iDreamPost

మెచ్యూరిటీ పెరగాలి చినబాబు

మెచ్యూరిటీ పెరగాలి చినబాబు

రాజకీయ నేతలు ప్రజా జీవితంలో ఉంటారు. వారు చేసే పనులు, వ్యాఖ్యలను ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. పొరపాటున గానీ నోరు జారితే.. సదరు రాజకీయ నాయకుడి ప్రజా జీవితం తిరగబడుతుంది. అందుకే మాట్లాడేముందు ఆలోచించాలి అంటారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు పరిపక్వత చాలా అవసరం. సదరు నేత మెచ్యూరిటీ రాజకీయాలు చేస్తున్నారా..? లేదా..? అనేది ఆయన చేసే ప్రకటనలు, వ్యాఖ్యల ద్వారా ఇట్టే తెలిసిపోతుంది.

దాదాపు దశాబ్ధం పాటు రాజకీయాల్లో ఉంటూ, పెద్దల సభలో సభ్యుడిగా, మంత్రిగా పని చేసిన నారా లోకేష్‌లో రాజకీయ పరిపక్వత మాత్రం ఇంకా రాలేదని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా మరోమారు రుజువవుతోంది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా.. వైఎస్‌ వివేకా మరణాన్ని తెరపైకి తెచ్చారు లోకేష్‌. వివేకా హత్య కేసులో జగన్‌ కుటుంబానికి సంబంధం ఉందని ఆరోపించారు. ఎలాంటి సంబంధం లేకపోతే ఈ నెల 14వ తేదీన తిరుమలలో ప్రమాణం చేయాలంటూ చినబాబు సవాల్‌ విసిరారు.

14వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం వెళుతున్నారు. 14న సీఎం జగన్‌ వస్తారని తెలిసే.. ఇలాంటి సవాల్‌ లోకేష్‌ చేశారని అర్థమవుతోంది. అయితే లోకేష్‌ సవాల్‌లో అసలు అర్థం, తర్కం ఉందా..? అంటే లేదనే చెప్పాలి. వైఎస్‌వివేకా మరణంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇటీవల వైఎస్‌విజయమ్మ కూడా ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఎండగట్టారు. వివేకా ఘటన వెనుక ఎవరు ఉన్నారనేది తేల్చాలన్నదే తన, తన కుమారుడు జగన్, కుమార్తె షర్మిల మాటని తేల్చి చెప్పారు.

వైఎస్‌ ఫ్యామిలీ స్టాండ్‌ ఏమిటో విజయమ్మ ప్రకటన ద్వారా తేలిపోయింది. ఇక చినబాబు సవాల్‌ విషయానికి వస్తే.. నేరాలపై ప్రమాణం చేయడం ద్వారా దోషులను నిర్థారిస్తారా..? అలా నిర్థారించి శిక్షలు వేస్తారా..? అలా అయితే చట్టాలు, సెక్షన్లు, న్యాయస్థానాలు, జైళ్లు.. ఈ వ్యవస్థలు ఎందుకు..? అనే ప్రశ్నలు సవాల్‌ చేసే ముందు చినబాబు బుర్రకు తట్టనట్లుగా ఉన్నాయి. అందుకే మెచ్యూరిటీ లేని రాజకీయాలు చేస్తూ ప్రజలను తెలివిని బయటపెట్టుకుంటున్నారు.

ఇక దున్న ఈనిందంటే తీసుకెళ్లి కట్టేయమన్న చందంగా.. అధినాయకుడి కుమారుడుకు జేజేలు పలికేందుకు టీడీపీ నేతలు రెడీగా ఉంటున్నారు. లోకేష్‌ తానా అంటే తందానా అంటున్నారు. లోకేష్‌ సవాల్‌ను స్వీకరించాలంటూ మాజీ మంత్రులు, టీడీపీ నేతలైన కేఎస్‌ జవహర్, అయ్యన్నపాత్రుడులు మైకులు అందుకుంటున్నారు. సవాల్‌కు స్పందించకుండా మౌనంగా ఉంటే.. నేరం చేసినట్లేననే పాత చింతకాయ పచ్చడి నానుడిని అయ్యన్నపాత్రుడు గుర్తు చేస్తున్నారు. నారా లోకేష్‌ తర్కం లేని ప్రకటనలు చేస్తుంటే.. ఆయన్ను మరింత పక్కదారి పట్టించేలా ఆ పార్టీ నేతలు ఆయా ప్రకటనలను సమర్థిస్తుండడం టీడీపీ కార్యకర్తలు కూడా గమనిస్తున్నారు.

Also Read : ఇంత అహమేలా లోకేష్..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి