iDreamPost

 టీటీడీ లో పలు మార్పులకు శ్రీకారం, కీలక అడుగులు వేస్తున్న ఎస్వీబీసీ చానెల్

 టీటీడీ లో పలు మార్పులకు శ్రీకారం, కీలక అడుగులు వేస్తున్న ఎస్వీబీసీ చానెల్

తిరుమల తిరుపతి దేవస్థానం కీర్తిని మరింత పెంచేందుకు పాలకవర్గం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి దానికి అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కశ్మీర్ లో కూడా శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం ఇటీవల ఆయన శ్రీనగర్ వెళ్లి వచ్చారు. స్థల సేకరణ పూర్తికావడంతో కశ్మీరీలకు వెంకటేశ్వరుని ఆలయం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

అదే సమయంలో దర్శనాలు, ఏర్పాట్లు సదుపాయాలు వంటి అన్ని అంశాల్లోనూ టీటీడీ పాలకవర్గం చేస్తున్న ప్రయత్నాల పట్ల యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా క్రమంగా దర్శనాలకు వచ్చేవారి సంఖ్య పెంచేందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఎస్వీబీసీ చానెల్ ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల ఎస్వీబీసీ చానెల్ ఛైర్మన్ గా ఇటీవల వీబీ సాయికృష్ణ యఛేంద్ర నియమితులయిన సంగతి తెలిసిందే. ఆయన సహకారంతో ఇప్పుడు నూతనంగా కన్నడ, హిందీ భాషల్లో ఎస్వీబీసీ చానెల్ ప్రసారాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. త్వరలోనే ఆయా భాషల్లో ఎస్వీబీసీ ద్వారా తిరుమల కార్యకలాపాలు అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి.

వైఎస్సార్ హయంలో 2008 జూలై 7న ఎస్వీబీసీ చానెల్ ప్రారంభమయ్యింది. ఆ తరువాత పలుమార్పులు జరిగినప్పటికీ 12 ఏళ్లుగా చానెల్ ప్రసారాలు నిరాటంకంగా సాగుతున్నాయి. ఇక ప్రస్తుతం జగన్ ప్రభుత్వ హయంలో వివిధ భాషల్లోకి కూడా అడుగుపెడుతుండడం విశేషంగానే చెప్పాలి. ఓవైపు తిరుమలని కేంద్రంగా చేసుకుని దుష్ప్రచారాలతో జగన్ ని బద్నాం చేయాలని కొందరు చూస్తుంటే, టీటీడీ ప్రతిష్ట పెంచేందుకు ప్రభుత్వం, టీటీడీ ప్రయత్నాలు మరోవైపు సాగుతున్నాయి. విమర్శల పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్న వారికి ఈ పరిణామాలు చెంపపెట్టుగానే ఉంటాయని చెప్పవచ్చు. తిరుమల విశిష్టతను వివిధ భాషల్లో వినిపించే ప్రయత్నాలు త్వరలోనే కార్యరూపం దాల్చుతుండడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి