iDreamPost

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం!

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం!

మహిళల దశాబ్ధాల కల నెరవేరింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం లభించింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే  మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మంగళవారం న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ కొత్త పార్లమెంట్‌ భవనంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిల్లుకు అనుకూలంగా 454 మంది ఓటు వేశారు. కానీ, ఎంఐఎం ఎంపీలు అసదుద్దీన్‌ ఓవైసీ, ఇంతియాజ్‌ జలీల్‌లు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

లోక్‌ సభలో ఆమోదం లభించిన నేపథ్యంలో బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. ఇక, డీ లిమిటేషన్‌ తర్వాత మహిళా రిజర్వేషన్ల కోటాను అమలు చేయనున్నారు. కాగా, ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ మొదటినుంచి  మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ మేరకు బిల్లుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ముస్లింలు, ఓబీసీ వర్గాలకు కోటా కేటాయించలేదని అన్నారు. తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వారికి ప్రాముఖ్యత కల్పించేలా బిల్లును తీసుకు వస్తున్నారంటూ మండిపడ్డారు.

దేశంలో ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 8,992 మంది ఎంపీలు ఎన్నిక కాగా.. వారిలో కేవలం 520 మంది మాత్రమే ముస్లింలు ఉన్నారని, సుమారు 50 శాతానికి పైగా లోటు ఉందని అన్నారు.  ఆ 520 మందిలోనూ ముస్లిం మహిళలు గుప్పెడు మంది కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లులో ముస్లిం, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కోటా లేకపోవడం వల్లే పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి, లోక్‌సభ చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలపటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి