iDreamPost

ఆయనది ఆత్మస్తుతి… ఈయనది పరనింద

ఆయనది ఆత్మస్తుతి… ఈయనది పరనింద

తెలుగుదేశం 41వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేసిన ప్రసంగాలు స్ఫూర్తి నింపలేదని పార్టీ కేడర్‌ పెదవి విరుస్తోంది. చంద్రబాబు ఎప్పటిలా తాను అది చేశాను.. ఇది చేశాను, అభివృద్ధి అంతా నా వల్లే జరిగిందంటూ ఆత్మస్తుతి చేసుకున్నారు. ఆయన తనయుడు లోకేశ్‌.. ఎన్టీఆర్‌, చంద్రబాబు దేవుడు, రాముడు అయితే నేను మూర్ఖుడిని ఎవ్వరినీ వదలను. వైఎస్సార్‌ సీపీ నాయకులకు త్వరలోనే సినిమా మొదలవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న చరిత్రాత్మకమైన సందర్భంలో, అధికారానికి దూరంగా వున్న తరుణంలో అటు నాయకుల్లో, కార్యకర్తలలో ఉత్సాహం నింపేలా.. భవిష్యత్‌పై ఆశలు కల్పించేలా ప్రసంగించడానికి బదులు ఇన్నాళ్లుగా ఇస్తున్న స్పీచ్‌లనే మళ్లీ వినిపించారని విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతా నేనే ..అన్నీ నేనే

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు హైదరాబాద్‌ అభివృద్ధి చేసింది నేనే. దక్షిణ కొరియా నుంచి కియా కార్ల పరిశ్రమను తెచ్చాను. లులూ కంపెనీ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పించాను. తీరా అది పరిశ్రమ స్థాపించే లోపు వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావడంతో వెనక్కి వెళ్లిపోయింది. సంపద సృష్టించాను. అంటూ ఎప్పటిలాగే తన స్టీరియో టైప్‌ ప్రసంగంతో సహనాన్ని పరీక్షించారు. పనిలో పనిగా ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేవరకూ పోరాడతానని కూడా పునరుద్ఘాటించారు. పార్టీలో 40 శాతం యువతకు అవకాశం ఇస్తానని చెప్పి 60 శాతం మంది ముసలి నాయకులను భరించక తప్పదని చెప్పకనే చెప్పారు.

కార్యకర్తలను రెచ్చగొడుతూ.. సీఎంను విమర్శిస్తూ..

మంగళగిరిలోని తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో లోకేశ్‌ ప్రసంగించారు. టీడీపీ కుటుంబ సభ్యులను వేధించి ఇబ్బంది పెడుతున్న అధికారులు, వైఎస్సార్‌ సీపీ నాయకుల పాపాలను చూస్తూ ఊరుకోనని, గుర్తుపెట్టుకుని వెంటాడతానని చెప్పారు. నేను మూర్ఖుడిని. వారు అమెరికాలో ఉన్నా, ఐవరీకోస్ట్‌లో ఉన్నా వదిలిపెట్టేది లేదని ప్రతిజ్ఞ చేశారు. నాపై 11 కేసులు పెట్టారు. టీడీపీ కార్యకర్తలెవరూ కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. పోరాటం చేసి కేసులు పెట్టించుకున్న కార్యకర్తలే నాకు ఆప్తులు. నా కంటే ఒక కేసు ఎక్కువ ఉన్న కార్యకర్తలకే రేపు నేను పలుకుతాను. దేనికీ వెనకాడవద్దు అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. యథావిధిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై, వైఎస్సార్‌ సీపీపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.

గతం తవ్వేసి.. ఎదుటి వారిని దూషిస్తే పార్టీని ఆదరిస్తారా..

ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ సంబరాలను, నాయకుల ప్రసంగాలను జనం కూడా ఆసక్తిగా గమనించారు. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెప్పకుండా గతంలో తాము చేసిన పనులను ఏకరువుపెడితే ఉపయోగం ఏమిటి?ఆ నిర్వాకాలను జనం తిరస్కరించబట్టే కదా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్రం విడిపోయాక కూడా కోకాపేటలో భూముల ధరలు పెరగడానికి నేనే కారణం అని చెబితే ఆంధ్రాకు చేసిందేమిటి? అన్న ప్రశ్న రాదా? సంపద సృష్టించాను అని గొప్పలు చెప్పుకోవడమే కాని ఆ సృష్టించిన సంపదను ఎవరెవరికి, ఏ విధంగా పంచారో చెప్పాలి కదా? ఒకపక్క అధికార పార్టీ పలు సంక్షేమ పథకాలతో జనంలోకి దూసుకువెళుతుంటే… దేశంలోనే సీనియర్‌ నాయకుడినని చెప్పుకోవడమే కాని ఫలానా పథకం ద్వారా ఇన్ని లక్షలమందికి లబ్ధిచేకూర్చానని చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా? వంటి ప్రశ్నలు సహజంగానే వినిపిస్తున్నాయి.

తమ పార్టీకి అధికారం ఇస్తే యువనాయకుడిగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ఏయే ప్రణాళికలు రూపొందించిందీ చెప్పడం పోయి.. అంతు చూస్తా.. కక్ష సాధిస్తా అని లోకేశ్‌ వార్నింగ్‌లు ఇవ్వడం వల్ల జనంలోకి రాంగ్‌ సిగ్నల్స్‌ వెళ్లవా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతసేపూ రాష్ట్రాన్ని పాలించడానికి చంద్రబాబును మించిన నాయకుడు లేడనే బిల్డప్‌ ఇస్తూ అతిచేయడం వల్ల పార్టీ జనానికి దూరం అవుతోందన్న విషయాన్ని నాయకత్వం ఎప్పటికి గ్రహిస్తుందో అని తెలుగుదేశం నాయకులే అనుకోవడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి