iDreamPost

విలీన బాటలో మరో మూడు బ్యాంకులు….అవి ఏవంటే..?

విలీన బాటలో మరో మూడు బ్యాంకులు….అవి ఏవంటే..?

కేంద్రంలోని మోడీ స‌ర్కార్ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల విలీనం, ప్రైవేటీక‌ర‌ణ‌, పెట్టుబ‌డుల ఉసంహ‌ర‌ణ వంటి నిర్ణ‌యాలు వేగంగా తీసుకుంటుంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ప్రైవేటీక‌ర‌ణ‌కు నిర్ణ‌యం తీసుకుంది. ఆయా సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించింది. అలాగే మరికొన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించింది. మ‌రోవైపు బ్యాంకుల‌ను విలీనం చేసి…బ్యాంకింగ్ రంగాన్ని కుదించేస్తుంది. పెద్ద బ్యాంకు స్థాప‌నే ల‌క్ష్యంగా బ్యాంకుల విలీనం చేస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ గ‌తంలోనే తెలిపారు. అయితే మ‌రోవైపు బ్యాంకు ఉద్యోగ సంఘాలు, బ్యాంకింగ్ మేథావులు బ్యాంకులు ప్రైవేటీక‌ర‌ణ‌కు ముందుస్తు నిర్ణ‌య‌మే..బ్యాంకుల విలీనమ‌ని విమ‌ర్శిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోన్న‌ట్లు కేంద్రం చెబుతుంది. అందులో భాగంగానే బ్యాంకులను విలీనం చేసుకుంటూ వస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్పటికే మోడీ స‌ర్కార్ హ‌యంలో 14 బ్యాంకుల‌ను విలీనం చేయ‌గా, ఒక బ్యాంక్‌ను ప్రైవేటీక‌ర‌ణ చేశారు. అయితే ఇప్పుడు మరో మూడు బ్యాంకులు కూడా విలీన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ మూడు బ్యాంకులు ఇవే…

ఇప్ప‌టికే కొన్ని బ్యాంకుల విలీనం చేసిన కేంద్ర‌ ప్రభుత్వం మరోసారి బ్యాంకుల విలీనానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈసారి మరో మూడు బ్యాంకులను విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్ప‌టికే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రక్రియను ప్రారంభించింది. నీతి ఆయోగ్ బ్యాంకుల విలీన ప్రతిపాదనపై కేంద్ర‌ ప్రభుత్వ అధికారులు చర్చలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను విలీనం చేయాలని యోచిస్తోంది.

దేశంలో ప్ర‌స్తుతం 12 బ్యాంకులే…

ఇటీవ‌లి ప‌ది బ్యాంకుల‌ను నాలుగు బ్యాంకులుగా చేశారు. దీంతో 2017లో 27 బ్యాంకులు ఉంటే, ప్ర‌స్తుతం దేశంలో 12 బ్యాంకులు మాత్ర‌మే ఉన్నాయి. అందులో ఆరు విలీనం బ్యాంకులు, ఆరు స్వ‌తంత్ర బ్యాంకులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, యునియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ బ్యాంక్ లు విలీనం బ్యాంకులుగానూ, పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌, యుకో బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్ర‌ల్ బ్యాంక్ ఇండియాలు స్వ‌తంత్ర బ్యాంకులుగానూ ఉన్నాయి. ఈ 12 బ్యాంకుల‌తో పాటు ఒక పేమెంట్ సంబందించిన‌ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ప్రభుత్వం రంగంలో ఉంది. తాజాగా మూడు బ్యాంకులు విలీనం చేసేందుకు ప్ర‌భుత్వం యోచించిన నేప‌థ్యంలో దేశంలోని ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 నుంచి 9 ప‌డిపోతుంది.

బ్యాంకుల జాతీయక‌ర‌ణ‌

1955లో ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ప్ర‌భుత్వం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జాతీయం చేయడంతో బ్యాంకింగ్ వ్యాపారంలోకి కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశించింది. 1959లో నెహ్రూ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సబ్సిడియరీ బ్యాంక్స్) చట్టం ఆమోదించబడినప్పుడు…మరో ఏడు రాష్ట్ర బ్యాంకులు ఆ బ్యాంకుకు అనుబంధ సంస్థలుగా మారాయి. 1969 జూలై 19న ఇందిరా గాంధీ ప్ర‌భుత్వం 14 ప్ర‌ధాన బ్యాంకుల‌ను జాతీయం చేయ‌డంతో బ్యాంకింగ్ రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పు వ‌చ్చింది. దీంతో బ్యాంకుల ఉనికి పెరిగింది.

బ్యాంకింగ్ రంగంలో మొత్తం 84% ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. బ్యాంకింగ్ రంగంలో 1980 నుంచి ప్రభుత్వ బ్యాంకుల వాటా పెరుగుతూ వ‌చ్చింది. 1991 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు 90% వాటాను కలిగి ఉన్నాయి. ఏడాది తరువాత 1992 మార్చిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం శాఖలు భారతదేశం అంతటా విస్త‌రించాయి. రూ. 60,646 కోట్ల ఆదాయంతో ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు అగ్ర‌భాగాన ఉన్నాయి. అలాగే రూ.1,10,000 కోట్లు డిపాజిట్లు జ‌మ‌య్యాయి.

మోడీ హ‌యంలో పెద్ద ఎత్తున బ్యాంకుల విలీనం

2008 ఆగ‌ష్టు 13న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనుబంధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను విలీనం చేశారు. 2010 ఆగ‌ష్టు27న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌ను విలీనం చేశారు. పెద్ద మొత్తంలో బ్యాంకుల విలీనం మోడీ స‌ర్క‌ర్ హ‌యంలోనే ప్రారంభ‌మైంది. ఒకే ఆరు బ్యాంకుల‌ను విలీనం చేశారు. మోడీ స‌ర్కార్ గ‌ద్దెన‌క్కిన త‌రువాత 2017 ఏప్రిల్ 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ & జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, భారతీయ మహిళ‌ బ్యాంక్ ల‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు.

2018లో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ లను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. 2019 జనవరి నుంచి ఐడిబిఐ బ్యాంక్‌ను ప్రైవేట్ బ్యాంక్‌గా మారింది. 2019 ఆగ‌స్టు 20న ఆరు ప్ర‌భుత్వ రంగ‌ బ్యాంకుల‌ను విలీనం 2020 ఏప్రిల్ 1 నుంచి అమ‌లులోకి వ‌చ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎస్‌బి)లో ఒరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఒబిసి), యునైటెడ్ బ్యాంకు విలీనం అయ్యాయి. కెనరా బ్యాంక్ లో సిండికేట్ బ్యాంకు వీలీనం అయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు వీలినం అయ్యాయి. అలహబాద్ బ్యాంక్‌‌లో ఇండియన్ బ్యాంక్ విలీనం చేశారు. మొత్తం మోడీ స‌ర్కార్ హ‌యంలో 14 బ్యాంకుల‌ను వేరే బ్యాంకుల్లో విలీనం చేశారు. ఒక బ్యాంక్‌ను ప్రైవేటీకరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి