iDreamPost

ఔరా.. అభ్యర్థి..!!

ఔరా.. అభ్యర్థి..!!

ఎంపీటీసీగా గెలవడం కన్నా.. ఎంపీగా సులువుగా గెలవచ్చని ఓ నానుడి. గ్రామ స్థాయిలో అనే రాజకీయాలు. పార్టీలోనే వ్యతిరేకులు. గతంలో జరిగిన అన్ని ఘటనలు ఈ ఎన్నికల సమయంలో గుర్తుకు వస్తాయి. ఎంపీటీసీ సీటు సాధించడం నుంచీ పోలింగ్‌ వరకూ ఆశానువాహులు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుంది. వెన్నుపోట్లు లెక్కలేనన్ని ఉంటాయి. అందుకే అభ్యర్థులు తమ పార్టీలోని సహచరులు, కార్యకర్తలను ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. పలకరింపులు, బుజ్జగింపులు, హామీలు.. ఇలా మునుపెన్నడూ లేని చిత్రాలు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. తమ సహజసిద్ధ వైఖరికి భిన్నంగా ప్రవర్తిస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను చూసి స్థానికులు ఔరా..! అనుకుంటున్నారు.

నేటి నుంచి నామినేషన్లు…

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాబోతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు నేడు సోమవారం నుంచి స్వీకరించనున్నారు. మూడు రోజుల పాటు అంటే బుధవారం వరకు గడువు ఉంది. నామినేషన్లకు మూడు రోజులే గడువు ఉండడంతో పార్టీలు, అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన స్థానాల్లో నామినేష్లకు సిద్ధం అవుతుండగా.. ఇంకా అభ్యర్థిత్వాలు ఖరారు కాని ప్రాంతాల్లో స్థానిక నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఒకే విడతలో పోలింగ్‌..

జడ్పీటీసీ స్థానానికి ఆయా జిల్లాల జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లోనూ, ఎంపీటీసీ స్థానాలకు మండల పరిషత్‌ కార్యాలయాల్లోనూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. బుధవారం నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత మరుసటి రోజు వాటిని పరిశీలించనున్నారు. శుక్రవారం అభ్యంతరాలు స్వీకరిస్తారు. శనివారం అభ్యంతరాల పరిష్కారం, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. రాష్ట్రంలో 660 జడ్పీటీసీ స్థానాలకు, 9989 ఎంపీటీసీ స్థానాలకు ఒకే విడతలో ఈ నెల 21వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. రెండు రోజుల విరామం తర్వాత 24వ తేదీన కౌంటింగ్‌ చేపట్టనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి