iDreamPost

మోదుగుల అలక ఎవరిపై…?

మోదుగుల అలక ఎవరిపై…?

గత ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చి గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి. పోస్టల్‌ బ్యాలెట్‌పై పేరు రాయకపోవడంతో దాదాపు 10వేలకు పైగా ఓట్లను లెక్కించకపోవడంపై కోర్టును ఆశ్రయించాడు. దీనిపై కేసు నడుస్తోంది. అది పక్కన పెడితే.. పార్టీ గెలిచిన తర్వాత ఒక నెల అక్కడక్కడా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఆ తర్వాత నుంచి ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ అనుకూల వ్యతిరేక ప్రదర్శనలు జోరుగా సాగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఎవరెవరో స్పందిస్తున్నారు. అయితే గుంటూరు పార్లమెంట్‌కు పోటీచేసిన ఈయన నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన వెలవడలేదు. దీనికి కారణమేంటా అని కార్యకర్తలు ఆరా తీస్తే.. ఆయన అలకబూనారని తెలుస్తోందట.

తన పరిధిలోని ఎమ్మెల్యేలు చేసే కార్యక్రమాలకు తనను పిలవడం లేదని, తనను పట్టించుకోవడం లేదని అనుచరులకు చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు తన పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలవగా.. వారి మొత్తం మెజారిటీ 37 వేలు దాటుతోందని, ఎంపీ స్థానానికి వచ్చే సరికి తనకు తక్కువ ఓట్లు రావడానికి పార్టీ అభ్యర్థులే కారణమని చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తనకు వ్యతిరేకంగా పార్టీ అభ్యర్థులు, కొందరు నాయకులు పనిచేశారని ఆయన భావిస్తున్నారు. అలాంటి వారిపై సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకోవడం లేదంటూ తన అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారట.

నరసరావుపేట ఇచ్చి ఉంటే గెలిచేవాణ్ని..

తాను గతంలో ఎంపీగా గెలిచిన నరసరావుపేట పార్లమెంట్‌ స్థానం ఇచ్చి ఉంటే సులభంగా గెలిచేవాడినని మోదుగుల భావన. ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ మంచి అనుచరగణం తయారు చేసుకున్నారు. సమైఖ్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే విభజన తర్వాత ఆ స్థానానికి రాయపాటిని టీడీపీ ఖరారు చేసింది. తనకే స్థానం కావాలని చంద్రబాబును కోరినప్పటికీ ఇవ్వలేదు. గుంటూరు ఈస్ట్‌ అసెంబ్లీ సీటు కేటాయించారు. అక్కడ ఆయన గెలిచినప్పటికీ ఆ ఐదేళ్లు పూర్తి అసంతృప్తితోనే ఉన్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ బహిరంగంగానే చెప్పేవారు. చివరకు 2019 ఎన్నికల ముందర వైఎస్సార్‌సీపీలో చేరారు. అక్కడ నరసరావుపేట ఎంపీ సీటు ఇస్తారని భావించారు. అయితే చివరి నిమిషంలో పార్టీలోకి రావడంతో అది సాధ్యం కాలేదు. అప్పటికే లావుకృష్ణదేవరాయులు రెండేళ్లు గుంటూరు పార్లమెంట్‌ స్థానం పరిధిలో బాగా తిరిగారు. అయితే పలు కారణాల వల్ల ఆయన్ను నరసరావుపేటకు పంపించడం, అక్కడ గెలవడం తెలిసిందే.

ఆయనకు అధికారపార్టీపై ఎప్పుడూ అసంతృప్తే..

మోదుగుల వ్యవహార శైలి తెలిసిన కొందరు.. ఆయనకు అధికార పార్టీలో ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటారని, ఆయనను సంతృప్తిపరచడం ఎవరి వల్లా కాదంటూ విమర్శిస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడూ.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో ఉంటున్నప్పుడు ఆయన వ్యవహారశైలి అలాగే ఉందని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం ఎందుకుంటుందని, ఆయన పాల్గొంటే ఎవరన్నా అడ్డుపడుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

కొసమెరుపు..

ఇటీవల నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు గుంటూరు పరధిలో చురుగ్గా తిరుగుతున్నారు. ఇక్కడ ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. మొన్నటికిమొన్న రాజధాని రైతులను కలసి ప్రభుత్వం తరఫున హామీ కూడా ఇచ్చారు. ఈ పరిణమాలు దేనికి దారితీస్తాయో వేచిచూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి