iDreamPost

వారిద్దరికీ మొండిచెయ్యి.. చీరాల టీడీపీకి కొత్త ఇంఛార్జి!

వారిద్దరికీ మొండిచెయ్యి.. చీరాల టీడీపీకి కొత్త ఇంఛార్జి!

అధికారం కోల్పోయి.. నేతలు, కార్యకర్తలు చెల్లాచెదురైపోయి కుంగిపోయిన తెలుగుదేశం పార్టీ.. మళ్లీ శక్తియుక్తులను కూడదీసుకుని నిలబడేందుకు నానాపాట్లు పడుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలు చేపట్టే ఇంఛార్జీల నియామకానికి కొన్ని నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఇంఛార్జీలను నియమిస్తున్న కొన్ని చోట్ల కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి అలాగే తయారైంది. అక్కడ ఇప్పటికే ఇద్దరు నాయకులు అధిష్టానం పెద్దలు ఇచ్చిన భరోసాతో వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ అని ఆశలు పెంచుకున్న తరుణంలో.. వారిద్దరినీ కాదని కొత్తవారిని ఉన్న ఫళంగా రంగంలోకి తీసుకొచ్చారు. దాంతో ఇప్పటివరకు ఉన్న ఇద్దరు నేతల పరిస్థితి ఏమిటన్న చర్చ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

కరణం బలరాం పార్టీ వీడటంతో..

గత ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే కరణం బలరాం పార్టీ వీడటంతో మరో నేత యడం బాలాజీకి అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దాదాపు ఏడాదిన్నర నుంచీ బాలాజీయే కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వచ్చే ఎన్నికల్లో తనకే పోటీచేసే అవకాశం లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు మంగళగిరి టీడీపీ నేత గంజి చిరంజీవి కూడా కొన్ని నెలలక్రితం లోకేష్ ఇచ్చిన భరోసాతో చీరాలపై ఆశలు పెంచుకున్నారు.

2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి అతి స్వల్ప తేడాతో ఓడిపోయిన చిరంజీవి.. 2019 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేద్దామనుకున్నారు. కానీ చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేయడానికి వీలుగా చిరంజీవిని పక్కన పెట్టేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అప్పట్లో ఆయనకు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఎమ్మెల్సీ హామీ గంగలో కలిసిపోయింది. దాంతో వచ్చే ఎన్నికల్లోనైనా మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆశతో ఉన్న చిరంజీవికి మళ్లీ ఆశాభంగం ఎదురైంది. ఓడిన చోట మళ్లీ గెలిచి సత్తా నిరూపించుకుంటానని శపథం చేసిన లోకేష్ నియోజకవర్గంలో కలియతిరుగుతున్నారు. దాంతో నిరాశకు గురైన చిరంజీవి.. తన పరిస్థితి ఏమిటని నేరుగా లోకేష్ నే అడిగారు. ‘మంగళగిరిలాగే మీ సామాజికవర్గం అధికంగా ఉన్న చీరాలలో అవకాశం ఇస్తాం.. అక్కడికి వెళ్లి పనిచేసుకోండి’ అని లోకేష్ హామీ ఇచ్చారు. దాంతో ఇష్టం లేకపోయినా లోకేష్ హామీ ఇచ్చారన్న నమ్మకంతో కొన్ని నెలలుగా గంజి చిరంజీవి చీరాలలో పర్యటిస్తూ అక్కడి క్యాడర్ లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

రంగంలోకి మూడో కృష్ణుడు

అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు యడం బాలాజీ టీడీపీ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. లోకేష్ భరోసాతో మంగళగిరి నుంచి వచ్చిన చిరంజీవి కూడా వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ అని చెప్పుకుంటూ తిరుగుతుండటం ఇప్పటికే నియోజకవర్గ టీడీపీలో రెండు వర్గాలకు ఆస్కారం ఇచ్చింది. ఈ తరణంలో రెండురోజుల క్రితం చీరాల నియోజకవర్గ నేతలతో అధినేత చంద్రబాబు జరిపిన సమావేశంలో కొత్త నేత తెరపైకి వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో చీరాల నియోజకవర్గ ఇంఛార్జిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎం.ఎం.కొండయ్య పేరును ఖరారు చేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కొండయ్య ఆ తర్వాత పార్టీకి దూరం అయ్యారు. ఇటీవలే తిరిగి పార్టీలోకి వచ్చారు. ఈ పరిణామంతో చీరాలపై ఆశలు పెట్టుకున్న యడం బాలాజీ, గంజి చిరంజీవి హతాశులయ్యారు. తమలో ఆశలు రేపి చివరికి మొండి చెయ్యి చూపారని ఆవేదన చెందుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి