iDreamPost

ప్రవాహంలా తెలుగు సినిమా విరాళాలు

ప్రవాహంలా తెలుగు సినిమా విరాళాలు

కరోనా మహమ్మారితో ప్రభుత్వాలు ప్రజలు చేస్తున్న యుద్ధానికి టాలీవుడ్ మొత్తం తమకు చేతనైనంత సహాయం చేస్తూనే ఉంది. ఏదో ఒక మొత్తాన్ని ప్రకటించడంతో ఆపకుండా జనాన్ని చైతన్యపరిచేలా వీడియోలు కూడా రూపొందించి అవగాహన పెంచుతున్నారు. తమ స్థాయిని బట్టి ప్రతి ఒక్కరు ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. ప్రధాని ముఖ్యమంత్రుల సహాయ నిధులతో పాటు సినీ పరిశ్రమ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కరోనా క్రైసిస్ చారిటీకి విరివిగా విరాళాలు ఇస్తున్నారు. ఇవాళ డార్లింగ్ ప్రభాస్ ఇండస్ట్రీ కార్మికుల కోసం 50 లక్షలు ఇచ్చాడు. రెండు రోజుల క్రితం జాతీయ స్థాయిల్లో రాష్ట్రాలకు 4 కోట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అక్కినేని నాగార్జున ఇప్పటికే 1 కోటి సిసిసికి ఇవ్వగా నాగ చైతన్య 25 లక్షలు విడిగా ప్రకటించాడు. వరుణ్ తేజ్ 20 లక్షలు, సాయి ధరమ్ తేజ్ 20 లక్షలు, శర్వానంద్ 15 లక్షలు, సుధీర్ బాబు-కార్తికేయ చెరి 2 లక్షలు, అనిల్ రావిపూడి 10 లక్షలు, విశ్వక్ సేన్ 5 లక్షలు, వెన్నెల కిషోర్ 2 లక్షలు, లావణ్య త్రిపాఠి – ప్రణీత చెరో లక్ష ఇవ్వగా డబ్బు రూపంలో కాకుండా నిత్యావసరాలు వస్తు సామాగ్రి రూపంలో బాలకృష్ణ, ప్రకాష్ రాజ్, యాంకర్ ప్రదీప్, రాజశేఖర్, నిఖిల్, మంచు మనోజ్, శివాజీరాజా తదితరులు ఇతోధికంగా సహాయం చేస్తున్నారు. సుశాంత్ 2 లక్షలు ప్రకటించాడు. షూటింగులు ఆగిపోవడంతో రోజు వారి కనీస అవసరాలకు సైతం నోచుకోని ఎందరో కార్మికులను ఈ నిధి ఆదుకోబోతోంది. ఇప్పటిదాకా సుమారు 5 కోట్ల దాకా విలువైన సహాయం అందినట్టు తెలిసింది.

లాక్ డౌన్ ఇంకా రెండు వారాలకు పైగా ఉంది కాబట్టి అప్పటిదాకా తమ సభ్యులను కాచుకునే బాధ్యత సిసిసి తీసుకుంది. గంటలు గడిచే కొద్దీ ఇచ్చేవాళ్ళు ముందుకు వస్తూనే ఉన్నారు. థియేటర్లు మూతబడి ఎక్కడికక్కడ స్టూడియోలతో సహా ప్రతిఒక్కటి మూతబడటంతో వినోద రంగం చాలా గడ్డు పరిస్థితి ఎదురుకుంటోంది. ఈ నేపథ్యంలో నటీనటులు దర్శక నిర్మాతలు తాముగా ముందుకు వచ్చి చేపడుతున్న చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సహాయాన్ని ఒక క్రమ పద్ధతిలో అవసరార్థులకు అందించే విధంగా కమిటీ సభ్యులు ప్రణాళికలు వేస్తున్నారు. మరోవైపు ఇవి కాకుండా ఇంకెలాంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయొచ్చో అనే దిశలోనూ చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి సినిమా తారలు తెరమీదే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోలని నిరూపించుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి