖండనీయం. కానీ వారి ఆవేదనను ప్రశ్నించే వేదికగా సోషల్ మీడియాని వాడుకుంటున్నారు,అదే సమయంలో భాష ,భావం శృతిమించకూడదు. ఆడంబర జీవితానికి దూరంగా ఉంటూ పేద ప్రజలకు న్యాయాన్ని అందించే ఏకైక వ్యవస్థగా ఉన్న న్యాయస్థానాలపై విమర్శలు చేయడం తగదంటూ జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. దీంతో మేధావులు, న్యాయనిపుణులు నెటిజన్స్ కు ఓ సలహా ఇస్తున్నారు. దేవాలయం లాంటి న్యాయవ్యవస్థలపై విమర్శలు చేయడం తగదని న్యాయమూర్తులకు గౌరవాన్ని ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజలలో సడులుతున్న విశ్వాసాలను నిలబెట్టవలసిన బాధ్యత కూడా న్యాయమూర్తులపై ఉందని వారు కోరుతున్నారు