iDreamPost

అంబానీ కేసు అనిల్ మెడకు..!

అంబానీ కేసు అనిల్ మెడకు..!

ఎక్కడ ముఖేష్ అంబానీ ఇంటి ముందు కారు… ఇంకెక్కడ మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా. ఎక్కడో తీగ మరెక్కడో తగిలినట్టు మహారాష్ట్రలో కీలకమైన కేసు విషయం చివరకు ఆ రాష్ట్ర హోం మంత్రి మెడకు చుట్టుకుంది. సోమవారం మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా వెనుక కథ భలే ఆసక్తికరంగా మారింది.

ముకేశ్ అంబానీ ఇంటి ఎదుట గత నెలలో ఒక కారు లో పేలుడు పదార్థాలు కనిపించడం సంచలనం అయ్యింది. ఈ కేసు విచారణ చేసిన పోలీసులు దీని వెనుక ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి సచిన్ వాజే ఉన్నట్లు తెలుసుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సచిన్ పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు. పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకు సంబంధించిన విషయాలు దర్యాప్తులో ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో ముంబై పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ పేరు బయటకు వచ్చింది. కింది స్థాయి పోలీసు అధికారులను ఉన్నతాధికారులు ఎలా వాడుకుంటున్నాం అన్న విషయాలు మీడియాలో ప్రముఖంగా రావడంతో ఈ కేసుపై దేశవ్యాప్త చర్చ మొదలైంది.

అయితే ముంబై పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ మాత్రం ఏకంగా మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశముఖ్ మీద గురి ఎక్కు పెట్టారు. హోంమంత్రి ప్రతినెల 100 కోట్లు తీసుకు రావాలని పోలీసులకు టార్గెట్ పెట్టారని పరం బీర్ సింగ్ చెప్పడం సంచలనం అయింది. సచిన్ వాజే బొంబాయిలోని 1750 బార్ల నుంచి ప్రతి నెల ఒక్కో బార్ కి రెండు నుంచి మూడు లక్షలు చొప్పున వసూలు చేసి, ఏక మొత్తంగా ప్రతినెల 40 నుంచి 50 కోట్ల మేర అనిల్ దేశ్ముఖ్ ఇస్తారని మీడియా సమావేశంలో ని ఆరోపణలు చేయడం సంచలనం అయింది. హోంమంత్రి ఉన్నతాధికారులను తన ఇంటికి పిలిపించుకొని మరి టార్గెట్ ఫిక్స్ చేస్తారని ఆరోపించారు. అలాగే బదిలీల లోనూ భారీగా అవినీతి చోటు చేసుకుందని చెప్పారు.

దీంతో ఈ కేసు మొత్తం హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ మెడకు చుట్టుకుంది. వెంటనే హోం మంత్రి రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. పరం బీర్ సింగ్ సహా బీజేపీ నేతలు హోంమంత్రి మీద విచారణ చేయించాలని ముంబై హైకోర్టులో కేసు వేశారు. దీంతో సోమవారం ముంబై హైకోర్ట్ బెంచ్ జస్టిస్ దీపాంకర్ దత్త, కులకర్ణి లతో కూడిన బెంచ్ ఈ ఆరోపణలపై విచారణ చేయాలని సిబిఐ కి ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లో ప్రాధమిక విచారణ జరిపి, ఆధారాలు లభిస్తే ఎఫ్ ఐ ఆర్ వేయాలని ఆదేశించింది. ఖచ్చితంగా ఒక వ్యవస్థలో అవినీతి మీద నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముంబై పోలీసు కమిషనర్ హోదాలో ఉన్న వ్యక్తి మాటలను ఊరికే వదిలేయడానికి లేదని చెప్పింది. కోర్టు తీర్పుతో హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ సోమవారం రాజీనామా చేశారు.

సిబిఐ కోర్టులో కి వెళ్ళిన ఈ కేసు లో ఎలాంటి నిజాలు బయట పడతాయి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీబీఐ కి ఇవ్వడాన్ని, తర్వాత పరిణామాలను బిజెపి తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని శివసేన ఎన్సీపీ ఆరోపిస్తుంటే, కేంద్ర దర్యాప్తు సంస్థ విషయాల్లో బిజెపి తలదూర్చి అవకాశం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోపక్క అసలు ముంబై పోలీసుల్లో, రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనే ఆసక్తి ఉత్కంఠ కలిగిస్తోంది.

Also Read : ‘మహా’ముదురు..! మహారాష్ట్ర ను కుదిపేసిన సచిన్ వాజే అసలు కథ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి