iDreamPost

అమరావతికి ప్రజా మద్దతు కరువు..!!

అమరావతికి ప్రజా మద్దతు కరువు..!!

రాజధాని అంటే ఆ రాష్ట్ర, ఆ దేశ ప్రజలకు నివాసయోగ్యమైన ప్రాంతం. ఉపాధి అవకాశాల ఖిల్లా. ధనవంతుల నుంచి సామాన్య ప్రజలకు వరకు అక్కడ జీవనం సాగించే పరిస్థితి ఉండాలి. ఇలా ఉన్న రాజధానులను ప్రజా రాజధానులు అంటారు. దేశ రాజధాని ఢిల్లీలోనైనా, ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ ఐనా… బతుకు దెరువు కోసం తన వద్దకు వచ్చిన వారిని అక్కున చేర్చుకున్నాయి. కాబట్టే అవి రాజధానులుగా దశాబ్ధాల తరబడి వర్థిల్లుతున్నాయి. ఆయా నగరాలపై అక్కడ నివసించే ప్రజలకు తమ ప్రాంతమన్న భావన కలుగుతుంది. రాష్ట్ర ప్రజలు కూడా రాజధాని తమ గుర్తింపు, గౌరవం అని భావిస్తారు.


అమరావతిలో అది మిస్‌ అయిందా..?

ప్రజా రాజధానిగా ఎదగడంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విఫలమైందా..? ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అమరావతిపై ప్రేమ, అభిమానం పెంచుకోలేదా..? అంటే అవుననే అవుననే ప్రస్తుత పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించి అక్కడ శాశ్వత ప్రాతిపదికన హైకోర్టు, తాత్కాలికంగా అసెంబ్లీ, సచివాలయం నిర్మించారు. ఐదేళ్ల పాటు అక్కడ నుంచే పరిపాలన సాగించారు. ప్రస్తుతం అక్కడ నుంచి హైకోర్టు, సచివాలయం కర్నూలు, విశాఖకు తరలించేలా సర్కార్‌ ఆలోచనలు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి యావత్‌ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. రాజధానిగా అమరావతి ఐదేళ్ల పాటు ఉన్నా ప్రజలు తమది అని భావించలేదని స్పష్టమవుతోంది.


అమరావతి ఎక్కడ విఫలమైంది..?

రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న ఉద్దేశం ప్రారంభం కావడంతోనే అమరావతి రాష్ట్ర రాజధానిగా విఫలమైంది. అమరావతిని దేశంలోనే మొదటి మూడు నగరాల్లో ఒకటిగా చేస్తానని, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని ప్రతి సందర్భంలో చెప్పారు. ఎక్కడైనా ఒక నగరం ఉన్నతంగా ఎదగాలన్నా, దాని విసృతి పెరగాలన్న అక్కడకి ప్రజలు తరలిరావాలి. అలా జరగాలంటే అక్కడ జీవనోపాధి అవకాశాలు, నివశించేందుకు అనువువైన ఆర్థిక, సామాజిక వాతావరణం ఉండాలి. కానీ అమరావతిలో ఈ రెండు మిస్‌ అయ్యాయి. భూముల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఓ వంద గజాల స్థలం కొనలేని స్థాయికి అక్కడ భూముల రేట్లు పెరిగిపోయాయి. రాజధాని గ్రామాల్లో గజం కనీసం 20 వేల రూపాయలు ఉంది. ఇక వాటి చుట్టు పక్కల గ్రామాలల్లో కూడా గజం కనీసం 10 వేల రూపాయలకు పైగా ఉంది. వంద గజాల స్థలం కావాలంటే కనీసం 10 నుంచి 20 లక్షల రూపాయలు వెచ్చిస్తే కానీ స్థలం దొరకని పరిస్థితి.

ఇక అమరావతి అంటే ఒకే కులం వారిదని, అక్కడ వారి చేతుల్లోనే భూములు ఉన్నాయన్న ప్రచారం ప్రారంభం నుంచి సాగింది.
కులం అడిగి… అద్దె ఇళ్లు..
రాజధాని ప్రాంత గ్రామాల్లో, విజయవాడ నగరంలో అద్దెకు ఇళ్ల కోసం వెళ్లిన వారిని ముందు వారి కులం ఏమిటో అడిగారు. ఫలానా కులం అని తెలుసుకున్న తర్వాతనే ఇళ్లు అద్దెకు ఇచ్చేవారు. ఈ క్రమంలో అద్దె ఇంటి కోసం వెళ్లిన వారు తీవ్రమైన ఆవేదనకు గురయ్యేవారు. మరో వైపు అద్దెలు విపరీతంగా పెరిగాయి. ఒకానోక సందర్భంలో అప్పటి సీఎం చంద్రబాబు అద్దెలు తగ్గించండి అని చెప్పడం గమనార్హం. రాజధానిపై నియమించిన జీఎన్‌ రావు కమిటీ సభ్యులు అమరావతి గ్రామాల్లో పర్యటించే సమయంలో నీళ్లు అడిగితే ‘మీది ఏ కులం’ అని అడగడం కొసమెరుపు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే అమరావతిని తమ రాజధానిగా రాష్ట్ర ప్రజలు భావించలేదన్నది నగ్నసత్యం. అందుకే మూడు రాజధానుల ప్రకటనను అన్ని జిల్లాల ప్రజలు స్వాగతిస్తున్నారు. రాజధాని ప్రాంత గ్రామాలు మినహా మరెవరూ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు మూడు అమరావతిలోనే ఉంచాలన్న డిమాండ్‌ చేయడంలేదు. కనీసం గుంటూరు, కృష్ణ జిల్లాల ప్రజలు కూడా అమరావతికి మద్దతుగా రాకపోవడం జగన్‌ సర్కార్‌ సనైన నిర్ణయం తీసుకుందని భావించడమే అసలు కారణం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి