iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 21 – కృష్ణ And His లీల

లాక్ డౌన్ రివ్యూ 21 – కృష్ణ And His లీల

ఓటిటి ట్రెండ్ కొనసాగుతున్న వేళ చిన్న సినిమాలు వరసగా డిజిటల్ దారి పట్టడం మొదలయ్యింది. పేరున్న హీరోలవి కాకపోయినా నిర్మాణ సంస్థల బ్రాండ్ ఇమేజ్ ని బట్టి వీటి మీద ఆసక్తి బాగానే కలుగుతోంది. మొన్న కీర్తి సురేష్ పెంగ్విన్ ని టాక్ తో సంబంధం లేకుండా జనం బాగానే చూశారని లీకవుతున్న స్టాట్స్ ని బట్టి అర్థమవుతోంది. ఈ కోవలోకే వచ్చిన మరో చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీల. సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంయుక్తంగా నిర్మించడంలో దీని మీద కొద్దోగొప్పో అంచనాలు ఉన్నాయి. అందులోనూ జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్లలో ఒకరు కావడంతో కొంత హైప్ తోడయ్యింది. నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలైన ఈ రామ్ కామ్ స్టోరీ అందరికి నచ్చేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

కృష్ణ(సిద్దు జొన్నలగడ్డ)కుదురుగా ఆలోచనలు లేని ఓ యువకుడు. కాస్త అతి చేయడంతో ప్రేమించిన అమ్మాయి సత్య(శ్రద్ధ శ్రీనాథ్)బ్రేకప్ చెప్పేసి ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్ళిపోతుంది. దీంతో కొత్తగా పరిచయమైన రాధ(శాలిని వడ్నికట్టి)ని లైన్ లో పెట్టి కొత్త లవ్ స్టొరీ మొదలుపెడతాడు కృష్ణ. మధ్యలో రుక్సర్(సీరత్ కపూర్)తో కూడా స్నేహం ఉంటుంది. రాధతో ప్రేమ పాకాన పడ్డాక కృష్ణ జీవితంలోకి మళ్ళీ సత్య వస్తుంది. ఒకరికి తెలియకుండా మరొకరితో కృష్ణ ప్రేమాయణం కొనసాగిస్తాడు. ఒక దశలో ఇది ఆ ఇద్దరికీ తెలిసిపోతుంది. మరి ఎవరి వైపు కృష్ణ మొగ్గు చూపాడు, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేదే బాలన్స్ స్టోరీ

నటీనటులు

సిద్దు జొన్నలగడ్డలో మంచి నటుడు ఉన్నాడు కానీ అతన్ని ఇప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూడటం అలవాటు కావడంతో చాలా సార్లు హీరో మెటీరియల్ కాదేనన్న అభిప్రాయం మెదడుని తొలిచేస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఉన్నంతలో బాగానే కృష్ణ పాత్రను నిలబెట్టాడు. స్థిరత్వం లేని నేటి యువకుల మనస్తత్వాన్ని తన ఎక్స్ ప్రెషన్స్, నటన ద్వారా ఓ మాదిరిగా ఇవ్వగలిగాడు తప్పించి ఇన్నాళ్లు ఇంత మంచి యాక్టర్ ని మిస్సయ్యామా అనే ఫీలింగ్ అయితే కలగదు. మెయిన్ హీరోయిన్ గా చేసిన శ్రద్ధ శ్రీనాథ్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. చాలా చోట్ల సిద్దుని డామినేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది కూడా. సహజంగానే ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న శ్రద్ధ ఇందులో గ్లామర్, ఇంటిమసి సీన్స్ పరంగా కొంచెం పట్టువిడుపు ఇవ్వడం బోనస్. కాకపోతే డబ్బింగ్ చెప్పిన వాయిస్ తనకు అంతగా నప్పలేదు. టీమ్ చెక్ చేసుకుని ఉంటే బాగుండేది.

ఇక షాలిని వడ్నికట్టి కూడా బెస్ట్ ఇచ్చింది. గొప్ప అందగత్తె కాకపోయినా చూడాలనిపించే లుక్స్ తో చక్కని అవుట్ పుట్ ఇచ్చింది. అటు ఎమోషనల్ సీన్స్ లోనూ ఇటు లవ్ ఎపిసోడ్స్ లోనూ దర్శకుడు కోరుకున్న దానికి పూర్తి న్యాయం చేకూర్చింది. శ్రద్ధలాగే తను కూడా సిద్దుని ఓవర్ టేక్ చేసింది. సీరత్ కపూర్ ది చెప్పుకోదగ్గ పాత్ర కాదు. ఒకరకంగా చెప్పాలంటే డమ్మీ. ఏదో హీరోకి కృష్ణ అనే పేరు పెట్టారు కాబట్టి అతని జీవితంలో ఎక్కువ అమ్మాయిలు ఉండాలనే ఉద్దేశంతో ఇరికించారు తప్ప తను చేసింది కూడా ఏమీ లేదు. వైవా హర్షని నవ్వించేందుకు వాడుకున్నారు కాని తను సోసోనే. కృష్ణ తల్లిగా ఝాన్సీ తన సీనియారిటీతో హుందాగా కానిచ్చేశారు. సెకండ్ హాఫ్ లో మాత్రమే కనిపించే సంపత్ రాజ్ చిన్న సర్ ప్రైజ్. అయితే పాత్ర పరంగా ఎలాంటి మెరుపులు లేవు. ఛాలెంజింగ్ అనిపించేదేదీ లేకపోవడంతో ఆయన జస్ట్ అలా చేసుకుంటూ పోయారు అంతే

డైరెక్టర్ అండ్ టీమ్

క్షణం సినిమాతో అందరిని థ్రిల్ కు గురి చేసి ఎవరితను అని చూపు తన వైపు తిప్పుకునేలా చేసిన రవికాంత్ పేరేపు దీనికి దర్శకుడు. నాలుగేళ్లుగా కృష్ణ అండ్ హిస్ లీల మీదే వర్క్ చేయడంతో అంత స్పెషల్ గా ఇందులో ఏముందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలగడం సహజం. అయితే రవికాంత్ తీసుకున్న ప్లాట్ చూస్తే మాత్రం ఆశ్చర్యంతో పాటు షాక్ కలుగుతుంది. కృష్ణ అండ్ హిస్ లీలలో కథపరంగా ఎలాంటి ప్రత్యేకత లేదు. ఇప్పటి యువతరం మనస్తత్వాలను తీసుకుని ఒక కూల్ రామ్ కామ్ ఇవ్వాలని రవికాంత్ చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇంతోటి దానికి ఇంత టైం తీసుకున్నాడా అనే సందేహం కలిగితే అది ముమ్మాటికీ ప్రేక్షకుల తప్పు కాదు. ఇప్పటికే ఇదే పాయింట్ తో చాలా సినిమాలు వచ్చాయి. రామ్ చరణ్ ఆరంజ్, నీహారిక సూర్యకాంతం ఇంచుమించు ఇలాంటి థీమ్ తో వచ్చినవే. అవి ఫెయిల్ అవ్వడంలో సదరు దర్శకులు ఏవైతే తప్పులు చేశారో ఇందులో కూడా రవికాంత్ ప్రేరేపు వాటినే రిపీట్ చేయడంతో రిజల్ట్ కూడా అదే తరహాలో వచ్చే అవకాశం చాలా ఉంది. శ్రీవిష్ణు మెంటల్ మదిలోనూ ఈ పాయింట్ ఉంటుంది.

ప్రేమ కథలను ప్రతిసారి కొత్తగా చెప్పలేం నిజమే. ఎందుకంటే ఒక్క ఈ జానర్ లోనే చాలా పరిమితులు ఉంటాయి. వాటికి లోబడే మనం తెరపై చూపగలగాలి. అలాంటప్పుడు ఎంత ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే నడిపిస్తున్నామనేది చాలా కీలకం. ఎంత యూత్ అయినా ప్రతి లవ్ స్టొరీని గుడ్డిగా ఆదరించని బాక్స్ ఆఫీస్ చాలా సార్లు ఋజువు చేసింది. రొమాన్సో లేదా మ్యూజిక్ ఒకటే ఉంటే సరిపోదు. చూస్తున్నంత సేపు పాత్రలతో పాటు ప్రయాణించే ఫీల్ కలగాలి. అది లేనప్పుడు మిగిలిన అంశాలు ఎంత కష్టపడినా లాభం ఉండదు. చాలా చిన్న లైన్ తో కృష్ణ అనే యువకుడి బయోపిక్ ని చెప్పాలని రవికాంత్ చేసిన ప్రయత్నం అంతగా సఫలీకృతం కాలేదు. మొదలైన కాసేపటికే కథలో నత్తనడక ప్రారంభమవుతుంది. ఎంతకీ ముందుకు సాగని ఫీలింగ్ పదే పదే కలుగుతుంది. ఒకే చోట చాలా సేపు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది గుర్తించే కాబోలు హీరో తల్లి తండ్రికి ఉన్న బ్రేకప్ ని ఇరికించాడు కాని ఇదీ గతంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో రమ్యకృష్ణ-ప్రకాష్ రాజ్ ల ట్రాక్ నుంచి స్ఫూర్తి పొందిందని ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడా నవ్యత లేకుండా ఊరికే సాగతీతకు గురి చేసిన రవికాంత్ క్షణంతో వచ్చిన ఇంప్రెషన్ ని నిలబెట్టుకోలేదనేది వాస్తవం

సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల తన వంతు బాధ్యతను బాగానే నిర్వర్తించాడు. పదే పదే వచ్చే చిన్న బిట్స్ సాంగ్స్, పాటలతో చాలా సార్లు అసహనం కలిగినా ఇందులో ఇతని తప్పేమీ లేదు. అది దర్శకుడి ఆలోచన కాబట్టి శ్రీచరణ్ ను నిందించడానికి లేదు. రవికాంత్, సిద్దుల సంభాషణలు మరీ గొప్పగా లేవు కాని పర్వాలేదని చెప్పొచ్చు. శానియాల్ డియో-సాయి ప్రకాష్ ఛాయాగ్రహణం బాగుంది. లిమిటెడ్ బడ్జెట్ లో విజువల్స్ ని నీట్ గా చూపడంలో సక్సెస్ అయ్యారు. గ్యారీ-రవికాంత్-సిద్దుల జాయింట్ ఎడిటింగ్ మాత్రం ఇంకొంచెం కత్తెరకు పని చెప్పాల్సింది. రెండు గంటల లోపే ఉన్నా చాలా చోట్ల బోర్ కొట్టేస్తుంది. ఫీచర్ ఫిలిం కనక లెంత్ కోసం రాజీ పడినట్టున్నారు. బడ్జెట్ మూవీ కాబట్టి నిర్మాణపరంగా భారీ డిమాండ్ ఏదీ లేకపోయినా క్వాలిటీ వచ్చేలా సురేష్, వయకాం 18 సంస్థలు ఖర్చు పెట్టారు.

ప్లస్ గా అనిపించేవి

శ్రద్ధా శ్రీనాథ్, శాలిని నటన
ఫీల్ గుడ్ మ్యూజిక్
కెమెరా

మైనస్ గా తోచేవి

సాగతీత స్క్రీన్ ప్లే
సింగిల్ పాయింట్ స్టొరీ
మూడు పాత్రల చుట్టే తిరగడం

కంక్లూజన్

ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా స్మార్ట్ ఫోన్లోనో, టీవీలోనో కొత్త సినిమాలు చూసే వెసులుబాటు ఉండటంతో ఓటిటిలకు డిమాండ్ పెరిగిన మాట వాస్తవం. అయితే గత రెండు నెలలుగా థియేటర్ కు వెళ్ళకుండా నేరుగా డిజిటల్ రిలీజ్ చేసుకున్న చిత్రాలేవి గొప్పగా అలరించలేకపోయాయి. కృష్ణ అండ్ హిస్ లీల మినహాయింపుగా నిలుస్తుందేమోనని ఆశిస్తే ఇదీ పైన చెప్పిన బ్యాచ్ లోకే చేరిపోయింది. ప్రేమకథనే అయినప్పటికీ ప్రత్యేకంగా యూత్ ని మెప్పించే టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా వాళ్ళను పూర్తిగా సంతృప్తిపరిచేలా సాగలేదు. క్లాసిక్ అనిపించుకోవాలనో లేదా క్రిటిక్స్ తో మెప్పు పొందాలనో సాగతీత కథనాన్ని రాసుకుంటే ఎవరికైనా ఒకటే ఫలితం దక్కుతుంది. కృష్ణ అండ్ హిస్ లీల కూడా అంతే. చాలా తక్కువ అంచనాలతో ఎక్కువ ఫ్రీ టైం ఉంటే తప్ప ఇది రైట్ ఛాయస్ అనిపించుకునే లక్షణాలు ఇందులో చాలా తక్కువగా ఉన్నాయి.

ఒక మాటలో

కృష్ణ అండ్ హిస్ లీల – సాగదీసిన ప్రేమగోల

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి