iDreamPost

అసెంబ్లీకి కిలో మీటర్ దూరంలో ఉన్న బస్ షెల్డర్ కొట్టేసిన దొంగలు

అసెంబ్లీకి కిలో మీటర్ దూరంలో ఉన్న బస్ షెల్డర్ కొట్టేసిన దొంగలు

దొంగలు రోజు రోజుకు తెలివి మీరిపోతున్నారు. ఇంటికి కన్నాలు వేయడం కన్నా ప్రజా ధనాన్ని కొల్లగొడితే ఎక్కువ దుడ్డు మూటగట్టుకోవచ్చునని భావిస్తున్నారోమో తెలియదు కానీ.. ఇటీవల జరుగుతున్న దొంగతనాలు చేస్తుంటే.. ఔనని అనిపించకమానదు. గతంలో ఏకంగా ఓ రైలు బ్రిడ్జిని చాక చక్యంగా అందరూ చూస్తుండగానే.. విప్పి పట్టుకెళ్లిపోయిన సంగతి విదితమే. అలాగే సెల్ ఫోన్ టవర్లను కూడా హాం ఫట్ అని మింగేశారు. అంతేనా మొన్నటి మొన్న ఆదానీ కంపెనీకి చెందిన ఓ కాలినడక బ్రిడ్జిని మాయం చేశారు. ఇప్పుడు ఏకంగా మరో భారీ దొంగతనానికి తెర లేపారు. ఏకంగా బస్టాప్‌నే కొట్టేశారు. అదీ కూడా అసెంబ్లీకి కేవలం కిలోమీటర్ల దూరంలో కొత్తగా ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్‌ను దొంగలు దోచుకెళ్లారు.

ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉంటే కన్నింగ్ హామ్ రోడ్డులో కొత్తగా రూ. 10 లక్షలతో స్టెయిన్ లెస్ స్టీల్‌తో బీఎంటీసీ బస్ షెల్టర్‌ను నిర్మించింది. నిర్మించి వారం రోజులు కూడా కాకముందే దుండగులు ఆ బస్ షెల్డర్‌ను దొంగిలించారు. ఈ బస్టాప్ బెంగళూరు సిటీ పోలీస్ కమీషనర్ కార్యాలయం వెనుక, విధాన సౌధకు 1 కిలో మీటర్ దూరంలో ఉండటం గమనార్హం. ఈ ఘటన  నెల రోజుల క్రితం జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. చోరీకి గురైన నెల రోజుల తర్వాత గత నెల 30న బస్ షెల్డర్ ను నిర్మించిన కాంట్రాక్ట్ కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెడిడెంట్ రవి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్ షెల్డర్ నిర్మాణం కోసం బీబీఎంపీ కాంట్రాక్ట్ ఇవ్వగా.. ఆగస్టు 21న కాఫీడేకి దగ్గరలో కన్నింగ్ హామ్ రోడ్డుపై దాన్ని నిర్మించామని తెలిపారు.

షెల్టర్ ఖరీదు రూ. 10 లక్షలని రవి తెలిపారు. ఆగస్టు 28న షెల్డర్ చూసేందుకు వెళ్లగా.. అది కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాము వెంటనే బీబీఎంపీ అధికారులను సంప్రదించామని, షెల్డర్‌ను తొలగించారా అని ప్రశ్నించగా.. లేదని సమాధానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గతంలో అక్కడ పాత బస్ షెల్టర్ ఉండగా.. వర్షాలకు, ఈదురు గాలులకు కూలిపోయిందని స్థానిక ప్రయాణీకులు చెబుతున్నారు. అనంతరం ఈ కొత్త నిర్మాణం జరిగింది. కాగా, కన్నింగ్‌హామ్ రోడ్డు పై నిర్మించిన బస్ షెల్టర్ లింగరాజపురం, హెన్నూరు, బానసవాడి, పులికేశినగర్, గంగేనహళ్లి, భూపసంద్ర, హెబ్బాల్, యలహంక ప్రాంతాలకు వెళ్లే వందలాది మంది ప్రయాణికులకు ఆశ్రయం కల్పించింది. ఇది చోరీ కావడంతో .. ఇప్పుడు కేవలం చిన్న షెల్టర్ మాత్రమే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి