iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 14 – పొన్ మగళ్ వందాల్ రివ్యూ

లాక్ డౌన్ రివ్యూ 14 – పొన్ మగళ్ వందాల్ రివ్యూ

లాక్ డౌన్ వల్ల సినిమా పరిశ్రమ అతలాకుతలం అవుతున్న వేళ నిర్మాతలకు ఒక మంచి ఆప్షన్ గా నిలుస్తున్న ఓటిటి రిలీజులు మెల్లగా ఊపందుకుంటున్నాయి. తెలుగులో అమృతరామంతో ఈ ట్రెండ్ మొదలయ్యింది కాని అది స్టార్ సపోర్ట్ లేని మూవీ కావడంతో అంతగా హై లైట్ కాలేకపోయింది. ఈ నేపధ్యంలో స్టార్ హీరో సూర్య తనే నిర్మాతగా భార్య జ్యోతికని ప్రధాన పాత్రలో నిర్మించిన పొన్ మగళ్ వందాల్ (పసిదేవత తిరిగివచ్చింది)ఇవాళ అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ప్రేక్షకుల నట్టింట్లోకి వచ్చేసింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ చూశాక అంచనాలు కూడా పెరిగాయి. మరి దానికి తగ్గట్టు ఈ చిత్రం ఉందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

2004లో ఊటి ప్రాంతంలో చిన్న వయసున్న ఆడపిల్లలను కిడ్నాప్ చేసి చంపే సైకో కిల్లర్ జోతిని పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపుతారు. 15 ఏళ్ళ తర్వాత జోతిని నిరపరాధిగా క్లెయిమ్ చేస్తూ లా చదువు పూర్తి చేసుకున్న వెంబా(జ్యోతిక)కేసుని మళ్ళీ ఓపెన్ చేయిస్తుంది. అందరూ దుమ్మెత్తిపోసినా తండ్రి పిటీషన్ పెతురాజ్(భాగ్య రాజ్)సహాయంతో ధైర్యంగా పోరాటం మొదలుపెడుతుంది.

అపోజిషన్ లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రాష్ట్రవ్యాప్తంగా పేరున్న లాయర్ రాజారత్నం(పార్తీబన్)వెంబాను ఆర్గుమెంట్ తో సాక్ష్యాలను తారుమారు చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. దీని వెనుక ఆ ఊళ్ళో దేవుడిగా కొలిచే వరదరాజన్(త్యాగరాజన్)హస్తం ఉందని గుర్తిస్తుంది వెంబా. అసలు జోతి నిజంగా సైకో కిల్లరా, అప్పటి ఆ హత్యల వెనుక ఎవరున్నారు లాంటి విషయాలన్నీ బోలెడు మలుపులతో ఉన్న సినిమాలోనే చూడాలి

నటీనటులు

ఇప్పటి తరం హీరోయిన్లలో అందంతో పాటు అంతకంటే మిన్నగా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. జ్యోతిక ఈ విషయంలో తాను ఎప్పుడూ ముందుంటానని చంద్రముఖి, మన్మథ లాంటి ఎన్నో సినిమాలతో చాలా ఏళ్ళ క్రితమే ఋజువు చేసింది. హీరో సూర్యను పెళ్లి చేసుకున్నాక కుటుంబం కోసం కొంత కాలం బ్రేక్ తీసుకుని మళ్ళీ మేకప్ వేసుకోవడం మొదలుపెట్టిన జ్యోతిక ఇందులో వెంబగా జీవించిందనే మాట చిన్నదే. ఒక లక్ష్యం కోసం పోరాడుతూ అవమానాలు, త్యాగాలు, మోసాలు, కుట్రలు అన్నీ భరిస్తూనే ఒంటరిగా ఎదిరించే పాత్రలో ప్రాణం పెట్టింది.

ఫస్ట్ హాఫ్ లో స్లోగా మొదలయ్యే తన పాత్ర ఆ తర్వాత మొత్తం తన కంట్రోల్ లో తీసుకుంటుంది. ఎమోషనల్ గా సాగే ఫ్లాష్ బ్యాక్ లో, క్రైమ్ ఎలిమెంట్ తో నడిచే వర్తమానంలో రెండు షేడ్స్ ని అద్భుతంగా క్యారీ చేసింది. ఇలాంటి వెంబ రోల్స్ కి ఇంకెవరైనా ప్రత్యాన్మాయం ఉన్నారా అంటే లేదు అని సమాధానం చెప్పేంత గొప్పగా జ్యోతిక బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. రాచ్ఛసి తర్వాత తనకు మరో మైల్ స్టోన్ గా ఈ మూవీని చెప్పుకోవచ్చు.

జ్యోతికతో సమానంగా స్క్రీన్ ప్రెజెన్స్ దక్కించుకున్న పార్తీబన్ అపోజిషన్ లాయర్ గా బాగా కుదిరాడు. తన అనుభవాన్ని ఉపయోగించి పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించారు. విలన్ గా త్యాగరాజన్ కూల్ గా చేసుకుంటూ పోయారు. ఎక్స్ ప్రెషన్స్ పరంగా పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండా చూపులు, బాడీ లాంగ్వేజ్ తో పని కానిచ్చేశారు. సీనియర్ నటులు భాగ్య రాజ్ బాధను భరిస్తూ కూతురి కోసం తపనపడే పాత్రలో అలవోకగా చేసుకుంటూ పోయారు. జడ్జ్ గా ప్రతాప్ పోతన్ సైతం చక్కగా మెప్పించారు. సపోర్టింగ్ రోల్స్ లో పాండియ రాజన్, వినోదిని వైద్యనాథన్, బిజిలి రమేష్ తదితరులు సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు జెజె ఫ్రెడ్రిక్ తన డెబ్యూ మూవీకి క్రైమ్ థ్రిల్లర్ కం కోర్ట్ డ్రామాని ఎంచుకుని చాలా తెలివైన పని చేశాడు. సాధారణంగా ఈ రెండూ మిక్స్ చేయడం అంత సులభం కాదు. కానీ ఒకపక్క ఆసక్తి రేపే కథనంతో సినిమాను నడిపిస్తునే మరోవైపు ఆడపిల్లలను పట్టిపీడిస్తున్న దారుణమైన సమస్యను వీలైనంత సినిమాటిక్ గా చెప్పే ప్రయత్నం సిన్సియర్ గా చేశాడు. ఫ్రెడ్రిక్ పనితనం క్యాస్టింగ్ లో కనిపిస్తుంది .

తలలు పండిన ఐదుగురు సీనియర్ నటులు కం దర్శకులను తీసుకుని తన మీద ఉన్న ఒత్తిడిని సాధ్యమైనంత మేరకు తగ్గించుకుని మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నాడు. ఇతను చెప్పాలనుకున్న ఉద్దేశం మంచిదే. కాకపోతే కాన్సెప్ట్ ని ఎమోషనల్ గా బలంగా రిజిస్టర్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని అవసరం లేని సన్నివేశాలు, సెంటిమెంట్ పాటలను పెట్టడం ఒకరకంగా ఫ్లోని దెబ్బ తీసింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఇది కొంత వరకు మైనస్ అయ్యింది.

ఊహలకు అనుగుణంగానే కథ నడుస్తున్నట్టు అనిపించినా ఊహించని ట్విస్టులతో క్యారెక్టర్ డిజైనింగ్ చేసుకుని తన ప్రత్యేకత చాటుకున్నాడు ఫ్రెడ్రిక్. కాకపోతే రెండు గంటల నిడివి ఉండాలన్న టార్గెట్ పెట్టుకున్నాడు కాబోలు కొంత ల్యాగ్ అనిపించే పార్ట్ సినిమాలో ఉంది. అయితే ఒక్కొక్క చిక్కుముడిని విప్పుతూ ఒక దశవరకూ గ్రిప్పింగ్ గా నడిపించిన ఫ్రెడ్రిక్ ప్రీ క్లైమాక్స్ నుంచి సింపుల్ గా నడిపించేయడం చిన్న అసంతృప్తి కలిగిస్తుంది. అసలు హంతకుడు బయటపడే తీరు కూడా డ్రమాటిక్ గా అనిపిస్తుంది. అయితే ఇవి క్షమించదగినవే.

ఫైనల్ గా చెప్పాలంటే టెక్నికల్ గా, కంటెంట్ పరంగా తనలో విషయముందని ఋజువు చేశాడు ఫ్రెడ్రిక్. 96 ఫేం గోవింద్ వసంత సంగీతం బాగుంది. కాని టెంపోని నెమ్మదించేలా పాటలు మధ్యమధ్యలో రావడంతో అంతగా కనెక్ట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాయి. రాంజీ కెమెరా పనితనాన్ని మెచ్చుకోవచ్చు. ఊటి అందాలను చూపిస్తూనే డ్రామాలోని ఇంటెన్సిటీని తన కలరింగ్ స్కీంతో చక్కగా సెట్ చేసుకున్నారు. రూబెన్ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటె క్రిస్పిగా ఉండేది. సూర్య నిర్మాణ విలువల్లో రాజీ కనిపించలేదు. తక్కువ బడ్జెటే అయినా క్వాలిటీ వచ్చేలా ఖర్చు పెట్టారు

ప్లస్ పాయింట్స్

జ్యోతిక సూపర్బ్ పెర్ఫార్మన్స్
పార్తిబన్ పాత్ర
ఇంటర్వెల్ ట్విస్ట్
స్క్రీన్ ప్లే
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ ‘

పాటలు
మోతాదు మించిన సెంటిమెంట్ డ్రామా
అక్కడక్కడ వేగం తగ్గడం

ది కంక్లూజన్

కమర్షియల్ అంశాలు, స్టార్ హీరో సపోర్ట్, భారీ బడ్జెట్ ఇవేవి లేకుండా ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ క్రైమ్ కం కోర్ట్ డ్రామాని నడిపించడం అంత ఈజీ కాదు. కాని కొత్త దర్శకుడు ఫ్రెడ్రిక్ ఈ ఛాలెంజ్ ని జ్యోతిక అనే నటనాస్త్రంతో ఈజీగానే దాటేశాడు. కాకపోతే కథనం నడిచే విధానంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే పొన్ మగళ్ వందాల్ ఇంకో స్థాయిలో ఉండేది. అయినప్పటికీ ఇది బ్యాడ్ ఛాయస్ కాకుండా కాపు కాచారు ఫ్రెడ్రిక్ అండ్ జ్యోతిక. ఈ ఇద్దరూ కలిసి తమలోని బెస్ట్ ఇవ్వడంతో సినిమా చూశాక అసంతృప్తి కలగకుండా మేనేజ్ చేశారు. కోర్ట్ డ్రామానే అయినప్పటికీ ఒక సెన్సిటివ్ ఇష్యూని తీసుకున్న దర్శకుడు దాన్ని మలిచిన తీరు నిరాశపడకుండా చేస్తుంది. అందుకే ఓటిటిలో చెప్పుకోదగ్గ అంచనాలతో వచ్చిన పొన్ మగళ్ వందాల్ డిజిటల్ పరీక్షని సక్సెస్ ఫుల్ గా పాస్ అయినట్టే. కాకపోతే డిస్టింక్షన్ రాలేదు కాని మంచి మార్కులతోనే గట్టెక్కేసింది.

ఒక్క మాటలో

పొన్ మగళ్ వందాల్ – మెప్పించే క్రైమ్ కం కోర్ట్ డ్రామా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి