iDreamPost

ప్రపంచ కప్-2015లో జరిగిన సంచలన విషయాలు వెల్లడించిన ఫాస్ట్ బౌలర్ షమీ

ప్రపంచ కప్-2015లో జరిగిన సంచలన విషయాలు వెల్లడించిన ఫాస్ట్ బౌలర్ షమీ

లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలో ఉంటున్న క్రికెటర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సహచర ఆటగాళ్లతో తమ గత అనుభవాలను పంచుకుంటున్నారు. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌తో ప్రపంచకప్‌-2015 అనుభవాలు పంచుకున్నాడు మహమ్మద్ షమీ. ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌ సంయుక్తంగా నిర్వహించిన 2015 వన్డే ప్రపంచకప్‌లో మోకాలి గాయంతోనే పాల్గొన్నట్లు చెప్పి భారత ఫాస్ట్‌బౌలర్‌ మహమ్మద్ షమీ బాంబు పేల్చాడు.

ప్రపంచకప్-2015 తొలి మ్యాచ్‌లోనే నా మోకాలికి గాయమైంది. గాయం కారణంగా వచ్చిన వాపుతో నా మోకాలు, తొడ ఒకే సైజులో కనిపించాయి. వైద్యులు ప్రతిరోజూ చికిత్స అందించేవారు. రోజుకు మూడు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకునేవాడిని. మెగా టోర్నీలో జట్టుకి నా అవసరం ఉండటంతో నొప్పిని భరిస్తూనే ఏడు మ్యాచ్‌లు ఆడానని చెప్పాడు. కానీ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌కి ముందు మోకాలి నొప్పి తీవ్రమైంది. దీంతో నేను మ్యాచ్‌ ఆడలేనని కెప్టెన్ ధోనీకి చెప్పేశాను. కానీ కీలకమైన సెమీఫైనల్‌లో కొత్త బౌలర్‌తో బౌలింగ్ చేయించలేమని యాజమాన్యం స్పష్టం చేసిందని షమీ పేర్కొన్నాడు.

చివరికి సెమీస్‌ బరిలో దిగి తొలుత ఐదు ఓవర్లు బౌలింగ్‌ చేసి 13 పరుగులిచ్చి అరోన్ ఫించ్ వికెట్ కూడా పడగొట్టాను. నొప్పిని తట్టుకోలేక ధోనీకి చెప్పి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోదామనుకున్నాను.పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్‌ తీసుకున్న తర్వాత నా పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఇక బౌలింగ్‌ చేయలేనని ధోనీతో చెప్పగా నాలో ఆత్మవిశ్వాసం నింపి బౌలింగ్‌ చేయించాడు’’ అని మహ్మద్ షమీ వెల్లడించాడు.

2015 ప్రపంచకప్‌ సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 328/7 స్కోర్‌ సాధించింది. లక్ష్య ఛేదనలో భారత్‌ 233 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 95 పరుగుల తేడాతో ఓటమి పాలై మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మెగా టోర్నీలో భారత్‌ తరఫున ఉమేశ్‌ యాదవ్‌ 8 మ్యాచ్‌లలో 18 వికెట్లు పడగొట్టగా,షమి 7మ్యాచ్‌లలో 17 వికెట్లతో రెండోస్థానంలో నిలిచాడు. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్ల జాబితాలో షమి నాలుగో స్థానంలో నిలిచాడు.

మోకాలి గాయం తీవ్రత కారణంగా అప్పట్లో నా కెరీర్ ముగిసిపోయిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే అదృష్టంకొద్దీ మళ్లీ ఫిట్‌నెస్ సాధించి మీ ముందుకు రాగలిగానని షమీ తెలిపాడు. ప్రపంచకప్ తర్వాత బౌలింగ్ ఫామ్ కోల్పోయిన షమీ గత ఏడాది అద్భుతంగా రాణించాడు. మళ్లీ మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకుంటూ అగ్రశ్రేణి బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి