iDreamPost

పరీక్షల రద్దుపై అమిత్‌ షాకు లోకేష్‌ లేఖ..! షరతులు వర్తిస్తాయి..!!

పరీక్షల రద్దుపై అమిత్‌ షాకు లోకేష్‌ లేఖ..! షరతులు వర్తిస్తాయి..!!

ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని ఆన్‌లైన్‌ పోరాటాలు, కోర్టుల్లో పిటిషన్లు వేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఉద్యమం మరో దశక చేరుకుంది. రాష్ట్రంలో పది, ఇంటర్‌పరీక్షలు రద్దు చే యడంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. అయితే ఆ లేఖలో లోకేష్‌ పొందుపరిచిన సమాచారం వాస్తవానికి భిన్నంగా ఉండడమే ఆశ్చర్యపరుస్తోంది. కేంద్ర హోం మంత్రిని కూడా తికమక పెట్టే విధంగా లేఖ రాశారు లోకేష్‌.

దేశంలోని 14 రాష్ట్రాలు, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ బోర్డులు కూడా పరీక్షలు రద్దు చేశాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించేందుకే సిద్ధమవుతోందంటూ పేర్కొన్నారు. జూన్‌ 7 నుంచి 6.70 లక్షల పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, ఇంటర్‌ విద్యార్ధులు పరీక్షల పట్ల అనిశ్చితితో ఉన్నారంటూ లోకేష్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. పరీక్షలు జరిగితే విద్యార్థులు కరోనా సూపర్‌స్పైడర్లుగా మారుతారంటూ చెప్పుకొచ్చారు.

లోకేష్‌ తన లేఖలో పేర్కొన్న అంశాలు పరిశీలిస్తే.. అమిత్‌షాను కూడా తప్పుదోవ పట్టించేలా ఉంది. సీబీఎస్‌ఈ కూడా పరీక్షలు రద్దు చేసిందని చెప్పుకొచ్చారు లోకేష్‌. ఇది వాస్తవం కాదు. సీబీఎస్‌ఈ కేవలం పదో తరగతి పరీక్షలను మాత్రమే రద్దు చేసింది. ఇంటర్‌ పరీక్షలపై ఈ నెల 23వ తేదీన అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోక్రియాల్‌ సమీక్ష నిర్వహించారు. పరీక్షలు నిర్వహించాలా..? వద్దా..? అనే అంశంపై రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపాయని కేంద్రం ప్రకటించింది. కోవిడ్‌ జాగ్రత్తలతో.. మునుపటికి భిన్నంగా పరీక్ష పేపర్లు ఉండేలా, విద్యార్థులు చదివే కాలేజీల్లోనే పరీక్షలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు చేసింది. వ్యాసరూప ప్రశ్నలకు బదులు షార్ట్‌ క్వశ్చన్స్, ఆబ్జెక్టీవ్‌ ప్రశ్నలతో తక్కువ సమయంలో పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పరీక్షల ప్రాముఖ్యత ఏమిటో ముంబై హైకోర్టు కూడా ఇటీవల స్పష్టం చేసింది.

వాస్తవం ఇలా ఉంటే.. లోకేష్‌ మాత్రం ఏపీలో పరీక్షలు రద్దు చేయాలంటూ హంగామా చేస్తున్నారు. సీబీఎస్‌ఈసీ పరీక్షలు రద్దుపై మాత్రం తన లేఖలో లోకేష్‌ మాటవరసకైనా ప్రస్తావించలేదు. కేంద్ర పరిధిలోని పరీక్షల రద్దుపై లోకేష్‌ పోరాటం చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా ఉంది. తమ పార్టీ ఏపీకే పరిమితం కాబట్టి.. ఏపీలోని పరీక్షల రద్దుకే తాము పోరాటాలు చేస్తామన్నట్లుగా లోకేష్‌ తీరు ఉంది. పరీక్షల నిర్వహణ అంశం విద్యాశాఖ పరిధిలోది అయితే.. లోకేష్‌ మాత్రం అమిత్‌షాకు లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.

Also Read : పరీక్షలపై ఇప్పుడేమంటారో..? జగన్ సర్కారు చెబితే నై అని, కేంద్రం ముందుకు రాగానే సై అంటారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి