iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 45 – నాని ‘వి’

లాక్ డౌన్ రివ్యూ 45 – నాని ‘వి’

ఆరు నెలల ముందు ఎవరూ ఊహించలేదు. కొంతకాలం తర్వాత ఒక పెద్ద హీరో సినిమాను మొదటి రోజే థియేటర్ కు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని చూసే అవకాశం దక్కుతుందని. ఫ్యామిలీ మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా కాలు బయట పెట్టకుండా సరికొత్త వినోదాన్ని ఆస్వాదించవచ్చని. కరోనా దీన్ని సాధ్యం చేసి చూపించింది. థియేటర్లు మూతబడి ఆరు నెలలు అవుతున్న తరుణంలో అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం ఓటిటికి ఓటు వేయక తప్పలేదు. పరిస్థితుల ప్రభావం వల్ల నాని లాంటి స్టార్ సైతం రాజీ మంత్రం జపించాల్సి వచ్చింది. అందుకే వి విడుదల తేదీ ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో దీని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. హాల్లో రిలీజైనా హౌస్ ఫుల్ బోర్డుతో కళకళలాడే కంటెంట్ ఉన్న మూవీగా వి మీద టీజర్ వచ్చినపుడే అంచనాలు మొదలయ్యాయి. మరి సరికొత్త ట్రెండ్ లో తాను భాగమై నేరుగా చిన్నితెరలపై ప్రత్యక్షమైన వి ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం పదండి

కథ

సంఘ అరాచక శక్తులను అరికట్టడంలో టాస్క్ ఫోర్స్ డిసిపి ఆదిత్య(సుధీర్ బాబు)కు మంచి పేరుంటుంది. సైకాలజీ చదివి క్రిమినల్స్ మనస్తత్వం మీద నవల రాయాలన్న అపూర్వ(నివేదా థామస్)అతని ప్రేమలో ఉంటూనే ఇన్వెస్టిగేషన్ కు సహాయం చేస్తుంటుంది. ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్, ఓ రియల్టర్ లు అతి దారుణంగా హత్య చేయబడతారు. హంతకుడు విష్ణు(నాని) తనను పట్టుకోమని ఆదిత్యకు ఛాలెంజ్ విసిరి మరో ముగ్గురిని చంపేస్తానని ముందే చెప్పేస్తాడు. ఇక అక్కడి నుంచి కిల్లర్ వేట మొదలవుతుంది. అసలు ఈ మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి, వీళ్లకు బయటి ప్రపంచానికి తెలియకుండా పోయిన విష్ణు భార్య సాహిబా(అదితిరావు హైదరి)కి సంబంధం ఏమిటన్నది తెలియాలంటే సినిమా చూడాలి.

నటీనటులు

పన్నెండేళ్ల నట ప్రయాణంలో నాని ఎప్పుడూ ఒక మూసకు కట్టుబడలేదు. కమర్షియల్ ఫార్ములాలో బంధించుకునే తప్పు చేయలేదు. భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, జెర్సీ లాంటి ఒకదానితో మరొకటి సంబంధం లేని డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూనే వచ్చాడు. అందుకే తన ఇరవై అయిదవ సినిమాగా ల్యాండ్ మార్క్ గా చెప్పుకోవాల్సిన మూవీగా ఉండాలని ఏరికోరి మరీ విని ఎంచుకోవడం మంచి నిర్ణయమే. ఇందులో ఇంతకు ముందు చూడని నాని కనిపిస్తాడు. జెంటిల్ మెన్ లో లైట్ గా ఇలాంటి షేడ్స్ చేసినప్పటికీ ఇందులో అంతకు మించిన డెప్త్ చాలా ఉంది.

ముఖ్యంగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ చేస్తూ తను టార్గెట్ చేసినవాళ్లను చంపబోయే ముందు వాళ్ళను డీల్ చేసే విధానంలో నాని చాలా కొత్తగా కనిపిస్తాడు. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ సాధారణంగా స్టార్లకు కెరీర్ ప్రారంభంలో వస్తాయి. ఒక ఇమేజ్ వచ్చాక రిస్క్ ఎందుకులే అని అలాంటివి చేయడం మానేస్తారు. కానీ రివర్స్ లో తన గ్రాఫ్ పీక్స్ లో ఉన్నప్పుడే వి చేయడం విశేషం. అలా అని ఇదేదో కంప్లీట్ గా ద్వేషించాల్సి వచ్చే నెగటివ్ క్యారెక్టర్ కాదు. ఆడియన్స్ ఊహించినట్టే దానికో సహేతుకమైన కారణం పెట్టారు.

ఇక మరో హీరో సుధీర్ బాబు మొదటిసారి తన స్టామినాకు తగ్గ రోల్ ని దక్కించుకున్నాడు కానీ పాత్రే వీక్ గా ఉంది. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ సినిమాలే చేసినప్పటికీ తనకు రావాల్సిన బ్రేక్ త్రూ ఇంకా రాలేదు. మంచి ఫిజిక్, మాస్ ని ఆకట్టుకోవడానికి కావలసిన ఫీచర్స్ ఉన్న సుధీర్ బాబు విలో తననుంచి కోరుకున్నది ఇవ్వడానికి బాగా ప్రయత్నించాడు. కాకపోతే ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఇంకా గట్టిగా హోమ్ వర్క్ చేయాలి. కంప్లీట్ యాక్టర్ గా మారడానికి చాలా కష్టపడాల్సి ఉంది

అదితి రావు హైదరిది చిన్న పాత్రే అయినప్పటికీ ఎందుకో జీవం లేనట్టుగా బేలగా కనిపించింది. మేకప్ కూడా కాస్త తేడాగానే అనిపిస్తుంది. కథలో కీలకం కాబట్టి గుర్తొస్తుందే తప్ప మరీ స్పెషల్ కాదు. నివేదా థామస్ కు ఎక్కువ స్పేస్ ఫస్ట్ హాఫ్ లోనే దొరికింది. అయితే తనలోనూ మునుపటి స్పార్క్ లేదు. సీనియర్ నరేష్, తనికెళ్ళ భరణిలను ఏదో రెండు సీన్లకు మొక్కుబడిగా వాడారు. వెన్నెల కిషోర్, హరీష్ ఉత్తమన్, తలైవాసల్ విజయ్, రోహిణి, మధు సూదన్, రాజా చెంబోలు, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగర్, రజిత తదితరులు కథకు తగ్గట్టు అలా వచ్చి ఇలా చేసేసి పోయారు.

డైరెక్టర్ అండ్ టీమ్

ఇప్పటికే అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల రివెంజ్ డ్రామాలు సినిమాలుగా వచ్చాయి. దాదాపు అన్నింటిలో ఒకటే కామన్ పాయింట్ ఉంటుంది. హీరో తన సర్వస్వం అనుకునే ఒకరిని లేదా కుటుంబాన్ని పోగొట్టుకున్నప్పుడు దానికి కారణమైన వాళ్ళను వెంటాడి వేటాడి చంపడం. ఇందులో కూడా అదే ఉంది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చేసిన పొరపాటు కొత్తగా ట్రై చేస్తున్నానన్న ఆలోచనలో పరమ రొటీన్ కథను ఎంచుకోవడం. గంటన్నర దాకా నాని చేసే 3 హత్యలు తప్ప స్టోరీ ఇంచు కూడా కదలదు. పోనీ అవేమైనా ఎగ్జైటింగ్ గా కొత్తగా ఉన్నాయా అంటే అదీ లేదు. జుగుప్సాకరంగా గొంతులు కోయడం తప్ప ఇంకేమి ఉండదు. స్టైలిష్ మేకింగ్ ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టు బలమైన టెంపో ఇచ్చే కథనం సాగినప్పుడే ఇలాంటి వాటిలో ప్రేక్షకుడు ఎంగేజ్ అవుతాడు.

నాగార్జున క్రిమినల్, రవితేజ షాక్, సూర్య గజినీ, జై చిరంజీవా ఇలా చాలా ఉదాహరణలు వి చూస్తున్నంత సేపు మీకు గుర్తొస్తే అది తప్పేమి కాదు. ముమ్మాటికీ స్క్రీన్ ప్లే లోపమే. అంత క్రూరంగా మర్డర్లు చేస్తున్న నాని వెనుక ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ముందే ఆడియన్స్ ఈజీగా గెస్ చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు అసలు గుట్టును విప్పకుండా చాలా టైం వేస్ట్ చేయడం విలోని ప్రధానమైన మైనస్. అందులోనూ ఎంత మాత్రం అతకని ఆర్మీ ఎపిసోడ్ పెట్టి దాన్నేదో ఎమోషనల్ గా చెప్పాలనుకున్న ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. ముందు ఏం జరగబోతోందో చాలా సులభంగా ఊహించే అవకాశం అడుగడుగునా ఇచ్చారు ఇంద్రగంటి. క్లైమాక్స్ లో ఏదో గొప్ప ట్విస్ట్ లా సుధీర్ బాబు పాత్రను మార్చారు కానీ అదీ అజిత్ గ్యాంబ్లర్ స్టైల్ లోనే సాగుతుంది.

ఇంద్రగంటిలో సెన్సిబుల్ ఫిలిం మేకర్ ఉన్నారు. అందులో అబద్దం లేదు. అష్టాచెమ్మా నుంచి సమ్మోహనం దాకా ఎన్నో మంచి సినిమాలు దానికి సాక్ష్యంగా నిలుస్తాయి. అయితే శాఖాహారం వండటంలో ఎక్స్ పర్ట్ గా పేరు తెచ్చుకున్న చెఫ్ ఏదో పేరు తెచ్చుకుందామని తనకు రాని నాన్ వెజ్ బిర్యానీని యుట్యూబ్ లో చూసి ట్రై చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో వి అచ్చంగా అలాగే తయారయ్యింది. ట్రైలర్ లో చూపించిన మసీదు దగ్గరి ఫైట్ కూడా తీరా సినిమాలో చాలా చప్పగా సాగిందంటే దర్శకుడి విజన్ ఎక్కడ దెబ్బ తిందో అర్థం చేసుకోవచ్చు. నానికి విలన్ గా ఎస్టాబ్లిష్ చేయడం వరకు బాగానే ఉంది కానీ ఆపై జరిగేదంతా కూడా ఎక్కడా ఆసక్తి కలిగించదు. పైగా ఓటిటి కాబట్టి గొంతులు కోసిన చోట ధారాళంగా రక్తాలు కారిపోవడం కూడా కామెడీగానే అనిపిస్తుందే తప్ప ఫీల్ అనిపించదు. క్లైమాక్స్ లో సినిమా మొత్తం ఎక్కడా మాట్లాడని హరీష్ ఉత్తమన్ మీద ఏకంగా ఐటెం సాంగ్ పెట్టడం ఏమిటో ఎంతకీ అర్థం కాదు. ఎంత రివెంజ్ డ్రామా అయినా ఎమోషన్ పండకుండా హీరో కేవలం హత్యలు చేస్తూ పోయినంత మాత్రాన ప్రేక్షకుడు థ్రిల్ ఫీలవ్వడు. కట్టిపడేసే కథనం ఉండాల్సిందే. నానిలో మిస్ అయ్యింది అదే

ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ లో పాటల పరంగా మరీ అద్భుతాలు ఆశించలేం కాని బాలీవుడ్ ఫేం అమిత్ త్రివేది ఒకటి తప్ప సోసో ట్యూన్స్ ఇచ్చాడు. తక్కువ సాంగ్స్ పెట్టడం కొంత ఊరట. అయితే కొంతలో కొంత బీజీఎమ్ ఇచ్చిన తమనే నయం. అయినా కూడా ఎక్కడో విన్నట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పదే పదే రాక్షసుడిని గుర్తుకుతెస్తుంది. పిజి విందా ఛాయాగ్రహణం హై స్టాండర్డ్ లో ఉంది. ఖర్చు పెట్టిన ప్రతి రుపాయని తెరమీద చూపించింది. ఇది చాలా సీక్వెన్సెస్ తో కూడుకున్న రివెంజ్ డ్రామా కాబట్టి విందా తన పనితనం మొత్తం చాలా బాగా చూపించారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ఇంకొంచెం కోత వేసి ఉంటే బాగుండేది. దిల్ రాజు సబ్జెక్టు మీద నమ్మకంతో ఇంత భారీగా ఖర్చు పెట్టడం చెప్పుకోదగ్గ విశేషం.

ప్లస్ గా అనిపించేవి

నాని పెర్ఫార్మన్స్
రిచ్ ప్రొడక్షన్
విందా ఛాయాగ్రహణం

మైనస్ గా తోచేవి

రోటిన్ కథ
ఆర్మీ ఫ్లాష్ బ్యాక్
రెండు పాటలు
సెకండ్ హాఫ్
హీరోయిన్లు

కంక్లూజన్

కారణాలు ఏవైనా వి థియేట్రికల్ రిలీజ్ ను కాదనుకుని ఓటిటిలో రావడం ముమ్మాటికీ మంచి నిర్ణయమే. సినిమా ఏదైనా అంచనాల బరువెక్కువై హాల్లో చూసినప్పుడు అవి ఏ మాత్రం తగ్గినా తీవ్ర నిరాశకు దారి తీసి నెగటివ్ ఫలితాన్ని ఇస్తాయి. కానీ ఇప్పుడు రిస్క్ లేకుండా ఇంట్లోనే చూసే వెసులుబాటు దొరికింది కాబట్టి ఓ నిట్టూర్పు తప్ప మరీ తిట్టిపోసే అవసరం పెద్దగా ఉండదు. ఏదో కొంత సమయం ఖర్చయ్యిందన్న ఫీలింగ్ తప్ప. నానిని కొత్తగా విలన్ కాని విలన్ వేషంలో చూడాలనుకుంటే వి కోసం నిస్సంకోచంగా రెండుంపావు గంటలను ఇచ్చేయొచ్చు. అలా కాకుండా ఏదో హై స్టాండర్డ్ క్రైమ్ థ్రిల్లర్ ని చూడబోతున్నామన్న ఎక్స్ పెక్టేషన్ ఏదైనా ఉంటే మాత్రం మీ ఊహకు భిన్నంగా వ్యతిరేక దిశలో వెళ్తాడు వి.

వి – రొటీన్ రివెంజ్ డ్రామా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి