iDreamPost

అంత అసహనం ఎందుకు చినబాబు..?

అంత అసహనం ఎందుకు చినబాబు..?

మన బతుకు మనం బతుకుతున్నప్పుడు ఎవరూ మన జోలికి రారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాక రాళ్లు పడుతుంటాయి, పూలు పడుతుంటాయి. పూలు పడినప్పుడు పల్లికిలించి.. రాళ్లు పడినప్పుడు మొహం చిట్లించడం రాజకీయాల్లో కుదరదని చెబుతుంటారు. పొగడ్తలైనా, విమర్శలైనా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రజా సేవలో ఉన్నవాళ్లు తప్పక తీసుకోవాల్సిందే. విమర్శలను మేము తీసుకోం, సహించబోం అంటే.. ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయం. ఇది జగమెరిగిన సత్యం. రాజకీయాల్లో ఉన్న వారిపై విమర్శలు సహజం. వాటిని ఎలా తీసుకుని, స్పందిస్తున్నామనే దానిపై సదరు రాజకీయ నాయకుడి లక్షణాలు ఏమిటి..? నాయకత్వ పటిమ ఎలాంటిది..? అంచనా వేస్తారు. విమర్శలు స్వీకరించినవాడే రాణించగలుగుతాడని చరిత్ర చెబుతోంది.

వారికే అసహనం ఎక్కువైంది..

సాధారణంగా అధికారంలో ఉన్న వారిపై విమర్శలు, ఆరోపణలు అధికంగా ఉంటాయి. ప్రతిపక్షాలు, పత్రికల విమర్శలు వారు ఎదుర్కొవాల్సి ఉంటుంది. పాలకులు సదురు విమర్శలపై అసహనం వ్యక్తం చేస్తూ.. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడితే ప్రజల విశ్వాసం కోల్పోయినట్లే. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వారి కన్నా.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలకే అసహనం ఎక్కువైపోతోంది.  ప్రతిపక్షం విమర్శలు, ఆరోపణలను ఏ మాత్రం సహించడంలేదని తాజాగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ చేసిన ఘన కార్యం ద్వారా తేటతెల్లమవుతోంది.

తన మనస్తత్వాన్ని చాటుకున్న లోకేష్‌..

మంగళవారం నారా లోకేష్‌ నివర్‌ తుఫాను బాధిత రైతులను పరామర్శించేందుకు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత.. పార్టీ కార్యకర్తలతో కలసి ‘సాక్షి’ పత్రిక ప్రతులను దహనం చేసి తన అపరిపక్వతను మరోసారి బయటపెట్టుకున్నారు. ప్రజా స్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం అంటారు. స్వతంత్ర పూర్వం, భారత స్వతంత్ర సంగ్రామంలోనూ, ఆ తర్వాత స్వతంత్ర భారతంలోనూ పత్రికలు నిర్వర్తించిన విధి మాటల్లో వర్ణించలేనిది. ఇటీవల కాలంలో పత్రికలు రాజకీయ రూపు సంతరించుకున్న వాస్తవం అందరూ అంగికరించేదే. ఈ క్రమంలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. గతంలో తటస్థంగా ఉండే అన్ని పత్రికలు.. నేడు తాము తటస్థం అని ఒక్క పత్రికా చెప్పుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా పత్రికల పని తీరు రాజకీయ నాయకులకు నచ్చకపోవచ్చు. కానీ ఏ నాయకుడు కూడా నేరుగా పత్రికలను దహనం చేసిన దాఖలాలు తెలుగు రాజకీయ చరిత్రలో లేదు. అయితే ఆ పార్టీ లేదా నాయకుడి అనుచరులు దహనం చేసిన ఘటనలు ఉన్నాయి. కానీ టీడీపీ భావి ముఖ్యమంత్రి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌ నేత అయిన నారా లోకేష్‌.. ఇప్పుడే పత్రికలపై ఇంత అసహనం వ్యక్తం చేస్తుండడాన్ని బట్టీ ఆయన రాజకీయ భవిష్యత్, నాయకత్వ లక్షణాలపై ఒక అవగాహనకు వస్తున్నారు.

కళ్లెదుటే సాక్ష్యం ఉన్నా..

ప్రస్తుతం రాజకీయ నాయకులు, పత్రికలు ఎలా పనిచేస్తాయోనన్న విషయం నారా లోకేష్‌కు తెలియంది కాదు. ఆయన కళ్లముందే ఎన్నో ఘటనలు జరిగాయి. ఉదహారణకు వైఎస్‌ జగన్‌ను తీసుకుంటే.. ఆయనపై ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా టీడీపీ అనుకూల న్యూస్‌ ఛానెళ్లు రాసిన కథనాలు, చేసిన దుష్ప్రచారం చెప్పలనవికాదు. వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా లక్ష కోట్లు అంటూ.. టీడీపీ నేతలు, ఎల్లో మీడియాగా పిలిచే మీడియా సంస్థలు సాగించిన ప్రచారం లోకేష్‌ కళ్లముందే జరిగింది. ఇందులో చినబాబు కూడా పాత్రధారే. అయితే ఇంత జరిగినా.. సీఎం వైఎస్‌ జగన్‌.. ఆయా మీడియా సంస్థలను టీడీపీవి అని, ఎల్లో మీడియా అని సంబోధించారే తప్పా.. ఏనాడు ఆ పత్రికలను దహనం చేయలేదు. అసత్య ప్రచారం చేస్తున్న పత్రికలను దూరంగా పెట్టి నిరసన వ్యక్తం చేశారే గానీ.. ఆ పత్రిక సంస్థలపై భౌతికదాడులకు దిగలేదు. తన అభిమానులను ఆ దిశగా రెచ్చగొట్టలేదు. కానీ నారా లోకేష్‌ మాత్రం టీడీపీ కార్యకర్తలతో కలసి సాక్షి దినపత్రిక ప్రతులను దహనం చేయడం ఆయన తెలివితేటలకు, మనస్తత్వానికి అద్దం పడుతోంది.

Read Also : అది నా బాధ్యత : సీఎం వైఎస్‌ జగన్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి