iDreamPost

విక్టరీకి ‘దివ్య’మైన జోడి – Nostalgia

విక్టరీకి ‘దివ్య’మైన జోడి – Nostalgia

అగ్ర నిర్మాత రామానాయుడు అబ్బాయిగా వెంకటేష్ తెరంగేట్రం చేసింది కలియుగ పాండవులుతో అయినా మాస్ ఇమేజ్ తో స్టార్ అయ్యింది మాత్రం బొబ్బిలి రాజా వల్లే. 1990లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్. బి గోపాల్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీగా నిర్మించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ముఖ్యంగా చాలా ఫ్రెష్ గా అనిపించిన వెంకీ దివ్యభారతిల జోడి యూత్ కి ఓ రేంజ్ లో ఎక్కేసింది. డబ్బు గర్వంతో మిడిసిపడే మినిస్టర్ కూతురిగా చెలరేగిపోయింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే అడవి ఎపిసోడ్స్ కోసమే మళ్ళీ మళ్ళీ చూసే వాళ్ళు అభిమానులు. ఓ సన్నివేశంలో ఫారెస్ట్ లో ఎక్కడా నీళ్లు దొరక్కపోతే కోతితో కామెడీ చేస్తూ హాఫ్ ప్యాంట్ లో దివ్యభారతి చేసిన అల్లరి మాములు కిక్ ఇవ్వలేదు.

బొంబాయి నుంచి వచ్చిన ఈ అమ్మాయికి అదే మొదటి సినిమా అంటే ఎవరూ నమ్మలేదు. అంత బాగా చేసింది. దీని తర్వాతే బాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టాయి. బొబ్బిలి రాజా ఎంత పెద్ద బ్రేక్ అంటే చాలా తక్కువ టైంలోనే చిరంజీవి రౌడీ అల్లుడు, మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ లాంటి సూపర్ హిట్స్ ని కొట్టేసి బాలకృష్ణ ధర్మక్షేత్రం, కృష్ణ నా ఇల్లే నా స్వర్గంలో కూడా నటించింది. ఒక్క నాగార్జునతో మాత్రం చేయలేదు. వెంకటేష్ తో దివ్య భారతి హుషారైన కెమిస్ట్రీ బొబ్బిలి రాజాలో బ్రహ్మాండంగా పండింది. ఇళయరాజా స్వరపరిచిన బలపంపట్టి భామ ఒళ్ళో, కన్యాకుమారి లాంటి పాటల్లో వెంకటేష్ తో కలిసి వేసిన స్టెప్స్ కు ఊరువాడా మారుమ్రోగిపోయాయి. దెబ్బకు హిందీ నుంచి సైతం ఆఫర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి.

ప్రేమలో పడి వివాహం అయ్యాక ఏవో బయటికి రాని వ్యక్తిగత సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్న దివ్యభారతి అప్పుడు అలా కనక చేయకపోతే కనీసం ఓ పదేళ్లు శ్రీదేవి రేంజ్ లో పరిశ్రమను ఏలేదని అప్పటి జ్ఞాపకాలు నెమరేసుకునేవారు చెబుతారు. తను చనిపోయాకే మాధురి దీక్షిత్, జుహీ చావ్లా లాంటి హీరోయిన్లకు మార్గం సుగమైయ్యిందని అభిప్రాయ పడతారు. దివ్యభారతి ఆఖరి సినిమా తొలిముద్దు. షూటింగ్ ముప్పాతిక పూర్తయ్యాక తను చనిపోయింది. దీంతో కాస్త పోలికలు దగ్గరగా ఉండే హీరోయిన్ రంభను తీసుకొచ్చి బాలన్స్ పూర్తి చేశారు. ఆ తేడాను కొన్ని ఫ్రేమ్స్ లో స్పష్టంగా గమనించవచ్చు. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఏది ఎలా ఉన్నా బొబ్బిలి రాజా చూసినప్పుడంతా దివ్యభారతి అల్లరి సినిమా ప్రేమికుల మనసును గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో బొబ్బిలి రాజా ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి