iDreamPost

మాస్ట్రో రివ్యూ

మాస్ట్రో రివ్యూ

ఎవరికి సాధ్యం కాని రీతిలో ఈ ఏడాది రెండు థియేట్రికల్ రిలీజులు చెక్, రంగ్ దేలు దక్కించుకున్న యూత్ హీరో నితిన్ కొత్త సినిమా మాస్ట్రో. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అందాదున్ రీమేక్ గా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇవాళ డిస్నీ హాట్ స్టార్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇంటికే వచ్చేసింది. ఓటిటి రిలీజ్ అయినప్పటికీ ప్రమోషన్ విషయంలో రాజీ పడకుండా స్వంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ గట్టిగానే ప్రమోషన్లు చేసింది. హిందీ వెర్షన్ చూడని వాళ్లకు ట్రైలర్ ఆసక్తిని రేపింది. తమన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం లాంటి ఆకర్షణలు ఇందులో గట్టిగానే ఉన్నాయి. మరి అరచేతిలోకి వచ్చిన మాస్ట్రో ఎలా ఉన్నాడో రివ్యూలో చూద్దాం

కథ

అరుణ్(నితిన్) గుడ్డివాడు కాకపోయినా జీవనోపాధి కోసం అలా నటిస్తూ రెస్టారెంట్లో పియానో వాయిస్తూ ఉంటాడు. ఓ సందర్భంలో సోఫీ(నభ నటేష్)తో మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. ఇలా లవ్ స్టోరీ సాఫీగా సాగిపోతూ ఉండగా అరుణ్ జీవితంలోకి సిమ్రన్(తమన్నా)ఎంట్రీ ఇస్తుంది. ఆవిడ భర్త మోహన్(నరేష్)హత్యకు గురి కావడంతో ఇన్స్పెక్టర్ బాబీ(జిస్సు సేన్ గుప్తా)తో కలిసి సిమ్రన్ పన్నిన ఉచ్చుకి అరుణ్ చిక్కుతాడు .ఊహించని షాక్ తగులుతుంది. పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది, సిమ్రాన్ ని అరుణ్ ఏం చేశాడు లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే చూడాలి

నటీనటులు

కళ్లులేని వాడిగా నటించే పాత్ర తీసుకుని నితిన్ తీసుకున్న రిస్క్ మంచి ఫలితాన్నే ఇచ్చింది. కెరీర్ లో మొదటిసారి ఇలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల తనలో నటుడికి మరింత పదును పెట్టే అవకాశం కలిగింది. కమల్ స్థాయిలోనో రవితేజ రేంజ్ లోనో అంటూ అతిశయోక్తి పోలికలు చేయడం కరెక్ట్ కాదు కానీ ఉన్నంతలో తనవరకు బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఆయుష్మాన్ ఖురానాతో పోలిక పెట్టకోకుండా చూస్తే బెటర్. తనను పూర్తి స్థాయిలో మ్యాచ్ చేయలేకపోయాడు. హీరోయిన్ కన్నా ఎక్కువ ప్రాధాన్యం దక్కించుకున్న తమన్నా నెగటివ్ షేడ్స్ లో చెలరేగిపోయింది.

ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోవడం కొంత కష్టమే కానీ సాధారణ ప్రేక్షకులకు ఇదో కొత్త అనుభూతి. కాకపోతే స్వంత డబ్బింగ్ మానుకుంటే బెటరనిపిస్తుంది. తమన్నా బాషలో తెచ్చిపెట్టుకున్న ఇబ్బంది కనిపిస్తుంది. నరేష్ రొటీన్ గా కాకుండా కాస్త డిఫరెంట్ టోన్ ఉన్న క్యారెక్టర్ లో డీసెంట్ గా నడిపించారు. జిస్సు సేన్ గుప్తాది రెగ్యులర్ రోలే. నభ నటేష్ స్పేస్ తక్కువే అయినా లుక్స్ తో ఆకట్టుకుంది. అనన్య నాగళ్ళ వృధా అయ్యింది. రచ్చ రవి, మంగ్లీ, శ్రీముఖిలవి కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్రలే అయినా మరీ గొప్పగా పండలేదు. హర్షవర్ధన్ తన సీనియారిటీతో డాక్టర్ పాత్రను నిలబెట్టేశారు.

డైరెక్టర్ అండ్ టీమ్

హీరోకు ఏదో ఒక వైకల్యం ఉండటం దాని చుట్టే కథ నడవటం గత కొన్నేళ్లుగా చాలా సినిమాల్లో చూశాం. మతిమరుపు, చెవుడు, ఒక చేయి సరిగా పనిచేయకపోవడం, విచిత్ర వ్యాధి లక్షణాలు ఇలా రకరకాల ప్రయోగాలు జరిగాయి. కొన్ని అద్భుత ఫలితాలు అందుకోగా మరికొన్ని నిరాశ పరిచాయి. అయితే కళ్ళు లేకపోవడం మాత్రం కొత్త కాదు. కమల్ హాసన్ అమావాస్య చంద్రుడుతో మొదలుపెట్టి రవితేజ రాజా ది గ్రేట్ దాకా ఎక్కువ కాదు కానీ కొన్నైతే ఉన్నాయి. కానీ వాటిలో లేని లక్షణం ఒకటి మాస్ట్రోలో ఉంది. అదే థ్రిల్ చేసే క్రైమ్ ఎలిమెంట్. అందాదున్ అంతగా ఆకట్టుకోవడానికి కారణం ఈ అంశమే. నితిన్ కోరిమరీ చేయడానికి దోహదపడింది కూడా ఇదే

దర్శకుడు మేర్లపాక గాంధీ రీమేక్ చేసే క్రమంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. దాదాపు మక్కికి మక్కి కలర్ జిరాక్స్ కే ప్రాధాన్యం ఇచ్చాడు. చాలా రిస్క్ ఉన్న పాయింట్ కాబట్టి ఏదైనా మార్పు చేస్తే విమర్శలు ఎదురుకుని ఫలితం ఇంకోలా వస్తుందేమోనన్న అనుమానం కాబోలు స్క్రీన్ ప్లేతో సహా అదే ట్రీట్మెంట్ ఫాలో అయిపోయారు. ఇది తప్పని చెప్పలేం కానీ ఇలాంటి సబ్జెక్టుల విషయంలో తెలుగు ఆడియన్స్ స్పందన స్థాయి ఎలా ఉంటుందనే దాని మీద ఇంకొంత సీరియస్ గా ఆలోచించి ఉంటే బాగుండేది. సోల్ మిస్ కాకూడదన్న ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అది మన ఆడియన్స్ కి సింక్ అవుతుందా లేదా అనేదే ఫలితాన్ని శాశిస్తుంది

Also Read: టక్ జగదీష్ రివ్యూ

సినిమా మొదలైన అరగంట దాకా నెమ్మదిగా సాగుతుంది. స్పెషల్ గా అనిపించే మూమెంట్స్ ఏవీ ఉండవు. ఒరిజినల్ లోనూ ఇదే తరహా స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ ఇందులో ఏదో వెలితి వెంటాడుతూనే ఉంటుంది. అక్కడ పూణేలో కథ నడవగా ఇక్కడ మాత్రం గోవాకి షిఫ్ట్ చేశారు. ఏ హైదరాబాదో వైజాగో తీసుకుంటే నేటివిటీ ఫ్యాక్టర్ ఇంకొంచెం బలంగా ఉండి కనెక్టివిటీ పెరిగేది. షూటింగ్ సౌలభ్యం కోసం మార్చారో లేక రిచ్ నెస్ కోసమో అర్థం కాలేదు. చాలా సన్నివేశాలు స్లోగా ఉండటం మాస్ట్రోలో ఉన్న అసలు మైనస్. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టులు ఉన్నప్పటికీ అవి పూర్తవ్వగానే మళ్ళీ నెమ్మదిస్తుంది. ఇంకో మలుపు రాగానే కాసేపు వేగం. అంతే.

ఎలా చూసుకున్నా మాస్ట్రో మంచి ప్రయత్నమే కానీ తెలుగు ఆడియన్స్ డిమాండ్ చేసే థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ పూర్తి స్థాయిలో లేదనే చెప్పాలి. ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన ప్రతి సినిమా ఇంకో చోట రీమేక్ రూపంలో అదే ఫలితాన్ని దక్కించుకుంటుందన్న గ్యారెంటీ లేదు. నార్త్ లో విపరీతంగా తినే వడా పావ్ లు, పోహాలు సౌత్ లో పెద్దగా చూడం. ఎందుకంటే జనాల రుచుల్లో ఉన్న తేడా. అందాదున్ బాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ కి మ్యాచ్ అయ్యింది. కానీ మనకు ఇలాంటి వ్యవహారాలు అంత ఈజీగా వంటబట్టేవి కావు. హిందీ ఆల్రెడీ చూసేసినవాళ్లు మాత్రం థ్రిల్స్ ముందే తెలిసిపోయాయి కాబట్టి తుదికంటా కాస్త ఓపిగ్గా చూడాల్సిందే

సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ పర్వాలేదనిపించాడు. గొప్ప పాటలు కాదు కానీ డీసెంట్ గా అనిపించే ట్యూన్స్ ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది. యువరాజ్ ఛాయాగ్రహణం మంచి స్టాండర్డ్ లో సాగింది. ఎక్కువగా ఇంటీరియర్స్ లో సాగే కథే అయినా సన్నివేశానికి తగ్గట్టు మూడ్ ని ప్రతిబింబించేలా కేర్ తీసుకోవడంతో మంచి క్వాలిటీ తెరపై కనిపించింది. ఎస్ ఆర్ శేఖర్ ఎడిటింగ్ లో లోపాలని కాదు కానీ ఫస్ట్ హాఫ్ ల్యాగ్(హిందీలోనూ ఉంది) కొంత తగ్గిస్తే బాగుండేది. శ్రేష్ఠ్ నిర్మాణ విలువల్లో రాజీ లేదు. అందాదున్ కు ధీటుగా ఖర్చు పెట్టారు

ప్లస్ గా అనిపించేవి

తమన్నా పాత్ర
నితిన్
ఊహించని ట్విస్టులు
క్యాస్టింగ్

మైనస్ గా తోచేవి

స్లోగా సాగే సీన్లు
ఫస్ట్ హాఫ్ ల్యాగ్
ప్రీ క్లైమాక్స్ పాట

కంక్లూజన్

ఓటిటిలో డైరెక్ట్ రిలీజులు చూస్తున్న ప్రేక్షకుల దృక్పథం మారుతోంది. థియేటర్ తో పోల్చుకోవడం తగ్గించేశారు. ఇంట్లోనే చూస్తున్నాం కదా అనే కోణంలో ఖర్చు పెట్టిన సమయానికి న్యాయం జరిగిందా లేదా అని మాత్రమే లెక్కేస్తున్నారు. ఇలా చూసుకుంటే మాస్ట్రో పూర్తిగా నిరాశ పరచదు. తెలుగులో అరుదుగా జరిగే ఇలాంటి ప్రయత్నాలు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ మీద ఖచ్చితంగా సేఫ్ గేమ్ అనిపిస్తాయి. అందుకే మాస్ట్రో పూర్ ఛాయస్ కాకుండా బయటపడ్డాడు. సినిమా హాల్ అయితే అభిప్రాయం మారిపోయేది. కాకపోతే ట్రైలర్ చూసేసి ఉక్కిరిబిక్కిరి చేసే థ్రిల్స్ ఉంటాయని మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే బెటర్.

ఒక్క మాటలో : తడబడుతూ నడిచిన మాస్ట్రో

Also Read: సీటిమార్ రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి