iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 31 – ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

లాక్ డౌన్ రివ్యూ 31 – ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి వల్ల వినోదానికి కొత్త అర్థాలు దొరుకుతున్నాయి. లాక్ డౌన్ కు ముందు వరకు సినిమా అంటే థియేటరే అన్న అభిప్రాయాన్ని మారుస్తూ ఇప్పుడా ఘనతలో ఓటిటి కూడా భాగం తీసుకుంటోంది. అందులో భాగంగానే బాలీవుడ్ నుంచి తెలుగు దాకా అన్ని భాషల్లోనూ స్ట్రెయిట్ రిలీజుల పర్వం ఊపందుకుంది. ఇప్పటిదాకా ఓ మూడు వచ్చాయి కానీ దేనికీ మరీ ఎక్స్ట్రాడినరి రెస్పాన్స్ అయితే దక్కలేదు. ఉన్నంతలో ఒకటో రెండో డీసెంట్ అనిపించుకున్నాయి అంతే. అందుకే సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా చిత్రం కావడంతో పాటు కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా రెండో సినిమా అవ్వడం హైప్ ని పెంచింది. మరి అంచనాలను మించి ఈ మహేశుడు విశ్వరూపం చూపించాడా లేదా రివ్యూలో చూద్దాం

కథ

అరకులో ఉండే మహేష్|(సత్యదేవ్)ఓ సాధారణ ఫోటోగ్రాఫర్. చిన్న స్టూడియో నడుపుకుంటూ ఇంట్లో జబ్బుపడిన నాన్న(కెవి ప్రభాకర్)ని చూసుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇతనికి అండగా ఉంటారు నాటు వైద్యం చేసే బాబ్జీ(నరేష్), అతని దగ్గర పని చేసే సుహాస్(సుహాస్). ఇలా చీకుచింతా లేకుండా ఉన్న మహేష్ ఓ సందర్భంలో పక్కఊరి నుంచి వచ్చిన ఓ రౌడీతో గొడవ పడతాడు. అందరి ముందు వాడు తీవ్రంగా అవమానించడంతో పగ తీర్చుకునేదాకా చెప్పులు వేసుకోనని శపథం చేస్తాడు. ఈలోగా కొట్టినోడు ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళిపోతాడు. ఎప్పుడొస్తాడా అని మహేశు ఎదురుచూస్తున్న క్రమంలో జ్యోతి(రూపా కొడవయుర్)తో ప్రేమలో పడతాడు. మరి ఉమా మహేశ్వరుడి ప్రతీకారం ఏమయ్యింది. విదేశాలకు వెళ్లినవాడు తిరిగి వచ్చాడా, లవ్ స్టోరీ ఏమైనా అడ్డు పడిందా లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడాలి

నటీనటులు

సత్యదేవ్ ప్రతి సినిమాకు మెరుగు పడుతున్నాడు. అందులో సందేహం లేదు. అదృష్టమో దురదృష్టమో చెప్పలేం కానీ పాత్రలైతే మంచివి దక్కుతున్నాయి కానీ తనని ఇంకో స్థాయికి తీసుకెళ్లే హిట్టు పడకపోవడం విచిత్రం. తనవరకు ఏ లోపం ఎంచే అవకాశం ఇవ్వకుండా అలవోకగా ఉమామహేశుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశాడు. కథ చెప్పిన విధానం ఫ్రెష్ గా ఉండటంతో తనలో యాక్టర్ కి మంచి పని కల్పించాడు. దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంకొంచెం సానబడితే తెలుగులో వర్స టైల్ హీరోలు తక్కువగా ఉన్న కొరతను కొంతైనా తీర్చగలుగుతాడు. హీరోయిన్ రూపా కొడువయూర్ చూపులతోనే కాదు యాక్టింగ్ తోనూ ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ కే పరిమితమైనప్పటికీ గుర్తుండిపోతుంది. సహజమైన అందమే కాదు నటనలోనూ మెప్పించింది. తనతో పోలిస్తే మరో హీరొయిన్ హరిచందన చెప్పుకోదగ్గ ఎక్స్ ప్రెషన్లు ఇవ్వలేకపోయింది.

సీనియర్ నరేష్ మరోసారి తన టైమింగ్ తో తనకిచ్చిన బాధ్యతను బ్రహ్మాండంగా నెరవేర్చారు. ఇలాంటి రోల్స్ కు తానే బెస్ట్ ఆప్షనని మరోసారి ఋజువు చేశారు. సుహాస్. ఉన్నంతలో ఒప్పించాడు. కాకపోతే హెయిర్ స్టైల్ అతకలేదు. స్కోప్ దొరికిన సన్నివేశాల్లో తన టాలెంట్ చూపించేశాడు. సత్యదేవ్ తండ్రిగా నటించిన కె రాఘవన్ పోలికలో అచ్చం మన ధూళిపాళ మాదిరే అనిపిస్తారు. నటనలో పోల్చలేం కానీ దీనికి న్యాయం చేకూర్చారు. టిఎన్ఆర్, జబర్దస్త్ రామ్ ప్రసాద్ లవి చిన్న పాత్రలు. వీళ్ళు కాకుండా ఇంకొందరు కనపడతారు కానీ అన్నీ కొత్త మొహాలే కావడంతో గుర్తుపెట్టుకోవడం కష్టమే

డైరెక్టర్ అండ్ టీమ్

సాధారణంగా మలయాళం సినిమాల్లో అధిక శాతం సన్నని దారంలా అనిపించే కథా వస్తువు మీద నడుస్తాయి. అక్కడి కథకులు, దర్శకులు దానితోనే బలమైన ఎమోషన్స్ ని అల్లుకుని అద్భుతమైన అవుట్ ఫుట్ తీసుకొస్తారు. ఊరికే వింటే అవి సాధారణంగా అనిపిస్తాయి. కానీ తెరమీద చూసినప్పుడు ఏదో మేజిక్ జరిగిపోతుంది. గత కొన్నేళ్లుగా కేరళలో ఇలాంటి చిత్రాలు చాలానే వచ్చాయి. అందులో ఒకటి మహేషింటే ప్రతీకారం. దాని రీమేకే ఈ సినిమా. నిజానికి మన తెలుగు ఆడియన్స్ అభిరుచులు వేరు. హీరో పాత్ర సంఘర్షణకు లోనవ్వాలంటే చాలా బలమైన కారణాన్ని కోరుకుంటారు. సింపుల్ గా ఇంతేనా అనిపించే పాయింట్ కి అంత సులభంగా కనెక్ట్ కాలేరు. ఉమామహేశ్వరలో ప్రధానంగా ఉన్న సమస్య ఇదొక్కటే.

దర్శకుడు వెంకటేష్ మహా రిస్క్ అనుకున్నాడో లేక మార్పులు చేస్తే చెడగొట్టారని కామెంట్ చేస్తారనుకున్నాడో కానీ ఒక్క ఫ్రేమ్ మార్చకుండా మక్కికి మక్కి తీశాడు. ఇలా చేయడాన్ని తప్పుబట్టలేం. అయితే మలయాళంలో ఉన్న స్లో టెంపో మనవాళ్ళకు ఎంతమేరకు కనెక్ట్ అవుతుందో చెక్ చేసుకోవాల్సింది. అలా కాకుండా కెమెరా యాంగిల్స్ తో సహా ఏ చిన్న చేంజ్ లేకుండా తీయడం ఒకరకంగా మైనస్ గా నిలిచింది. హీరో చేసే శపథం బాగానే అనిపించినా దాని ముందు నడిచిన డ్రామా, ఆ తర్వాత సాగే ప్రహసనం మరీ గొప్పగా అనిపించవు. చాలా సన్నివేశాలు ఏదో సీరియల్ లేదా షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. చాలా పెయిన్ గా అనిపించాల్సిన మహేష్ మొదటి ప్రేమ కథ ఎమోషనల్ గా కనెక్ట్ కాకపోవడానికి కారణం ఇదే. పాత్రలు సహజంగా ప్రవర్తించినంత మాత్రాన ప్రేక్షకులు కథలో లీనమైపోరు. కేరాఫ్ కంచెరపాలెంలో అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి కాబట్టి జనం మెచ్చారు. కాని ఉమామహేశ్వరలో అవన్నీ పూర్తి స్థాయిలో పండలేదు.

టైటిల్ లో ఉగ్రరూపం అని ఉంది కాబట్టి దానికి తగ్గట్టే హీరో చేసే పనులను ఆశిస్తాం. కాని మహేశు తన పగను తీర్చుకోవడం కోసం కంగ్ ఫూ నేర్చుకోవడానికి వెళ్ళడం కూడా అవసరం లేని పనిగానే తోస్తుంది. విలన్ గా చూపించిన క్యారెక్టర్ దుబాయ్ వెళ్ళే దాకా మహేష్ నిర్లిప్తంగా ఉంటాడు. వాడు మహేష్ ని కొడుతున్నప్పుడు చోద్యం చూసిన ఊరివాళ్ళు తిరిగి వాడిని కొట్టడానికి వెళ్తున్నప్పుడు అందరూ బళ్ళు కట్టుకుని మరీ ఫాలో అయిపోవడం కొంత అసహజంగా అనిపిస్తుంది. అతని మీద అంత అభిమానమే ఉన్నప్పుడు గొడవ జరిగే టైంలోనే అడ్డుకుని ఉండవచ్చు కదానే లాజికల్ ఫీలింగ్ కలుగుతుంది. ఇదంతా మలయాళంలో ఉన్నదే. కాని ముందే చెప్పినట్టు రెండు రాష్ట్రాల అభిరుచుల్లో తేడా ఉందన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. అలా అని మరీ తీసికట్టుగా కాదు కాని ఏదో వెలితి సినిమా ఆసాంతం చూశాక మాత్రం కలుగుతుంది. అదే ఫలితాన్ని శాసించబోతోంది

ఒరిజినల్ వెర్షన్ కు సంగీతం అందించిన జాతీయ అవార్డు గ్రహీత బిజ్బల్ మణియిల్ దీనికి కూడా అవే ట్యూన్స్ వాడుకుని నేపథ్య సంగీతంతో సహా యథాతథంగా ఇచ్చారు. అక్కడ దీనికి వచ్చిన స్పందన గుర్తించే మనవాళ్ళు మార్పులకు ఇష్టపడలేదు కాబోలు అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. మంచి మెలోడీస్ తో బిజ్బల్ ఆకట్టుకుంటారు. బిజిఎం కూడా చాలా బాగా కుదిరింది. అప్పు ప్రభాకర్ ఛాయాగ్రహణం పల్లె అందాలను, కొండప్రాంతాల సౌందర్యాలను చక్కగా బంధించింది.సినిమాలో ఫీల్ ఎక్కడా మిస్సవ్వకుండా కాపాడుతూ వచ్చింది. రవితేజ గిరజాల ఎడిటింగ్ పర్వాలేదు. అక్కడక్కడ వద్దన్నా సాగతీత అనిపిస్తుంది. బడ్జెట్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాదు కాబట్టి మహాయనా-ఆర్కా ప్రొడక్షన్ వాల్యూస్ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వలేదు.

ప్లస్ గా అనిపించేవి

సత్యదేవ్ నటన
సహజమైన కథా నేపధ్యం
సంగీతం
ఛాయాగ్రహణం

మైనస్ గా తోచేవి

కాస్త ఎక్కువైన నిడివి
పూర్తిగా కనెక్ట్ కాని ఎమోషన్
మధ్యలో ల్యాగ్

కంక్లూజన్

ఎంత ఓటిటి అయినా డైరెక్ట్ డిజిటల్ లో రిలీజవుతున్న సినిమాలు థియేటర్ల కోసం ఉద్దేశించి తీసినవే కాబట్టి ఆ కోణంలోనే వీటి మంచి చెడులను విశ్లేషించాల్సి వస్తుంది. ఉమామహేశ్వరఉగ్రరూపస్య ఖచ్చితంగా డీసెంట్ మూవీనే. రీమేక్ అయినప్పటికీ దర్శకుడి పనితనం అభిరుచి కనిపిస్తాయి. కానీ తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ కు తగ్గట్టు ఇందులో బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ తో పాటు ఎమోషన్ పూర్తి స్థాయిలో పండలేదు. అందుకే సంపూర్ణంగా సంతృప్తిని అందివ్వడంలో మహేష్ జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకున్నాడు తప్పించి మరీ ఎక్కువగా ఆశిస్తే మాత్రం ఫైనల్ గా నిట్టూర్పే మిగులుస్తాడు. ఎంటర్ టైన్మెంట్ ఇంటికే నడిచి వస్తున్న తరుణంలో ఇలాంటి కంటెంట్స్ కి ఓటిటినే చక్కని వేదిక. హాలు దాకా వెళ్ళే రిస్కు, ఖర్చు లేకుండా దొరుకుతున్న ఆప్షన్ కాబట్టి మహేషుడిని ఓసారి పలకరించవచ్చు. చాలా పరిమిత అంచనాలతోనే సుమా

చివరి మాట

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య – అతి సహజత్వపు మాములు రూపం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి