iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 13 – అద్దె కొంప కష్టాలు

లాక్ డౌన్ రివ్యూ 13 – అద్దె కొంప కష్టాలు

ఇంట్లోనే ఉంటూ సమయాన్ని ఖర్చు పెట్టాల్సిన వేళ ప్రేక్షకులు బాషా భేదం లేకుండా క్వాలిటీ వినోదం కోసం వెతుకుతున్నారు. దీనికి ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వేదికగా నిలుస్తుండటంతో సబ్ టైటిల్స్ సహకారంతో మంచి కంటెంట్ ని కొత్త పాత అనే తేడా లేకుండా మరీ చూస్తున్నారు. అందులో భాగంగా గత ఏడాది వచ్చిన తమిళ సినిమా టు లెట్ ( TO LET) విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లో చోటు సంపాదించుకుని ఆడియన్స్ మెప్పు కూడా పొందింది. దీని కథాకమామీషు ఏంటో చూద్దాం

స్టోరీ

ఇలంగో(సంతోష్ శ్రీరామ్) సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూ చాలీ చాలని ఆదాయంతో స్వంతంగా రాసుకున్న కథలతో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాడు. చాలా ఇరుకైన ఇంట్లో తక్కువ మొత్తానికి అద్దె చెల్లిస్తూ నెట్టుకొస్తూ ఉంటాడు. భార్య అముద(షీలా రాజ్ కుమార్), ఐదేళ్ల కొడుకు సిద్దార్థ్(దరున్) ఇతని మీదే ఆధారపడి ఉంటారు. అయితే సాఫ్ట్ వేర్ బూమ్ వల్ల వీళ్ళుంటున్న చిన్న కొంపకు డిమాండ్ వచ్చేస్తుంది. ఓనర్ నిర్ధాక్షిణ్యంగా ఖాళీ చేయమని చెబుతుంది. రకరకాలుగా అవమానిస్తుంది. దీంతో వేట మొదలుపెడతాడు ఇలంగో. భార్యతో కలిసి డొక్కు స్కూటర్ మీద వీధి వీధి తిరుగుతాడు. కొన్ని దొరికినట్టే దొరికి చేజారతాయి. మరి ఇలంగో అనుకున్న లక్ష్యం చేరుకున్నాడా లేదా అనేదే కథ

నటీనటులు

ఇందులో పెద్దగా క్యాస్టింగ్ అంటూ ఏమి లేదు. కథ మొత్తం అధిక శాతం రెండు పాత్రల చుట్టే తిరుగుతుంది. ఇలంగో పాత్రలో సంతోష్ శ్రీరామ్ జీవించేశాడు. సహజమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆద్యంతం మన పక్కనే ఉంటూ ఇబ్బందులు పడే సగటు మధ్యతరగతి వాడిలా కనిపిస్తాడు. భార్యగా చేసిన షీలా రాజ్ కుమార్ అతనికి ఏ మాత్రం తీసిపోకుండా హావభావాలతో పాటు మానసిక సంఘర్షణకు గురయ్యే సన్నివేశాల్లో బెస్ట్ ఇచ్చేసింది. వీళ్ళు నిజంగా భార్యాభర్తలేమో అనేంతలా ఈ ఇద్దరూ తమ కెమిస్ట్రీతో పండించేసారు. చిన్న కుర్రాడు దరున్ తో కూడా మంచి అవుట్ ఫుట్ రాబట్టుకున్నారు. ఇంటి ఓనర్, సేటు, నిర్మాత ఇలా ఇతర పాత్రలు కొన్ని ఉన్నాయి కానీ అంతా అయ్యాక గుర్తుండేది మాత్రం ఆ జంటే.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు చెజియన్ తాను చెప్పాలనుకున్న కథను చాలా నిజాయితీగా చెప్పాడు. ఎక్కడ డీవియేషన్ లేకుండా సింపుల్ పాయింట్ ని హత్తుకునేలా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంది. నిజానికి ఇందులో ఒక్క శాతం కూడా కమర్షియల్ అంశాలు లేవు. అయినా కూడా మాస్ దీనికి కనెక్ట్ అయ్యేలా చెజియన్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అవును మనమూ ఇలాంటి ఇబ్బందులు పడ్డాం కదా అని సగటు మనిషి తనను తాను ఐడెంటిఫై చేసుకునేలా తీర్చిదిద్దిన విధానం టు లెట్ ని విన్నర్ గా నిలిపింది.

పగలబడి నవ్వే కామెడీ, వినోదాన్ని ఇచ్చే పాటలు, హుషారు గొలిపే ఫైట్లు, ఛాలెంజులు, ట్విస్టులు ఇవేవి లేకుండా టు లెట్ చాలా ప్లెయిన్ గా సాగుతుంది. అయినా బోర్ కొట్టదు. నిడివిని కేవలం గంటా నలభై నిమిషాలకే పరిమితం చేయడం టు లెట్ కు కలిసివచ్చింది. లొకేషన్స్ ఎంచుకున్న తీరు, బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని కథనం అల్లిన విధానం చెజియన్ ని మెచ్చుకునేలా చేస్తాయి. దీంట్లో సంగీతమే లేదన్న తలపు రాలేదంటేనే దర్శకుడి పనితనం ఎంత గొప్పదో అర్థమవుతుంది. తెలుగు వారైన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, చెజియనే కెమెరా బాధ్యతలు నిర్వర్తించిన విధానం దీన్ని చాలా ఉన్నతంగా నిలబెట్టింది

చివరి మాట

65వ జాతీయ అవార్డుల్లో ఎంతో పోటీని తట్టుకుని ఉత్తమ తమిళ చిత్రంగా టు లెట్ అవార్డు దక్కించుకుంది. జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో టు లెట్ కు అద్భుతమైన గుర్తింపు దక్కింది. ఇంత కన్నా ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది లేదు. గుండెలో ఎక్కడో ఓ మూల గుండెను తడి చేసుకుంటూ ఓ సగటు దిగువ మధ్య తరగతి మనిషి జీవితాన్ని కళ్ళకు కట్టునట్టు చూస్తూ అతనితో పాటు మనమూ ప్రయాణం చేయాలన్న అనుభూతిని పొందాలంటే టు లెట్ ని మిస్ అవ్వకండి. ఇలంగోకు ఉన్నన్ని కష్టాలు మనకు లేకపోవచ్చు. కానీ అతని దశని కనీసం కొంతైనా మనం ఖచ్చితంగా గతంలో అనుభవించే ఉంటాము. చూశాక మీరే ఒప్పుకుంటారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి