iDreamPost

ఉదాశీనతతో ఉత్పాతం తప్పదా..?

ఉదాశీనతతో ఉత్పాతం తప్పదా..?

దీపావళి, వివాహ ముహూర్తాలు, ఇతర పండుగల నేపథ్యంలో కోవిడ్‌ పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయింది. ఈ మాట అంటున్నది ఎవరో కాదండోయ్‌.. సంబంధిత అంశంలో గత కొన్నినెలలుగా పరిశీలిస్తున్న నిపుణులంటున్న మాటలు. దీపావళి పేరుజెప్పి దేశ వ్యాప్తంగా ప్రజలు స్వేచ్ఛగానే బైటకు వచ్చారు. షాపింగ్‌ తదితర కార్యకలాపాల్లో విస్తృతంగా పాలుపంచుకుంటున్నారు.

అన్‌లాక్‌ తరువాత ఈ విధమైన స్వేచ్ఛను స్వాగతించదగినదే అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా వ్యవహరించడం పట్ల నిపుణులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. డబ్లు్యహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ చెప్పినట్టు వైరస్‌కు జాలీ, దయా ఉండదన్నది అక్షరసత్యమే. తర, తమ బేధాల్లేకుండా విస్తృతంగా వ్యాపిస్తుందని, తద్వారా ఏర్పడబోయే ఆరోగ్య అత్యవసర స్థితిని తట్టుకోగలిగేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ముందుగానే హెచ్చరికలు చేసారు.

అయితే తెలంగాణాలో జనజీవనాన్ని పరిశీలించిన ఆ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ బృందం తేల్చిందేంటంటే కోవిడ్‌ భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు చైతన్యవంతమయ్యారు. కానీ అదే సమయంలో పాటించడంలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నారని వాళ్ళు తేల్చేసారు. యాభైశాతం మందికిపైగా మాస్కులు ధరించడం లేదని సదరు బృందం పరిశీలనలో వెల్లడైంది. భౌతిక దూరం విషయాన్ని పూర్తిగా జనం పక్కనెట్టేసినట్టుగా చెబుతున్నారు. కొనుగోలుదారుడుగానీ, అమ్మకం దారుగానీ మాస్కు పెట్టుకోవడం లేదు. మాస్కులు ధరించిన వారు కూడా సక్రమంగా వాటిని ఉంచుకోవడం లేదు. జన సమూహాలున్న చోట్ల అయితే కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదని సదరు బృంద నివేదికలో తేల్చిచెప్పింది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే గనుక కోవిడ్‌ వ్యాప్తి విస్తృతంగా సాగుతుందన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఈ విధమైన నిర్లక్ష్య భావన కారణంగానే యూరప్‌లో మళ్ళీ కేసులు పెరిగిపోయి అక్కడి వారు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేస్తున్నారు. జనవరి వరకు ప్రజలు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని సూచిస్తున్నారు.

మరోపక్క కోవిడ్‌ వైరస్‌ జంతువుల్లోకి చేరి, అక్కడి నుంచి తిరిగి మనుష్యులకు వ్యాపిస్తున్నట్లుగా డెన్మార్క్‌లో జరిగిన ఒక పరిశోధనలో తేలింది. అక్కడ ఉన్ని కోసం పెంచే మింక్‌ అనే జంతువుకు కరోనా సోకి, దాన్నుంచి మనుషులకు వచ్చినట్లు పరిశోధనలో తేల్చారు. ఈ క్రమంలో కోవిడ్‌ వైరస్‌ పలు మార్పులకు లోనైందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఫారమ్స్‌లో పెంచుతున్న మింక్‌లను సామూహికంగా వధించాలని కూడా అక్కడి ప్రభుత్వం ఆదేశించినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ సంఘటనపై ఇంకా లోతైన పరిశోధనలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి