iDreamPost

రంగంలోకి బ్రాహ్మణి.. జూనియర్ ను బాబు ఆపగలడా..?

రంగంలోకి బ్రాహ్మణి.. జూనియర్ ను బాబు ఆపగలడా..?

తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఓ చర్చ పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా జరుగుతోంది. దీనంతటికీ ఇటీవల నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు ఇచ్చిన విందేనని అర్థమవుతుంది. అయితే దశాబ్దాల తరబడి నందమూరి నారా కుటుంబాలు కుటుంబాల్లో పరిస్థితులు పైకి బాగానే ఉన్నా.. ఇరు కుటుంబాల్లో లోలోపల ఎలా ఉన్నా.. అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్న సంగతి అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటన ద్వారా బయట పడుతూనే ఉన్నాయి. ఈక్రమంలో తాజాగా 2019లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడం.. ఇప్పటివరకు పార్టీ అధ్యక్షుడిగా పార్టీని నడిపించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు వయసు మీద పడడమే ఇప్పుడు పలు అనుమానాలు రావటానికి కారణం.

చంద్రబాబు తర్వాత లోకేష్ పార్టీలో ప్రస్తుతం కీలక నేతగా ఉన్నారు. చంద్రబాబు తర్వాత స్థానంలో లోకేష్ ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా లోకేష్ నాయకత్వాన్ని ముక్తకంఠంతో పార్టీ మొత్తం సమర్ధిస్తుందా అంటే అనుమానమే. లోకేష్ పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాతే పార్టీ భ్రష్టు పట్టిందని కొందరు ఇన్ డైరెక్ట్ గా చేసిన వాదన. గతంలో టిడిపి వీడిన సమయంలోనూ లోకేష్ పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన లేవనెత్తిన అంశాలు అత్యంత ప్రాధాన్యత కలవి. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని అయితే ఎన్టీఆర్ పార్టీ లోకి వస్తే ఖచ్చితంగా లోకేశ్ ను ఎవరూ పట్టించుకోరని అందుకే చంద్రబాబు ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారని చెప్పుకొచ్చారు.

ఒకవేళ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీల రోల్ పోషించాల్సి వస్తే ఆయనే అధ్యక్షుడిగాను, అధినాయకుడిగానూ వ్యవహరించాలి తప్ప పార్టీలో ఏదైనా పదవి తీసుకుని లేదా పార్టీకోసం పనిచేస్తూ ఓ సంతృప్తికర నాయకుడిగా ఎన్టీఆర్ ఉండడం అనేది జరగని పని. మరోవైపు లోకేష్ విషయంలో చంద్రబాబు అనేక జాగ్రత్తలు తీసుకున్నా అవి ఫలించలేదనే చెప్పుకోవాలి. తనకు అప్పగించిన నియోజకవర్గంలోనే లోకేష్ గెలవలేక పోవడం ప్రధాన కారణం. ఇప్పటి వరకు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఇదంతా ముందే గమనించిన చంద్రబాబు లోకేష్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. పార్టీ కార్యక్రమలోనూ పెద్దపీట వేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న లోకేష్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రి పదవి కట్టబెట్టారు. అయినా పార్టీ విషయంలో గానీ మంత్రిగా తనకు అప్పగించిన బాధ్యత లో గాని లోకేష్ తన మార్క్ చూపించలేకపోయాడు. పైగా ఎక్కడికక్కడ విమర్శల పాలయ్యాడు. ఎన్నో సందర్భాల్లో అభాసుపాలయ్యాడు. పార్టీ కార్యక్రమాల్లో కనీసం మాట్లాడలేకపోయేవాడు. సోషల్ మీడియాలో అయితే లోకేష్ ముద్దపప్పు, శుద్ధపప్పు అని అంతా డిసైడ్ చేసేసారు. ఆయన వ్యవహార శైలి కూడా అలానే ఉండేది.

లోకేష్ తో పెట్టుకుంటే పార్టీ ముందుకెళ్లడం అసాధ్యం అనే భావన ఆ పార్టీ నేతల్లోనే కలిగింది. 2019లో పార్టీ దారుణంగా ఓడిపోవడం వెనుక లోకేష్ పాత్ర కూడా ఉందని చాలామంది సొంత పార్టీ నాయకుల అభిప్రాయం. ఒకవేళ 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే క్రెడిట్ మొత్తం లోకేష్ కు ఇచ్చి, మరో 4నాలుగైదు శాఖలకు మంత్రిని చేసి ఆయనే మన భావి నాయకుడనే భావన పార్టీ క్యాడర్ లో చంద్రబాబు కలిగించేవారు. కానీ అలా జరగలేదు.. అయితే అది వేరే విషయం.. ఈ క్రమంలో సరిగ్గా మాట్లాడటమే రాని లోకేష్ కింద మేము ఎందుకు పని చేయాలంటూ కొందరు యువ ఎమ్మెల్యేలు చర్చించుకున్నారట.. ఇదే విషయాన్ని వల్లభనేని వంశీ కూడా బయటపెట్టారు. అయితే లోకేష్ ను సాన పెట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆయనకు అనేక సార్లు క్లాసులు చెప్పించారనే ప్రచారం కూడా జరిగింది. నిత్యం పార్టీ సీనియర్ నేతలతో లోకేష్ ఉండేలా ప్లాన్ చేశారు. అయినా ఎంతచేసినా లోకేష్ లో మార్పు రాకపోవడంతో భార్య బ్రహ్మణితో కలిసి లోకేష్ పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షించేలా ముందుకు కదులుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా జరిగిన విందు కూడా ఈ కోవలోకి వస్తుందని అర్థమవుతుంది. మొత్తమ్మీద జూనియర్ ఎన్టీఆర్ అడుగు టిడిపిపై పట్టకుండా ఉండేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం అంటూ లేకపోవడం లేదు. అయితే ప్రజలు పిలిస్తే, పార్టీ కోరుకుంటే, తండ్రి హరికృష్ణ ఆశయ సాధన ఆహ్వానిస్తే, తాత నందమూరి తారక రామారావు ఆశీస్సులతో పార్టీ కార్యకర్తల కోసం ఎన్టీఆర్ కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాల్సి రావడం మాత్రం తథ్యం అనేది చంద్రబాబు గ్రహించాలి. ఈలోపు చంద్రబాబు, లోకేష్ ఎన్టీఆర్ ను కట్టడి చేసే విధానాల్లో తేడావస్తే రేపు ఎన్టీఆర్ వచ్చాక పార్టీలో లోకేష్ కు స్థానం ఉండకపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. 

Read Also : చిక్కుల్లో చంద్రబాబు శిష్యుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి