iDreamPost

ఆంధ్రాలో అబద్ద అక్షర యుద్ధం

ఆంధ్రాలో అబద్ద అక్షర యుద్ధం

ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తిస్థాయి అక్షర యుద్ధం జరుగుతోంది. మీడియా మొత్తం ఏకపక్షంగా అధికార పక్షంపై ప్రతిరోజూ, ప్రతినిత్యం యుద్ధం చేస్తోంది. మీడియా ప్రతిపక్ష పార్టీ తరపున యుద్ధం చేస్తోంది. మీడియా ఎందుకు ప్రతిపక్షాన్ని భుజాన వేసుకుని మోస్తోందో లేక అధికార పక్షంపై అక్షర యుద్ధం చేస్తోందో ప్రజలకు తెలుసు. అయినా యుద్ధం జరుగుతోంది.

ఈరోజు రాష్ట్రంలో తెలుగు మీడియా ఒక ప్రధాన వార్త ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించేందుకు పలు దేశాలనుండి టెస్టు కిట్లు దిగుమతి చేసుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు టెస్ట్ కిట్లు దిగుమతి చేసుకుని పరీక్షలు మొదలు పెట్టాయి. అయితే రాజస్థాన్ ప్రభుత్వం తాను చైనా నుండి దిగుమతి చేసుకున్న టెస్టు కిట్లు పనిచేయడం లేదని కేంద్రానికి చెప్పడంతో కేంద్ర వ్యవసాయ పరిశోధనా మండలి ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ టెస్టు కిట్లతో పరీక్షలు నిర్వహించడం రెండురోజులు వాయిదా వేయండి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వార్తను ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కిట్ల కొనుగోళ్ళ విషయంలో తప్పుబడుతున్న మీడియా పతాక శీర్షికలో ప్రచురించింది.

కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి తాజా ఉత్తర్వులతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇరుకున పడిందని, ఇది ప్రభుత్వంపై పెద్ద దెబ్బ అంటూ పత్రికలు పతాక శీర్షికలో వార్తలు రాశాయి. రాజస్థాన్ రాష్ట్రం దిగుమతి చేసుకున్న కిట్లు చైనా నుండి. పరీక్షల్లో తేడా చూపించిన కిట్లు చైనా నుండి దిగుమతి చేసుకున్నవి. కేంద్ర వ్యాసాయ పరిశోధన మండలి పరీక్షలు నిలిపివేయమని ఉత్తర్వులు ఇచ్చింది చైనా కిట్ల గురించి. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టిన తెలుగు మీడియా ఉత్తర్వులతో రాష్ట్రప్రభుత్వం షాక్ తిన్నదని వార్తలు రాయడం కేవలం అబద్ద అక్షర యుద్ధమే.

ఈ ప్రచారాల వల్లనే రాష్ట్రంలో ఒక పార్టీని, ఆ పార్టీకి అండగా నిలిచిన మీడియాను ప్రజలు 2019 ఎన్నికల్లో పట్టించుకోలేదు. సోషల్ మీడియా లేని రోజుల్లో అయితే ఈ మీడియా ఏది చెపితే అది వార్తగా విరాజిల్లింది కానీ ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా పనిచేస్తున్న రోజుల్లో నిత్యం ఇలా అబద్దాల ప్రచారం మీడియా ఎందుకు చేస్తోందో కాలమే నిర్ణయిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి