iDreamPost

సత్తా చాటిన అన్నా రాంబాబు.. పత్తాలేని జనసేన

సత్తా చాటిన అన్నా రాంబాబు.. పత్తాలేని జనసేన

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మరో సారి తన సత్తాను చాటారు. గిద్దలూరు అసెంబ్లీకి 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజారిటీ ( 81,035)తో గెలిచిన అన్నా రాంబాబు తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ తన బలాన్ని నిరూపించుకున్నారు. గిద్దలూరు నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ హవా సాగింది. 20 వార్డులకు గానీ వైసీపీ 16 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం మూడు వార్డులకు పరిమితం అయింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. జనసేన పార్టీ ఖాతానే తెరవలేదు.

ఈ ఏడాది ప్రారంభంలో గిద్దలూరులో జరిగిన రాజకీయ పరిణామాలతో తాజా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి పెరిగింది. ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యవహారశైలి వల్ల జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. గిద్దలూరు వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పవన్‌.. అక్కడ ప్రెస్‌మీట్‌ నిర్వహించి అన్నా రాంబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నా రాంబాబు పతనం ప్రారంభమైందని, అథఃపాతాళానికి తొక్కుతానని హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా రాంబాబును అడుగుపెట్టనీయనంటూ పవన్‌ శపధాలు చేశారు.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌కు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా ధీటుగా జవాబు ఇచ్చారు. జనసేన కార్యకర్త మృతికి తాను కారణమని నిరూపిస్తే చట్ట ప్రకారం ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తనపై పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయాలని సవాల్‌ చేశారు. ప్రజా తీర్పు కోరదామని చెప్పిన అన్నా రాంబాబు.. తాను ఓడిపోతే జనసేన కార్యకర్త ఆత్మహత్యకు బాధ్యత వహిస్తానని, కోర్టు ఏ శిక్ష వేసినా శిరసావహిస్తానని చెప్పారు. పవన్‌ ఓడిపోతే జనసేన పార్టీ మూసేస్తారా..? అంటూ సవాల్‌ విసిరారు.

ఈ పరిణామాలు జరిగిన రెండు నెలల లోపే మున్సిపల్‌ ఎన్నికలు రావడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. అన్నా రాంబాబును దెబ్బకొట్టేందుకు జనసేన ఈ ఎన్నికల్లో పని చేస్తుందా..? జనసేన అధినేత ఏం చేయబోతున్నారు..? అనే అంశాలపై చర్చ జరిగింది. అయితే పవన్‌ కల్యాణ్‌ మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందని మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో మరోమారు రుజువైంది. 20 వార్డులకు గాను వైసీపీ 16 వార్డులు గెలుచుకోగా.. అన్నా రాంబాబును అధఃపాతాళానికి తొక్కేస్తానన్న జనసేన అధినేత పవన్‌ ఇక్కడ తన పార్టీ తరఫున ఒక్క కౌన్సిలర్‌ను కూడా గెలిపించుకోలేకపోవడం విశేషం.

Also Read : గొట్టిపాటిని నిరాశపరిచిన అద్దంకి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి