iDreamPost

ఏ ట్వీట్లు చూసి వణికిపోతారు లోకేష్ బాబూ?

ఏ ట్వీట్లు చూసి వణికిపోతారు లోకేష్ బాబూ?

తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం దక్కుతుందని దాదాపు శతాబ్ధి కాలం ముందు మావో జెడాంగ్ అనే పెద్దమనిషి చెప్పడమే కాకుండా సాధించి చూపించాడు. ఆ తరువాత కూడా అక్కడక్కడా సాయుధ పోరాటం ద్వారా అధికారం సాధించిన ఉదాహరణలున్నాయి. టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో తుపాకీ పట్టే అవసరం ఉన్నా, అందుకవసరమైన ఓపికా తీరికా ఉన్న మనుషులు తగ్గిపోవడంతో తుపాకీ గొట్టం ద్వారా అధికారం సాధించిన మరో ఉదాహరణ చూసే అవకాశం కనిపించడం లేదు.

అయితే ట్విట్టర్ ద్వారా అధికారం సాధించవచ్చని ప్రపంచానికి చూపించడానికి కంకణం కట్టుకున్నాడేమో అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుని చూస్తే అనిపిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాడు లోకేష్. ప్రపంచంలో చాలా మంది నాయకులు, సెలబ్రిటీలు తమ అభిమానులతో అనుసంధానం కావడానికి ట్విట్టర్ వాడుతున్నారు కాబట్టి ఆ ట్రెండ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ట్రెండ్ సెట్టర్ లోకేష్ బాబు అని అందరు అనుకున్నారు.

అయితే బాబు ట్విట్టర్ వదిలి బయటకు వచ్చి జనంతో అనుసంధానం కాకపోవడం చూసి ఆయన మీద గొప్ప ఆశలు పెట్టుకున్న చాలా మంది అభిమానులు నిరాశ చెందారు. ప్రత్యర్థుల మీద ట్విట్టర్లో నిప్పులు చెరగడం, ఆ విషయం ట్విట్టర్లో చూడలేని టెక్నాలజీ నిరక్షరాస్యుల కోసం పక్కరోజు అనుకూల పత్రికల్లో వార్తగా రావడమే కానీ, మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థులను చీల్చి చెండాడితే చూడాలనుకున్న అభిమానుల ఆశలు నెరవేరకపోయే సరికి చాలా మంది అభిమానుల ఆశల మీద నీరు చల్లినట్లయింది.

ట్వీట్లతో వణికించడం

అభిమానుల మనసుల్లో ఉత్తేజం కలిగించడం కోసం చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన లోకేష్ బాబు పార్టీకి కాబోయే నాయకుడిని తనే అని కార్యకర్తలకు బలమైన సంకేతం పంపడానికి దూకుడుగా వ్యవహరించారు. అందులో భాగమే తన ట్వీట్లు చూసి ప్రత్యర్థులు వణికిపోతున్నారన్న ప్రకటన.

ట్విట్టర్లో ఇలా తమ ట్వీట్లు ప్రత్యర్థులు వణికిపోతున్నారని ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా దేశాధ్యక్షుడు కూడా చెప్పుకోలేదు. పెద్ద దేశమైనా ప్రజాస్వామ్యం కాబట్టి అమెరికా అధ్యక్షుడి అధికారాలకు పరిమితులు ఉన్నాయనుకుంటే, అపరిమితమైన అధికారం అనుభవిస్తున్న రష్యా అధ్యక్షుడు పూతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఇలా ఎప్పుడూ చెప్పుకున్న దాఖలాలు లేవు.

అయితే ట్వీట్లతో ఎదుటి వారిని వణికించడం సాధ్యం కాదా అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సాధ్యమౌతుంది. ఉదాహరణకు ఒక ఔత్సాహిక నటీమణి సినిమా దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు మొదలైన వారితో రాసలీలలు జరిపి ఆ కార్యాన్ని రహస్యంగా వీడియో కానీ, ఫోటోలు కానీ తీసి, తనకు హీరోయిన్ అవకాశం ఇవ్వకపోతే ఆ దృశ్యం ట్వీట్ చేస్తానని చెప్తే సదరు వ్యక్తులు వణికిపోతారు. అలాగే ఏదైనా నేరం చేసినప్పుడు, అందులో ఒకరు దానిని ఫోటోలు తీసి ట్వీట్ చేస్తానని బెదిరిస్తే, ఆ నేరంలో పాలు పెంచుకున్న వ్యక్తులు వణికిపోవచ్చు.

లోకేష్ బాబు ట్వీట్లు

లోకేష్ బాబు ట్విట్టర్ హ్యాండిల్ మొదటినుంచి పరిశీలిస్తే అందులో వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా తమ ప్రభుత్వం గురించి, తమ నాయకుడు లోకేష్ బాబు తండ్రి అయిన చంద్రబాబు గురించి ఆకాశమెత్తు ప్రశంసలు. అధికారం పోయాక తమ పార్టీకి చెందిన చిన్నా పెద్దా నాయకుల జన్మదినాల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం, పెళ్ళిళ్ళ సీజన్ అయితే తమ నాయకుల ఇళ్ళలో జరిగే వివాహాలు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాను అని ట్వీట్, దానికి సంబంధించిన ఫోటోలు.

ఒకానొక సందర్భంలో ఈ పెళ్ళి ట్వీట్లు ఎక్కువై పోయి, ఒక అభిమాని ‘లోకేష్ బాబు, ఈ వయసులో తండ్రి గారికి చేదోడువాదోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తావనుకుంటే ఇలా పెళ్ళిళ్ళకూ, పెద్దమనిషి ఫంక్షన్లకూ తిరుగుతూ కాలం గడిపేస్తున్నావేమిటి బాబూ”అని కామెంట్ రూపంలో తన ఆవేదన వెళ్ళగక్కాడు.

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తరచూ లోకేష్ బాబు ట్వీట్లలో తప్ప మరెక్కడా కనిపించని అంశం జే టాక్స్. తాము అధికారంలో ఉండగా తమ నాయకుడి కుటుంబం కే టాక్స్ పేరిట పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి, రోడ్ల పక్కన బుట్టలో పండ్లు అమ్ముకునే వారి వరకూ రౌడీ మామూలు వసూలు చేసిన వైనం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆపాదించి, తమ అనుకూల మీడియాలో కూడా రాని జే టాక్స్ అనే జగన్ టాక్స్ మీద ఎడాపెడా ట్వీట్లు పెడుతూ ఉన్నాడు.

దీనికి కొంచెమైనా విశ్వసనీయత ఉండాలంటే సదరు టాక్స్ ఇచ్చిన వాడు ఒకడైనా తమ కనుసన్నల్లో నడిచే మీడియా ముందుకు వచ్చి చెప్పాలి కదా!

ఇప్పుడు లోకేష్ బాబు ట్వీట్లలో బాగా కనిపించే మరొక టాపిక్ మద్యం. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా వీధి వీధిలో కుప్పలు తెప్పలుగా వర్ధిల్లిన బెల్టుషాపుల గురించి మర్చిపోయి ఇప్పుడు నిషేధం దిశగా నడుస్తున్న మద్యం పాలసీని విమర్శిస్తూ ప్రత్యర్ధులను వణికించడం మాటేమో కానీ సామాన్య ప్రజలకు నవ్వు పుట్టిస్తున్నాడు లోకేష్ బాబు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి