iDreamPost

చైతు సినిమాకు వసూళ్ల ఛాలెంజ్

చైతు సినిమాకు వసూళ్ల ఛాలెంజ్

ఇంకో ఆరు రోజుల్లో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న లవ్ స్టోరీ తెరమీదకు రాబోతోంది. టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. నాగ చైతన్య, నిర్మాతలు , శేఖర్ కమ్ముల ఆల్రెడీ ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు. సాయి పల్లవి వేరే షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఇంకా బయటికి రాలేదు. రేపో ఎల్లుండో అది కూడా చేసేస్తారు. ఇదిలా ఉండగా చైతు కెరీర్ లోనే బిగ్ రిలీజ్ దక్కించుకోబోతున్న లవ్ స్టోరీకి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు వచ్చేశాయట. 150 నుంచి 200 రూపాయల దాకా మొదటి వారం రోజులు టికెట్లు అమ్ముకునే అనుమతులు వచ్చినట్టు చెబుతున్నారు. అయితే పెద్ద మల్టీ ప్లెక్సులు తప్ప మిగిలినవి పెంచేందుకు సుముఖంగా లేవని టాక్.

అసలే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చేందుకు ముందువెనుకా ఆడుతున్నారు. ఇలాంటి టైంలో అడ్డగోలుగా రేట్లు పెంచితే అసలుకే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా ఓకే. ఒకవేళ యావరేజ్ అంటే మాత్రం దాని ప్రభావం రెండో రోజు నుంచే ఉంటుంది. దాని బదులు హ్యాపీగా పాత రేట్లు ఉన్నాయంటే సారంగదరియా పాట కోసమో చైతు సాయిపల్లవిల కాంబో కోసమో ఒక్కసారైనా థియేటర్ కు వచ్చే వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఈ సమీకరణాలు చూసుకున్నాకే డిస్ట్రిబ్యూటర్లు ఈ నిర్ణయానికి వచ్చారట. ముఖ్యంగా సింగల్ స్క్రీన్లలో అధిక శాతం ఓల్డ్ రేట్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక ఏపి విషయానికి వస్తే ఈ నెల 30 దాకా కర్ఫ్యూ నిబంధనలు పొడిగించారు. అంటే సెకండ్ షోలు లేవన్న మాట. దీంతో లవ్ స్టోరీకి ఉదయం 8 నుంచి 9 మధ్యలోనే రోజూ షోలు మొదలుకాబోతున్నాయి. యాభై శాతం ఆక్యుపెన్సీ కంటిన్యూ చేస్తారు కాబట్టి ఎక్కువ స్క్రీన్లు కేటాయించబోతున్నారు. టికెట్ రేట్లు తక్కువే కనక ముఖ్యంగా బిసి సెంటర్లలో వసూళ్లు భారీగా వస్తాయనే అంచనాలో ఉన్నారు పంపిణీదారులు. సీటిమార్, ఎస్ఆర్ కళ్యాణ మండపం లాగా మొదటి అయిదారు రోజులకు పరిమితం కాకుండా లవ్ స్టోరీ స్టడీగా పదిరోజులకు పైగా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టిస్తుందనే నమ్మకం వాళ్ళలో ఉంది. చూడాలి మరి ఎలాంటి రికార్డులు వస్తాయో

Also Read : విజయ రాఘవన్ రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి