iDreamPost

మహేష్ ఎవర్ గ్రీన్ ఎంటర్ టైనర్ – Nostalgia

మహేష్ ఎవర్ గ్రీన్ ఎంటర్ టైనర్  – Nostalgia

ఎంత సూపర్ హిట్ సినిమా అయినా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపంచంలో ఓ పదేళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లో షో వేస్తే హౌస్ ఫుల్ కావడం ఊహించగలమా. కానీ దూకుడు క్రేజ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. టీవీ ఛానల్స్ లో వందల సార్లు ప్రసారమై, ఓటిటి, యుట్యూబ్ కి ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ మూవీ మీద అభిమానులు ఇంతగా ప్రేమ పెంచుకున్నారంటే దూకుడు చూపించిన సత్తా ఏమిటో అర్థమవుతుంది. దీని విశేషాలు చూద్దాం. 2008లో దర్శకుడు శ్రీను వైట్ల నాగార్జున ‘కింగ్’ చేస్తున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరి మంజుల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు. రచయిత గోపి మోహన్ కు చెప్పి కథను సిద్ధం చేసే దిశగా అడుగులు వేశారు. ఖలేజా ఆలస్యం అవుతుండటంతో శ్రీను వైట్ల ఈలోగా వెంకటేష్ తో ‘నమో వేంకటేశ’ కూడా పూర్తి చేసి మహేష్ కోసం రెడీ అయ్యారు.

అయిదు నెలలు కష్టపడి ఒక స్టోరీ రెడీ చేసుకున్నారు. ప్రిన్స్ కూ నచ్చింది. కానీ ఎందుకో శ్రీను వైట్లకు దాని మీద నమ్మకం కుదరలేదు. ఓ రోజు పార్క్ లో జాగింగ్ చేస్తుండగా జననేతగా పేరుబడ్డ పి జనార్దన్ రెడ్డి గుర్తొచ్చారు. వైట్ అండ్ వైట్ లో మహేష్ ని కొత్తగా చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఒక పోలీస్ ఆఫీసర్ కి ,చనిపోయిన అతని తండ్రి రివెంజ్ డ్రామాకు ముడిపెట్టి ఓ లైన్ రాసుకున్నారు. ఇది మహేష్ ని సూపర్ ఎగ్జైట్ చేసింది. ముందు అనుకున్నది క్యాన్సిల్ అయ్యిందనే నిరాశ గోపి మోహన్ కు కలిగినా ఆ తర్వాత దూకుడు మీద సీరియస్ గా వర్క్ చేయడం మొదలుపెట్టారు. చాలా కాంప్లిగేటేడ్ అనిపించే థీమ్ లో అద్భుతమైన కామెడీని సెట్ చేశారు. మహేష్ బాబు సినిమాల్లో ఇప్పటిదాకా ఎవరూ నవ్వించనంత హాస్యాన్ని సెట్ చేసుకున్నారు.

నిర్మాతగా మంజుల గారి స్థానంలో 14 రీల్స్(వైట్ల మిత్రులు)అధినేతలు వచ్చారు. కూతురి చదువు కారణంగా ఆవిడ కొంత కాలం ప్రొడక్షన్ కు దూరంగా ఉండాలనుకోవడం వీళ్ళకు కలిసి వచ్చింది. అప్పటిదాకా దేవిశ్రీ ప్రసాద్ తప్ప వేరే ఆప్షన్ పెట్టుకోని శ్రీను వైట్ల తన వెంటపడుతున్న తమన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. అంతే చార్ట్ బస్టర్ రెడీ. ముంబై-హైదరాబాద్-దుబాయ్-ఇస్తాంబుల్ ఇలా లొకేషన్ల కోసం ఎక్కడా రాజీ పడలేదు. అయిదు నెలలకు పైగా షూటింగ్ జరిగింది. 2011 సెప్టెంబర్ 23న దూకుడు రిలీజై రికార్డులు బద్దలు కొట్టేసింది. సైనికుడు, అతిథి, ఖలేజా హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత దూకుడు మహేష్ ఫ్యాన్స్ కు వంద రోజుల పాటు కడుపు నింపే ఫుల్ మీల్స్ పెట్టింది. అంతే అక్కడ మొదలైన వసూళ్ల సునామి వంద కోట్ల గ్రాస్ ని వసూలు చేసే దాకా పరుగులు పెడుతూనే ఉంది.

నమ్మశక్యం కాని కొన్ని లాజిక్స్ శ్రీను వైట్ల టీమ్ చేసిన కామెడీ ముందు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్రను తీర్చిదిద్దిన తీరు, ఆయన తన టైమింగ్ తో పేల్చిన డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియా మీమ్స్ లో వాడుకుంటూనే ఉంటారు. ఇక సెకండ్ హాఫ్ లో ఎంఎస్ నారాయణ స్పూఫ్ కామెడీకి పొట్టచెక్కలయ్యాయి. హీరోయిన్ సమంతా కంటే మాస్ ఆడియన్స్ కు వీళ్ళే ఎక్కువ గుర్తుండటం అతిశయోక్తి కాదు. తమన్ తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని ఎవర్ గ్రీన్ ఆల్బమ్ ఇచ్చేసాడు. కోన వెంకట్ సంభాషణలు మాములుగా పేలలేదు. ప్రకాష్ రాజ్, కోట, ధర్మవరపు, చంద్ర మోహన్, సుధ, బ్రహ్మాజీ ఇలా క్యాస్టింగ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్న శ్రీను వైట్ల ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే ఎంటర్ టైనర్ ఇచ్చారు. అందుకే దశాబ్దం గడిచినా ఈ సంబరాలు తగ్గడం లేదు. మహేష్ ఎనర్జీని అన్ని కోణాల్లో పూర్తిగా వాడుకున్న సినిమాగా దూకుడు స్థానం అందుకే ప్రత్యేకంగా నిలిచిపోయింది

Also Read : మెగాస్టార్ తొలి అడుగు – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి