iDreamPost

మెగా నందమూరి బాండింగ్ అదుర్స్

మెగా నందమూరి బాండింగ్ అదుర్స్

ఇవాళ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ వీడియో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. ఇప్పటికే తారక్ సిక్స్ ప్యాక్ పిక్ ట్రెండింగ్ లో ఉంది. ఫ్యాన్స్ స్వంతంగా చేసుకున్న ఏవీలతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. వీళ్ళే ఇలా చేస్తే ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ గా భావించే తాను ఇంకెంత స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలో గుర్తించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అంచనాలకు తగ్గట్టే తన స్నేహితుడితో పంచుకున్న ఓ గొప్ప అనుభూతిని ఫోటో రూపంలో షేర్ చేసాడు.

ఈ ఇద్దరి మధ్య ఎంత గొప్ప బాండింగ్ ఉందో చాటి చెప్పేలా బాడీ ల్యాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్ చాలా సహజంగా ఉండటంతో ఇది క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ముందు నుంచి చరణ్ తారక్ ల స్నేహం ఇంతే గొప్పగా ఉంది. కాకపోతే ఇలాంటి పిక్స్ అరుదుగా వస్తుంటాయి కాబట్టి చాలా ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఆర్ఆర్ఆర్ మీద ఈ కాంబినేషన్ వల్ల ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మెగా నందమూరి హీరోలు కలిసి నటించడం అనే కలను నిజం చేస్తున్న రాజమౌళికి ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే అంటున్నారు మూవీ లవర్స్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తరం ముగిశాక పెద్ద హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించడం ఆగిపోయింది. అభిమానుల అంచనాల వల్లనో లేదా ఈగోల సమస్యనో కారణం ఏదైతేనేం బాలీవుడ్ లో రెగ్యులర్ గా కనిపించే మల్టీ స్టారర్ ట్రెండ్ మనకు మాత్రం అందని ద్రాక్ష అయ్యింది.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రూపంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు దానికి చెక్ పెట్టే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. తమ బాండింగ్ కేవలం తెరకు పరిమితం చేయకుండా అఫ్ ది స్క్రీన్ కూడా ఫ్రెండ్ షిప్ అనే పదానికి నిర్వచనంలా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా మెసేజ్ పెట్టిన చరణ్ నేను గిఫ్ట్ బాకీ ఉన్నానని తెలుసని త్వరలో గొప్పది తప్పకుండా అందజేస్తానని మాటిచ్చాడు. మొత్తానికి ఈ రోజు ఎక్కడా చూసినా తారక రాముడి బర్త్ డే సెలబ్రేషన్స్ తో మారుమ్రోగిపోతోంది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత రెండున్నర ఏళ్ళ గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ వచ్చే ఏడాది వేడుకలలోపే ఆర్ఆర్ఆర్ రావాలని కోరుకుంటున్నారు. అదే జరగాలని ఆశిద్దాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి