iDreamPost

నంద్యాల ఆటో డ్రైవర్‌ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

నంద్యాల ఆటో డ్రైవర్‌ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్‌ అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఇద్దరు ఐపీఎస్‌లతో ప్రారంభమైన విచారణ వేగంగా జరుగుతోంది. సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నంద్యాల సీఐ సోము శేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వారిద్దరినీ అరెస్ట్‌ చేశారు.

సలాం ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు 70 వేలు పోయాయని ప్రయాణికుడు భాస్కర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ సోము శేఖర్‌రెడ్డి ఆటో డ్రైవర్‌ సలాంను స్టేషన్‌కు పిలిచి విచారించారు. తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేసినట్లు సలాం సెల్పీ వీడియోలో తెలిపారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. మంగళవారం భార్య, కుమార్తె, కుమారుడులతో కలసి నంద్యాల నుంచి పాణ్యం వెళ్లారు. అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులతోపాటు కర్నూలు డీఐజీ వెంకటరామిరెడ్డి ఈ కేసును విచారిస్తున్నారు. మూడు రోజుల్లో దర్యాప్తును పూర్తి చేస్తామని తెలిపారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేదిలేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు.

అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. దంపతులు పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంపై విచారం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింలను వేధిస్తూ అక్రమ కేసులు పెడుతోందనేందుకు సలాం కుటుంబం ఆత్మహత్య నిదర్శనమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయంటున్న ప్రభుత్వం.. దీనికి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి