iDreamPost

Minister Komatireddy: రైతుబంధు డబ్బులు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి: మంత్రి కోమటిరెడ్డి

  • Published Jan 23, 2024 | 10:19 PMUpdated Jan 23, 2024 | 10:19 PM

రైతుబంధు డబ్బులు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి. ఈ విషయంలో ఆయన సీరియస్ అయ్యారు.

రైతుబంధు డబ్బులు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి. ఈ విషయంలో ఆయన సీరియస్ అయ్యారు.

  • Published Jan 23, 2024 | 10:19 PMUpdated Jan 23, 2024 | 10:19 PM
Minister Komatireddy: రైతుబంధు డబ్బులు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ సర్కారు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే.. గత ప్రభుత్వ పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్రంలోని రైతులకు తీపి కబురు అందించింది. రేవంత్ సర్కారు రైతుబంధు నిధులను విడుదల చేసింది. అయితే చాలా చోట్ల రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు పడలేదనే వ్యాఖ్యలు వినిపించాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే విషయంపై అధికార కాంగ్రెస్​ను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా రైతుబంధు పడలేదని అంటున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సీరియస్ అయ్యారు. జగదీష్​ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శలకు దిగారు. రైతుబంధు నిధులు పడలేదని అనేవాళ్లను చెప్పుతో కొట్టాలన్నారు.

ఇప్పటిదాకా రైతుబంధు డబ్బులు పడలేదని జగదీష్ రెడ్డి అడుగుతున్నారని ఒక జర్నలిస్టు మంత్రి కోమటిరెడ్డిని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేకపోతే ప్రశ్నించండి’ అని అన్నారు. వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, జగదీష్ రెడ్డిని ఉద్దేశించిన కోమటిరెడ్డి మరికొన్ని కామెంట్స్ చేశారు. జగదీష్ భూ దోపిడీదారుడని.. ఆయనకు తనను విమర్శించే స్థాయి లేదన్నారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్​లో అక్రమాలతో పాటు ఛత్తీస్​గఢ్​ కరెంటు కొనుగోళ్లలో ఎక్కడ అవినీతి బయటపడుతుందోననే భయం, అక్కసుతోనే తనపై మాజీ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి. జగదీష్ రెడ్డి అవినీతి మీద ఇన్వెస్టిగేషన్ జరిపిస్తామని తెలిపారు.

లోక్​సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విమర్శించారు. ఆ పార్టీ మూడు ముక్కలవుతుందని చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీ తర్వాత జైలుకు పోయే వ్యక్తి జగదీష్ రెడ్డేనని అన్నారు. సిట్టింగ్ జడ్జీతో విచారణ అనంతరం జగదీష్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్వాకం వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని కోమటిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యానికి ఇదే కారణమన్నారు. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ హామీని అమలు చేస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి దగ్గర నుంచి డబుల్ బెడ్ రూమ్స్ వరకు ఇచ్చిన అన్ని హామీలను గత సర్కారు విస్మరించిందని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాల మీద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందని తెలిపారు. మరి.. రైతుబంధు పడలేదని అన్నవారిని చెప్పుతో కొట్టాలంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి