iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 47 – జోసెఫ్

లాక్ డౌన్ రివ్యూ 47 – జోసెఫ్

ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి రేపుతున్న మలయాళం సినిమాలు అటు కంటెంట్ పరంగా ఇటు క్వాలిటీ పరంగా మంచి స్టాండర్డ్ లో రూపొందుతూ రీమేకుల విషయంలోనూ మంచి డిమాండ్ తెచ్చుకుంటున్నాయి. మన ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు ఉన్నాయా లేదా అనేది పక్కనపెడితే ఓటిటి మాధ్యమంలో ఉచితంగా చూసేందుకు మాత్రం బెస్ట్ ఛాయస్ గా నిలుస్తున్నాయి. వీటినే ఆడియన్స్ థియేటర్లలో చూస్తారా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం కష్టం. గత కొంతకాలంగా వచ్చిన మల్లువుడ్ మూవీస్ చూసుకుంటే అందులో బాగా నానిన పేరు జోసెఫ్. కన్నడలో ఇప్పటికే క్రేజీ స్టార్ రవిచంద్రన్ హీరోగా రవిబొప్పన్న పేరుతో రీమేక్ కాగా తెలుగులోనూ ఓ సీనియర్ హీరోతో రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అడ్వాన్స్ గా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం పదండి

కథ

జోసెఫ్(జోజు జార్జ్)రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. వృత్తి మానేసినా చురుకైన అతని నేరపరిశోధన నైపుణ్యాలను డిపార్ట్ మెంట్ అవసరం వచ్చినప్పుడల్లా వాడుకుంటూ ఉంటుంది. భార్య స్టెల్లా(అత్మియ రాజన్)ఇతన్ని వదిలేసి పీటర్(దిలీష్ పోతన్)ను రెండో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఓరోజు అనూహ్యంగా స్టెల్లాకు యాక్సిడెంట్ జరిగి అనుమానాస్పద పరిస్థితుల్లో కన్ను మూస్తుంది. దీని వెనుక ఏదో బలమైన ముఠా ఉందని తెలుసుకున్న జోసెఫ్ తనే స్వంతంగా విచారణ మొదలుపెడతాడు. అప్పుడే మనుషుల అవయవాలు అమ్ముకునే మెడికల్ మాఫియా గురించి క్లూలు దొరుకుతాయి. అయితే చట్టానికి పట్టివ్వడానికి ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో ఎవరూ చేయని సాహసానికి పూనుకుంటాడు. స్టెల్లా చావుకు కారణమైన వాళ్ళను జోసెఫ్ ఎలా పట్టుకున్నాడు, హాస్పిటళ్ళ ముసుగులో జరుగుతున్న స్కామ్ ని ఎలా బయటపెట్టాడు అనేదే అసలు స్టోరీ

నటీనటులు

ఇదంతా జోజు జార్జ్ వన్ మ్యాన్ షో. ఎంత నటన అంటే ఏకంగా స్పెషల్ మెన్షన్ క్యాటగిరీలో నేషనల్ అవార్డు తెచ్చుకోవడాన్ని బట్టి చెప్పొచ్చు ఎంతగా అందులో ఒదిగిపోయాడో. మనకు పరిచయం లేదు కానీ సినిమా మొదలైన కాసేపటికే జోసెఫ్ పాత్రతో మనమూ కనెక్ట్ అయిపోతాం. జీవితంలో ఏ తోడు లేక తాగుడుకు బానిసై పోలీసులు పిలిచినప్పుడు మాత్రం వాళ్లకు సహాయం చేసే వ్యక్తిగా జీవించేశాడు. పైకి పెద్దగా ఎక్స్ ప్రెషన్లు లేనట్టుగా కనిపించినా జోజు ప్రత్యేకత తన కళ్ళతో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ ఉంది.

నిజానికి స్క్రిప్ట్ డిమాండ్ మేరకు తనను తాను అలా మలుచుకున్నాడు తప్ప ఇతనిలో ఎంత మంచి ఆర్టిస్ట్ ఉన్నాడో చాలా సీన్స్ లో గమనించవచ్చు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ కార్డు దాకా జీజు జార్జ్ దాదాపు అన్ని సీన్స్ లోనూ కనిపిస్తాడు. ఇతర పాత్రలు చాలానే ఉన్నప్పటికీ తన ఉనికిని మాత్రమే ప్రేక్షకులు గుర్తుంచుకునేలా జోసెఫ్ గా పరకాయప్రవేశం చేశాడు. మిగిలిన క్యాస్టింగ్ నెంబర్ పరంగా భారీగా ఉంది. అందులో ఏవీ తెలిసిన మొహాలు కాకపోయినా సహజమైన నటనతో అందరూ కనెక్ట్ అవుతారు. ఇందులో హీరోయిన్ లేదు. హీరో పాత్ర డిజైన్ చేయడమే వయసు మళ్ళిన వాడిగా చూపించడంతో ఆ అవసరం పడలేదు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు ఎం పద్మకుమార్ తీసుకున్న థీమ్ చాలా సీరియస్ ఇష్యూ. ఈ సినిమా విడుదలైనప్పుడు కేరళలో పలు వైద్య సంఘాలు ఇందులో ఆర్గాన్ మాఫియా గురించి చూపించిన తీరుని నిరసిస్తూ కోర్టుకు కూడా వెళ్లాయి. ఆఫ్ కోర్స్ అవి నిలబడకపోయినా వివాదాలు మాత్రం చాలానే ముసురుకున్నాయి. మనం రోడ్డు మీద నిత్యం చూసే ప్రమాదాల వెనుక ఎంతటి ఘోరమైన ప్లాన్లు ఉంటాయో, తమ స్వార్థం కోసం కొన్ని శక్తులు ఎంతకు దిగజారుతాయో పద్మకుమార్ చక్కగా ఆవిష్కరించారు. అయితే ఓ గంటన్నర నిడివికి మాత్రమే సరిపోయే స్టోరీ మెటీరియల్ ని రెండున్నర గంటలకు సాగదీయడంతో మధ్యలో చాలా ల్యాగ్ అనిపిస్తుంది.

అవసరానికి మించి జోసెఫ్ పాత్రకు ఎమోషనల్ డ్రామాని పెట్టడం అక్కడి ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టు సెట్ అయ్యింది కానీ ఇక్కడ రీమేక్ చేయాల్సి వస్తే చాలా ట్రిమ్మింగ్ అవసరం పడుతుంది. సంఘంలో జరిగే ఎన్నో దారుణాల వెనుక విషాద కథలు సామాన్యులకు తెలిసే అవకాశం ఉండదు. ఏదో యాదృచ్చికంగా జరిగిందనుకుంటాం. కానీ లోతుగా తరిచి చూస్తే విస్తుపోయే వాస్తవాలు ఎన్ని బయటికి వస్తాయో ఇందులో పద్మకుమార్ బాగా చూపించారు. ఊహించని క్లైమాక్స్ జోసెఫ్ కు బలంగా నిలిచింది

రంజన్ రాజ్ పాటలు, అనిల్ జాన్సన్ నేపధ్య సంగీతం కథకు తగ్గట్టు సాగాయి. మరీ సౌండ్ పొల్యూషన్ లేకుండా నీట్ గా కంపోజ్ చేశారు. మూడ్ చెడిపోకుండా బిజిఎంని కూర్చిన తీరు బాగుంది. మనేష్ మాధవన్ ఛాయాగ్రహణం లో బడ్జెట్ ని హై క్వాలిటీలో ప్రెజెంట్ చేసింది. ఏదైనా కంప్లయింట్ ఉందంటే అది కిరణ్ దాస్ ఎడిటింగ్ గురించే. మొత్తంగా ఓ అరగంట ఈజీగా లేపేస్తే కంటెంట్ లో థ్రిల్ ఇంకా పెరిగేది. బడ్జెట్ పరంగా చాలా సేఫ్ గా తీసుకున్నారు. అందమైన లొకేషన్లతో పాటు హడావిడి లేని అవుట్ డోర్ ని ఎంచుకోవడంతో ఖర్చు పరంగా భారం లేకుండా సాగిపోయింది

కంక్లూజన్

తెలుగులో గణేష్ లాంటి సినిమాలు మెడికల్ మాఫియా మీద వచ్చినప్పటికీ అవి మాస్ ప్రేక్షకుల సూత్రాలకు లోబడి ఇష్యూని కమర్షియల్ గా ప్రెజెంట్ చేసినవి. అలా చేస్తేనే పెట్టుబడి పరంగా సేఫ్ కాగలం. కానీ మలయాళంలో అలాంటి చిక్కులు పరిమితులు లేవు కాబట్టి జోసెఫ్ లాంటి థ్రిల్లర్స్ రా ఫార్మాట్ లో వస్తున్నాయి. మల్లు వుడ్ నుంచి వచ్చే ఏ మూవీ అయినా ఖచ్చితంగా ఓపికను డిమాండ్ చేస్తుంది. అది ఉంటే జోసెఫ్ లాంటివి మనల్ని మెప్పిస్తాయి. పైకి చిన్నది అనిపించే ఓ సమస్య మూలాలను ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోయేలా తీర్చిదిద్దిన వైనం కోసం జోసఫ్ ని ఓసారి చూడొచ్చు. అది కూడా తక్కువ అంచనాలతోనే సుమా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి