iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 41 – మిస్టరీ లాకప్

లాక్ డౌన్ రివ్యూ 41 – మిస్టరీ లాకప్

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ పుణ్యమాని అన్ని ప్రధాన భాషల్లో కలిపి వారానికి రెండు మూడు కొత్త సినిమాలు ప్రేక్షకులను నేరుగా ఇంటికొచ్చి మరీ పలకరిస్తున్నాయి. తెలుగు తమిళం మలయాళం అనే భేదం లేకుండా లాంగ్వేజ్ రాకపోతేనేం సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూసేస్తున్నారు. అందుకే అన్ని యాప్స్ లోనూ స్ట్రీమింగ్ కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో వచ్చిన మూవీ లాకప్. సుప్రసిద్ధ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి గారి అబ్బాయి వైభవ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో మరో ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు కీలక పాత్ర పోషించడం విశేషం. ట్రైలర్ తో ఓ మాదిరి ఆసక్తి రేపిన ఈ లాకప్ వెనుక ఉన్న కథాకమామీషు ఏంటనేది రివ్యూలో చూద్దాం

కథ

ఓ పోలీస్ ఆఫీసర్ ని ఎవరో చాలా దారుణంగా అతని ఇంట్లోనే గొంతు కోసి హత్య చేస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తుంది ఇలైవరసి(ఈశ్వరిరావు). ఆ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉంటూ ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు వసంత్(వైభవ్). ఎస్ఐగా ఉన్న మూర్తి(వెంకట్ ప్రభు)కదలికలు అనుమానాస్పదంగా ఉంటాయి. అదే రోజు మల్లిగ(పూర్ణ)అనే పనిమనిషి కూడా అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకుంటుంది. దీనికి ముందు మర్డర్ కి లింక్ ఉందని గుర్తిస్తుంది ఇలైవరసి. దాన్ని చేధించే క్రమంలో ముందుకు వెళ్లేకొద్దీ విస్తుపోయే నిజాలు బయటికి వస్తాయి. అసలు ఇవి ఎవరు చేశారు. రెండు చావుల వెనుక ఉన్న మిస్టరీ ఏంటనేది బుల్లితెరపై చూడాల్సిందే

నటీనటులు

మనదగ్గర రాణించలేదు కానీ వైభవ్ తమిళనాట మంచి పేరు సంపాదించుకున్నాడు. స్టార్ రేంజ్ కు వెళ్లకపోయినా మీడియం రేంజ్ లోనే తనకంటూ ఓ మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు. ఇందులో వసంత్ గా చేసిన పాత్ర మరీ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసేది కాకపోయినా ఉన్నంతలో చక్కగా నెట్టుకొచ్చాడు. హీరో మెటీరియల్ కాదని ఎప్పుడో ఋజువయ్యింది కాబట్టి ఇలాంటి డీసెంట్ రోల్స్ తో కంటిన్యూ కావడం ఉత్తమం. ఈశ్వరిరావు పోలీస్ ఆఫీసర్ గా మొదటిసారి డిఫరెంట్ మేకోవర్ తో కనిపించారు.

ఎక్కువసార్లు చీరలు కట్టుకుని కన్నీళ్లు ఒలికించే సగటు ఆంటీ పాత్రలే చేస్తూ వచ్చిన ఈవిడ ఇందులో స్టైలిష్ గా కనిపించడమే కాదు ఆ గెటప్ లో మెప్పించడమూ విశేషం.
అవును ఫేమ్ పూర్ణది చాలా చిన్న రోల్. కాకపోతే కథను ప్రధానమైన లింక్ ఉన్నది కావడంతో మరీ బ్యాడ్ గా అనిపించదు. ఇక మొదటిసారి వేషం కట్టిన విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు అనుభవం లేకపోయినా నటుడిగా బాగానే చేశారు. కొన్ని సీన్స్ లో ఎక్స్ ప్రెషన్స్ బాలన్స్ తప్పినా ముందు ముందు నటుడిగా కొనసాగొచ్చనే నమ్మకమైతే కలిగించారు. వైభవ్ లవర్ గా చేసిన వాణి భోజన్ కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితం. వీళ్ళు తప్ప అందరూ పెద్దగా ప్రాధాన్యం ఉన్న వాళ్ళు కాదు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు ఎస్జి ఛార్లెస్ కి ఇది మొదటి సినిమా. తీసుకున్న ప్లాట్ లో విషయం ఉంది కానీ దాన్ని తీర్చిదిద్దిన తీరే కొంచెం ఖంగాళీగా ఉంది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ లో ఊహించని ట్విస్టులు ఉంటే సరిపోదు. వాటికి బలమైన నేపధ్యం, ఒకదానికి మరొకటికి థ్రిల్ అనిపించే లింకులు ఉండాలి. లాకప్ లో మిస్ అయ్యింది అదే. టైటిలే క్యాచీగా ఉండాలని పెట్టుకున్నారు కాని నిజానికిది మర్డర్ స్పాట్, హాస్పిటల్, స్టేషన్ రూమ్ ఇలా పరిమిత పరిసరాల్లోనే సాగుతుంది తప్ప ఒక క్యారెక్టర్ మినహా ఇంకెవరు ఊచల వెనుక వెళ్ళరు. ఇది కేవలం అటెన్షన్ కోసం పెట్టుకున్న పేరు.

ఓపెన్ చేయడంలో ఆసక్తి రేపి దానికి మరో మిస్టరీని జత చేయడం బాగానే ఉంది కానీ ఆ తర్వాత వాటిని ముడివిప్పే క్రమంలో ఛార్లెస్ రాసుకున్న కథనం చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. వచ్చే ప్రతి మలుపు ఏదో ట్విస్టులా అనిపిస్తుంది తప్ప భలే షాక్ ఇచ్చాడే అనే ఫీలింగ్ కలగదు. కాకపోతే ఎవరు చంపి ఉంటారు అనేది గెస్ చేసే అవకాశం ఇవ్వకుండా తీసుకున్న జాగ్రత్త ఫలించింది. మొత్తంగా లాకప్ ఊచలు బలంగా ఉన్నాయి కాని వాటిని బిగించుకున్న గేటుకు తాళం మర్చిపోయాడు దర్శకుడు

అర్రోల్ కోరేల్లి సంగీతం పర్వాలేదు. ఎలాంటి ప్రత్యేకత లేదు. ఇలాంటి వాటికి బలంగా నిలవాల్సిన బిజిఎం ఓ మోస్తరుగా ఉందే తప్ప స్పెషల్ అనే ఫీలింగ్ కలిగించదు. బాగా లో బడ్జెట్ కావడంతో సంతానం శేఖర్ ఛాయాగ్రహణం డీసెంట్ గా ఉందని చెప్పడం తప్ప ఏమి చేయలేం. ఛాలెంజింగ్ అనిపించే వర్క్ ఏదీ ఇందులో లేదు. ఆనంద్ గెరాల్డిన్ ఎడిటింగ్ చాలా కష్టపడి గంటా యాభై నిమిషాల లోపే ఫైనల్ కట్ ఇచ్చినా సెకండ్ హాఫ్ లో చాలా చోట్ల ల్యాగ్ అనిపించడం అతని సమస్య కాదు. రైటింగే అలా ఉంది. శివేద్ గ్రూప్ బ్యానర్ కు ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు తప్ప ప్రొడక్షన్ పరంగా ఖర్చు విషయంలో పెద్దగా రిస్క్ తీసుకున్నదేమి లేదు.

కంక్లూజన్

క్రైమ్ కథ అనగానే ఒకటి లేదా రెండు హత్యలు వాటి వెనుక మనకు కనిపించని హంతకుడు లేదా సైకో కిల్లర్. అవే కళ్ళుతో మొదలుకుని ఇప్పటిదాకా వచ్చిన వందల సినిమాల్లో ఇంచుమించు ఇదే పాయింట్ మీద సాగుతాయి. కాకపోతే కొన్ని విజయం సాధించడానికి కొన్ని ఫ్లాప్ కావడానికి కారణం రాసుకున్న విధానం, చూపించిన వైనం. ములుపులు పెట్టినంత మాత్రాన ఇలాంటి కథలు ఎగ్జైట్ చేయవు. బలమైన కథా వస్తువు కావాలి. లాకప్ ఈ విషయంలో సంతృప్తిపరచలేక యావరేజ్ కు ఓ మెట్టు కిందే నిలిచిపోయింది. ఇలాంటి సినిమాలు విపరీతంగా చూసే అలవాటు ఉన్న వాళ్ళు ఓ లుక్ వేయొచ్చు కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం రుచించే అవకాశాలు తక్కువ.

లాకప్ – పేలని గన్ను

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి