iDreamPost

బంగారు నాన్నకు బాలయ్య క్లాప్ – Nostalgia

బంగారు నాన్నకు బాలయ్య క్లాప్ – Nostalgia

ఎన్టీఆర్ అనే పేరులోని పవర్ తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఈ నట శిఖరం కుటుంబం నుంచి వచ్చి స్టార్ గా ఎదిగిన ఒకే ఒక్క హీరో బాలకృష్ణ. అంత మంది ఉన్న సంతానంలోనూ ఇండస్ట్రీలో స్థిరంగా నిలుదొక్కుకుంది బాలయ్య ఒక్కడే. హరికృష్ణ అడపాదడపా మెరిసినా కొన్ని సినిమాలకే పరిమితమయ్యారు. ఇక ఇక్కడి ఫోటో విషయానికి వస్తే ఇది 1976లో విడుదలైన బంగారు మనిషి షూటింగ్ ఓపెనింగ్ తాలూకు పిక్.

లేలేత వయసులో నూనూగు మీసాల నుంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న బాలకృష్ణ మొహంలోని లేతదనాన్ని ఇందులో గమనించవచ్చు. అప్పటికే తెరంగేట్రం చేసినప్పటికీ నాన్న శిష్యరికంలో నటన, దర్శకత్వంలో ఓనమాలు దిద్దుకున్న బాలకృష్ణ ఆ తర్వాత ఆయనతో కలిసి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కలిసి సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ కెరీర్లోని చివరి చిత్రాల్లో ఒకటైన బ్రహ్మర్షి విశ్వామిత్రలోనూ బాలకృష్ణ ఓ కీలక పాత్ర చేశారు. ఇక బంగారు మనిషి విషయానికి వస్తే ఏ భీం సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో లక్ష్మి హీరోయిన్. హేమా చౌదరి రెండో కథానాయిక. గొల్లపూడి సంభాషణలు సమకూర్చారు.

త్రివేణి బ్యానర్ పై రూపొందిన ఈ కలర్ మూవీ అప్పట్లో మంచి కమర్షియల్ హిట్. కెవి మహదేవన్ సంగీతం కూడా ప్లస్ అయ్యింది. ఈ భీం సింగే తర్వాతి కాలంలో విజయ చందర్ తో కరుణామయుడు తీసి చరిత్ర సృష్టించారు. దానికన్నా ముందు ఎవరు దేవుడు అనే మరో చిత్రాన్ని రూపొందించారు. కరుణామయుడు గొప్ప విజయం సాధించిన తర్వాత అతి తక్కువ టైంలోనే 53 ఏళ్ళ చిన్న వయసులోనే భీం సింగ్ కాలం చేశారు. అయినప్పటికీ ఆయన సినిమా రంగానికి చేసిన సేవలు ఎంతో గుర్తింపుని ఇచ్చాయి. అందుకే బంగారు మనిషి నందమూరి అభిమానులకు ఒక చక్కని చిత్రంగా మిగిలిపోయింది. ఆ తర్వాత బాలయ్య చాలా సినిమాలకు ఎన్టీఆర్ క్లాప్ కొట్టినప్పటికీ ఈ పిక్ వాళ్లకు ఎప్పటికీ స్పెషల్ గా మిగిలిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి