iDreamPost

మహారాష్ట్ర అవియల్

మహారాష్ట్ర అవియల్

మహారాష్ట్ర ఇప్పుడిప్పుడే తేలే యవ్వారం కాదని కాంగ్రెస్-బీజేపీలిద్దరికీ అర్థమైపోయింది. ఫడ్నవిస్ చేత ప్రమాణస్వీకారం చేయించినా ఎన్సీపీ ఎమ్మెల్యేలల్లో పెక్కుశాతం పెద్దాయన చేతిలోనే ఉన్నారని నాలుగైదు ఫోటోలు మీడియాలకి విడుదల చేశాక బీజేపీకి తెలిసొచ్చింది. అజిత్ పవార్ మీదికి అరవైఏళ్ళొచ్చాయికానీ తమిళనాడు విజయకాంత్ లాగా కక్కుర్తిపడి ముందుగా కూటమిలో చేరి తరవాత ప్రతిపక్షంలో కూర్చుని రాత్రి డిన్నరు చపాతీ కి అవియల్ బాగుంటుందా, కోజ్హికరి బాగుంటుందా అని ఆలోచిస్తూ ఒక పక్క చెవిలో జాన్సన్ అండ్ జాన్సన్ బడ్స్ బల్క్ లో కొన్నవి డజన్లకొద్దీ దూర్చేస్తూ, వాటిని పైకి లాగినప్పుడల్లా లోలోపల నవ్వేస్తూ నాలుగేళ్ళూ గడిపే ఓపికా లేదు. ఏదొకటి చేసి హోమో, రెవెన్యూనో సంపాయించేసి సెటిలైపోయి రిటైరైపోవాలి. చిన్నాన్న అసలే చండశాసనుడు. కూతురిని తప్ప ఇంకోర్ని పైకి రానీయడు. ఏదొకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి తీరాలి అని రాత్రీ పగలూ ఆలోచించి ఒక గొప్ప ఆలోచనకి ప్రాణం పోశాడు. అదేమంటే ….

రాహుల్ గాంధీకి – నరేంద్రమోడీకి డ్యూయెల్ (ముఖాముఖి పోటీ)పెట్టి గెలిచినవాళ్ళకి మహారాష్ట్ర ముద్రశుద్దిగా అప్పగించెయ్యాలి. ఎమ్మెల్యేలు బేషరతుగా అవతలిపార్టీకి మద్దతిచ్చి కూర్చోవాలి. కబురంపించాడు డిల్లీకి. రాహుల్ గాంధీ ఊళ్ళోలేడు కాట్టి రాజమాత దగ్గరికి వెళ్ళింది విన్నపం – ఫలానా విధంగా మహారాష్ట్ర సంగతి తేల్చుకోవాలి. ‘సమయంలేదు మిత్రమా’ అంటూ షరా తో కలిపి.

మాత, తమ మరాఠీ దుబాసీచేత చదివించుకుని తలాడించింది. ఆలోచించింది కాసేపు మనోడు దేనికి పనికొస్తాడా అని? కుస్తీ, కొయ్యసాము, కత్తియుద్ధం కనీసం పరుగుపందెం. ఊహూ – మనోడు దేన్లోనూ కనీసం పార్టిసిపేట్ చేసిన దాఖలాలు కూడా లేవు. కూర్చుని ఆడే ఆటలు చూస్తే అష్టా చెమ్మా, పులీ-మేకా, దాయాలాట కనీసం పరమపదసోపానపటంలో ఒక్కసారైనా వైకుంఠం చేరిన గుర్తు కూడా లేదు. టూ హిందూయిస్టిక్ గేములని సెక్యులర్ డైలాగులు చిన్నప్పుడే కొట్టాడు మనోడు. దాన్ని చూసి చిన్నప్పుడు మురిసిపోయిందిగానీ ఇప్పుడింత తలనెప్పుల్ని తెచ్చిపెడుతుందని అస్సలనుకోలేదు మాత. అందుకే పిల్లల్ని ఆరుబయట ఆడించాలి. టీవీలకీ, ఫోన్లకీ తగిలించి వాట్సాపులో ఫార్వార్డెడ్ కుళ్ళు కంటెంట్లలో మనం మునిగిపోకూడదని విచారించింది మాత. ఇక మిగిలింది క్యారం బోర్డు లేదా చదరంగం. క్యారం బోర్డు లో పింకు కాయిన్ వేయడం వరకూ ఓకే గానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఫాలోయింగ్ కాయిన్ కొట్టలేదని అక్క గుర్తుచేసింది తన తల్లికి. ఊప్స్, మనోడు చివరిదాకా వచ్చి కాడి వదిలేయడంలో సిద్దహస్తుడని తెలిసిపోయింది. చివరగా మిగిలింది చదరంగం ఒక్కటే. మనోడికి చిన్నప్పుడు స్కూల్లో ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంటులో కప్పు గెలిచి దాని ఫోటో ఒకటి స్కూల్ మేగజైన్లో పడ్డ విషయం మెరుపులా గుర్తుకొచ్చింది. ఓకే, చెస్సు టోర్నమెంటుకి రెడీ అంటూ చినబాబుని కనుక్కోకుండా వర్తమానం అంపించేసింది మాత.

ఇంకో ఉత్తరం మోడీ దగ్గరికి వెళ్ళింది. ఇదే కంటెంటుతో. షరా మామూలుగా మోడీకి వచ్చే లెటర్లన్నీ షానే చదువుతాడు ముందు. అలా మరాఠీలో వచ్చిన ఉత్తరాన్ని గుజరాతీలో తర్జుమా చేపించుకుని చదివాడు షా. మెరుపులాంటి ఆలోచన తట్టింది షాకి. విజిలేసుకుంటూ ‘ నే విజిలేస్తే ‘ఆంధ్రా’ సోడా బుడ్డీ ‘ అంటూ ’అప్పటి’ జూనియర్ ఎన్ టీ ఆర్ ని అనుకరిస్తూ జుబ్బాని పైకి లాగి మడతేసుకుంటూ లోపలకి పోయినాడు.

లోపల దీర్ఘయోగముద్రలో మోడీ. కాళ్ళు పట్టేందుకు లక్ష్మీ లేదు కానీ అలవైకుంఠపురాన శయనించిన విష్ణుమూర్తే. పార్వతి లేదు కానీ యోగముద్రలో ఉన్న పశుపతి కాశీ విశ్వేశ్వరుడే. నాలుగు ముఖాలు లేవు కానీ సృష్టికర్త సరస్వతీ ప్రాణనాధుడే. ఆయన్ని చూడగానే ఒక్కసారిగా దైవత్వం మిరుమిట్లుగొలుపుతూ తనని నిలువెల్లా వణికిస్తూంటే రెండు చేతులూ జోడించి ” నో … అనా..” అని పిలుచును. బేక్ గ్రవుండులో విజిలేస్తే సోడా బుడ్డీ పాట స్థానములో ‘ఏ మూర్తి ఈ మూర్తి బీ మూర్తి సీ మూర్తి అని కంటిన్యూ అవుతూ… ఇది మోడిమూతీ ‘ అంటూ ముగియును ( చదువరులు గమనించాలి. రెండింటికీ మ్యూజిక్కు వాయించింది కీరవాణే) . నిద్ర లేచిన ( ఊప్స్, యోగనిద్ర అనాలి ) మోడీ ‘ ఏమొచ్చిండాదిరా నీకూ,నీతో పెద్ద తలకాయ్ నొప్పైపూషుండాదిరా ‘ అంటూ విసుక్కొనును. అమ్మిగాడికి ‘ నా, నీకు ఒక్క పగలు దేశానికి ఆర్నెల్ల రాత్రులు అని చెప్పిండ్లా. నువ్వు కాపోతే దేసచ్చేమం ఎవురు చూస్కునేది నా. నా మింద అలిగితే ఎట్లా? ‘ అని రివర్సులో అలుగును. దేశం పేరు చెప్తే పెద్దాయానకి పూనకము వచ్చును. నవంబర్ 8 వ తేదీ చేసిన చారిత్రక ప్రసంగము గుర్తుకొచ్చి తానెట్టి కారణజన్ముడో జ్ఞాపకమునకు వచ్చి తనను ముందుకు తోయును. అలా పూర్తి యోగనిద్ర నుండి బయటకు వచ్చిన పెద్దాయన ‘ ఏవిరా అమ్మీ, ఏమిటి సంగతి? వొచ్చిన జాబులన్నీ సదవడం పూర్తైనాదా? అని విచారించును. తాను చేతపట్టుకున్న ఉత్తరాన్ని చూపెడుతూ పెద్దాయన చెవిలో రహస్యముగా మంత్రాంగము చేయును. తలాడించిన పెద్దాయన – ‘ అట్లనే. మహారాష్ట్రలో మనకి మెజారిటీ తలకాయ్ కిందపెట్టి తపస్సు చేసినా రాదంటావు. ఫడ్నవిస్ ఏడస్తా బయటికిపోక తప్పదంటావు. అవునా? అని ప్రశ్నించును. అమ్మిగాడు తలాడించును. మామూలుగా కంటే రొవ్వంత ఎక్కువసార్లు తలాడించడం చేత మెడపట్టేసి దానికి వోలిని రాసుకుంటూ తన ప్రణాళికని బయట పెట్టును. మోడీ పెద్దగా నిట్టూర్చును. గెడ్డం కిందకు చేతినిపెట్టి తిరిగి యోగనిద్రలోకి జారుతుండగా అమ్మిగాడు ‘ నో .. .అనా. టైము నాలుగౌతా ఉంది. యోగనిద్రకి బ్రేకిచ్చి ఈ మసాలా టీ తాగు అంటూ అప్పుడే వచ్చిన చాయ్ ని కప్పుల్లో పోసి ఇచ్చును.’

“హ్మ్మ్. ఆ పిల్ల నాయాలితో చెస్ ఆడాలంటావు”?
“నా, అవున్నా”.
“నాకు రాదు కదరా. జిల్లాంగోడి, ఏడు పెంకులాట తప్ప ఇంకేమీ ఆడిండ్లేదు కదరా. మా ఏరియాలో చెస్సూ గిస్సూ లేవురా”.
“నా, నేనుండేది ద్యానికంటావు”?
“ఆడేది నేను కదరా”?
“నీకు యామేమి మూవ్స్ పడాల్నో మూడో కంటికి తెలీకండా నీకు చెప్పించే పూచీ నాది” అనును.
“ఆ పిల్లనాయాలితో కనక ఓడిపూడిస్తే ట్రంపు గాడు రేలంగి మామలాగా నవ్వితే నా పరువేమయ్యేదిరా”?
“నా, నిన్ను గెలిపించకపోతే ఈ తమ్ముడు మెడమీద తలకాయ పెట్టుకోడు”.
“సరే… అట్లనే కానీ. అంతా ఈశ్వరేచ్చ”అంటూ ఆవలించును.
అన్నెక్కడ మళ్ళీ యోగనిద్రలోకి వెళ్ళునో అని అమ్మిగాడు ఇంకో కప్పులో ఇంకోసారి టీ పోసి ఇచ్చును.

వేదిక – ఎర్రకోట
ఇద్దరు ప్లేయర్లు – వైట్ పైజామాలో అల్లుడు – ఆరెంజి పైజామాలో మామ- దూరంగా మంత్రాంగంలో మునిగిన అమ్మిగాడు
ఆట మొదలయ్యింది.
ఎనిమిదో మూవ్ దగ్గర మోడి నైట్ టేక్స్ క్వీన్ అనును.
తొమ్మిదో మూవ్ దగ్గర రాబా బిషప్ టేక్స్ పాన్ అనును. తోడనే చెక్ అని కూడా అనును.
బిత్తరపోయిన మామ రాబా ఎనకాల దూరంగా నుంచున్న అమ్మిగాని వైపు చూచును. అతని సైగతో కేజలింగ్ అని చెప్పి ఏనుగుని ఇవతలకి లాగి కింగుని అవతలసేఫ్ స్క్వేరులోకి తోయును.
“అన్నేయం,ఇది రూల్స్ బుక్కులో లేవు. అది తప్పు” అని అల్లుడు గావుకేకపెట్టును.
మేచ్ కి ఆర్బిటర్ గా మూడోకంటికి తెలీకుండా అపాయింటైన అమ్మిగాడు దగ్గరికొచ్చి పరిస్థితిని చూచి రాబా చెవిలో రహస్యంగా చెప్పును – ‘ శరద్ పవార్ ని చిదంబరం ఉండే సెల్లోకి కాసేపటిక్రితమే పంపించాం’ అని.

మ్రాన్పడిపోయిన రాబా తలాడించి కాసేపు దీర్ఘంగా ఇటాలియన్ లో ఆలోచించి తెలుగులో ‘తోసి రాజన్నావు మామా, కంగ్రాచ్యులేషన్స్ అని షేక్ హేండిచ్చి నడుస్తూ బయటికొచ్చి ఫోన్లో తల్లికి విషయం చేరవేస్తాడు. ఆవిడ టీవీలో అలాంటి న్యూసేమీ రాలేదే అంటూ టీ వీ ఆన్ చేయును.

ఫ్లాష్ ఫ్లాష్ – మహారాష్ట్ర అసెంబ్లీలో మేజిక్ నంబరుని సాధించబోతున్న బీజేపీ కూటమి. బలప్రదర్శన అవసరం లేదన్న గవర్నర్. శరద్ పవార్ కూటమి మొత్తం బీజేపీ లోకి రాత్రికి రాత్రి వలస. సీ బీ ఐ కస్టడీలో శరద్ పవార్ – అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ వద్ద బలమైన ఆధారాలు అంటూ రాజ్ దీప్ సర్దేశాయ్ హింగ్లీషులో చెప్తున్నాడు….

Written by – Sreeram Kannan

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి