iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 25 – సూపియుం సుజాత‌యుం

లాక్ డౌన్ రివ్యూ  25 – సూపియుం సుజాత‌యుం

ఒక అంద‌మైన దృశ్యం – సూపియుం సుజాత‌యుం

థియేట‌ర్ల‌లో ప‌నికి రాని చెత్త‌ని OTTలో తెచ్చి ప‌డేస్తార‌ని దుర‌భిప్రాయం ఉండేది. కానీ సూపియుం సుజాత‌యుం (మ‌ల‌యాళం) చూసిన త‌ర్వాత అభిప్రాయం మారింది. ఇదొక అంద‌మైన ప్రేమ కావ్యం.

ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తే అది మ‌ణిర‌త్నం బొంబాయి. ఒక హిందువు అమ్మాయి ముస్లిం అబ్బాయిని ప్రేమించిన సినిమాలు తెలుగులో వ‌చ్చాయో లేదో నాకు తెలియ‌దు. ఇది అదే క‌థ‌.

ఆ అబ్బాయి కూడా ఒక సూపీ అయితే , ఆ అమ్మాయి చెవులు వినిపించి మాట‌లు రాని మూగమ్మాయి అయితే…మాట‌రాని మూగ ప్రేమ క‌థ‌.

నువ్వు చూసినా చూడ‌క‌పోయినా అల్లా నిన్ను చూస్తూ ఉంటాడు. ఇది సూపీయిజం. ముస్లింల‌లో ఇదొక తెగ‌. గుండ్ర‌టి పొడుగాటి టోపీలు పెట్టుకుంటారు. కేర‌ళ‌లో వీళ్లు ఎక్కువున్నారు.

ప‌ది సంవ‌త్స‌రాల త‌ర్వాత ఒక సూపీ యువ‌కుడు కేర‌ళ‌లోని ఒక చిన్న గ్రామానికి వ‌స్తాడు. అక్క‌డ మ‌సీదులో ఉద‌య‌పు ప్రార్థ‌న‌లు చేస్తూ చ‌నిపోతాడు. అత‌డెవ‌రు? అత‌ని క‌థ ఏంటి? దేవ‌దాసు సినిమాలో ఆఖ‌రి సీన్ గుర్తొస్తుందా? అదే ఈ సినిమాలో ఫ‌స్ట్ సీన్‌.

దుబాయ్‌లో ఉన్న సుజాత (అదితీరావు హైద‌రీ) ఉలిక్కి ప‌డి లేస్తుంది. ప‌క్క‌న పాప‌, భ‌ర్త నిద్ర‌పోతుంటాడు. ఆమె మ‌న‌సులో ఏదో క‌ల‌త‌.

సూపి మ‌ర‌ణం గురించి దుబాయ్‌లోని ఆమె భ‌ర్త‌కు ఫోన్ వ‌స్తుంది. సుజాత‌ను తీసుకుని ఇండియా బ‌య‌ల్దేరుతాడు.

సూపీ ఖ‌న‌నానికి గొయ్యి తీస్తున్న కుమ‌ర‌న్ ప్లాష్ బ్యాక్ చెబుతాడు.

మాట‌లు రాని ఒక అమ్మాయి , ఎక్కువ‌గా మాట్లాడ‌ని సూపీ ప్రేమ‌లో ప‌డ‌తారు. స‌హ‌జంగానే అమ్మాయి తండ్రి అడ్డుప‌డ‌తాడు. తండ్రి ప్రాణం కోసం ప్రేమ‌ను వ‌దులుకుంటుంది. పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్లిపోతుంది. ఇలాంటి క‌థ‌లు చాలా వ‌చ్చాయి క‌దా, నిజ‌మే వ‌చ్చాయి. ద‌ర్శ‌కుడు స‌రిగా చెబితే ఈ క‌థ‌ని ఎన్ని సార్లైనా చూస్తాం. వింటాం. న‌రని పూజ షాన్‌వాజ్ ఎలా చెప్పాడంటే ఒక అంద‌మైన దృశ్యంలా చెప్పాడు. ఒక పెయింటింగ్‌లా చూపించాడు. ఒక సంగీత రూప‌కంలా వినిపించాడు.

ఈ క‌థ‌లో గొప్ప‌త‌నం ఏమంటే సుజాత‌ని పోగొట్టుకున్న సూపీ ఈ ప‌దేళ్లు ఏం చేశాడో ఎక్క‌డా చెప్ప‌డు. భ‌ర్త‌తో సుజాత ఎలా ఉందో చూపించ‌డు. ఏడుపులు, వేద‌న‌లు, విర‌హాలు లేవు.

ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోలేక పోయారు. ఆమె జ్ఞాప‌కాల‌తో జీవించిన అత‌ను తిరిగి అదే ఊరికి , అదే మ‌సీద్‌కు వ‌చ్చి దైవ ప్రార్థ‌న‌లో చ‌నిపోతాడు. అత‌ని జ్ఞాప‌కాల‌తో బ‌తికిన ఆమె , చివ‌రి సారి అత‌న్ని చూసిందా లేదా? మ‌న ఊహకి అంద‌ని క్లైమాక్స్‌తో ముగుస్తుంది.

అదితీ ఒక గొప్ప న‌టి. స‌మ్మోహ‌నంతో ఆమె న‌ట‌న ప‌రిచ‌య‌మే. ప్ర‌తి భావాన్ని క‌ళ్ల‌తోనే చూపించింది. సూపీ చ‌నిపోయాడ‌ని తెలిసిన‌ప్పుడు దుక్కాన్ని క‌ళ్ల‌తో కాదు, Body languageతో చెబుతుంది. సూపీగా కొత్త న‌టుడు దేవ్‌మోహ‌న్ సూపీలాగే ఉన్నాడు. క‌ళ్ల‌లో ద‌య‌, నిర్మ‌ల‌త్వం, చిరున‌వ్వు.

సూపీ సంగీతం, సంస్కృతి, ఆచారాలు అద్భుతంగా చూపించారు. ముస్లింలంటే తీవ్ర వాదులుగా చూపించే మ‌న సినిమాలు దీన్ని చూసి చాలా నేర్చుకోవాలి.

సంగీతం బాగుందంటే చాలా చిన్న‌మాట‌.
ప్ర‌తి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ కాబ‌ట్టి , ఫొటోగ్ర‌ఫీకి మార్కులు వేసే ప్ర‌య‌త్నం చేస్తే అది సాహ‌స‌మే.
ఒక‌సారి చూస్తే , మ‌ళ్లీమ‌ళ్లీ చూస్తారు.
అమెజాన్‌లో కూడా మంచి మంచి సినిమాలు అప్పుడ‌ప్పుడు రిలీజ్ అవుతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి