iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 48 – బందీలతో చెలగాటం

లాక్ డౌన్ రివ్యూ 48 – బందీలతో చెలగాటం

సీక్వెల్స్ సినిమాలకు చూస్తుంటాం కానీ వాస్తవానికి ఇవి వెబ్ సిరీస్ లో చాలా కామన్. ముఖ్యంగా ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో సీజన్ల పేరుతో వరసగా ఎపిసోడ్ల తరబడి వస్తూనే ఉంటాయి. ఇప్పుడిప్పుడే ఇండియాలో వీటికి ఆదరణ పెరుగుతోంది. అందులోనూ లాక్ డౌన్ వచ్చాక వినోదానికి వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇష్టం ఉంటే టీవీ లేదా జై ఓటిటి అంటున్నారు ప్రేక్షకులు. అందుకే డిజిటల్ యాప్స్ కూడా వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. మూవీ లాగా ఇది రెండున్నర గంటల్లో పూర్తయ్యే వ్యవహారం కాదు. సీరియల్ మాదిరి కొనసాగుతూనే ఉంటాయి. కాకపోతే వాటిలాగా జీడిపాకం స్టైల్ లో కాకుండా కొంత వేగంగా ఎంగేజ్ చేసేలా ఉంటాయి. గత ఏడాది హాట్ స్టార్ లో విడుదలై హిట్టైన హోస్టేజెస్ కి కొనసాగింపుగా రెండో సిరీస్ విడుదలయ్యింది. మరి ఇది మెప్పించేలా ఉందా లేదా చప్పగా సాగిందా రివ్యూలో చూద్దాం

కథ

2019లో వచ్చిన సిరీస్ కి కంటిన్యుయేషన్ కాబట్టి ఇది పూర్తిగా అర్థమవ్వాలంటే ముందు సీజన్ చూసి ఉంటే బెటర్. అనారోగ్యంతో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి కుశ్వంత్ లాల్ హాండా(దిలీప్ తాహిల్)ను వైద్యం పేరుతో లీగల్ మర్డర్ చేయాల్సిందిగా డాక్టర్ మీరా ఆనంద్(టిస్కా చోప్రా)ను బెదిరిస్తాడు తీవ్రవాది పృద్వి సింగ్(రోనిత్ రాయ్). లేకపోతే ఇంట్లో వాళ్ళను చంపేస్తానని బందీలుగా మార్చేసి అక్కడి నుంచే కమాండ్స్ ఇస్తూ ఉంటాడు. ముందు ఇష్టం లేకపోయినా ఫ్యామిలీ కోసం ఒప్పుకుంటుంది మీరా. తర్వాత సిఎం ఏమయ్యాడు అనే దానితో ఫస్ట్ సీజన్ ముగుస్తుంది.

వారం తర్వాత సీజన్ 2 స్టోరీ మొదలవుతుంది. అందరూ భయపడినట్టుగానే హాండా చనిపోయినట్టు వైద్యులు ప్రకటిస్తారు. ప్రభుత్వం అంతక్రియలకు ఏర్పాట్లు చేస్తుంది. కానీ హాండా చనిపోయి ఉండడు. పృథ్వి అతన్ని రహస్యంగా అపహరించి ఆ స్థానంలో వేరే శవాన్ని ఉంచి ఓ వెహికల్ లో కిడ్నాప్ చేసి తీసుకుపోతాడు. అయితే మధ్యలో అనుకోకుండా జరిగిన సంఘటనల వల్ల హాండాతో పాటు తీసుకొచ్చిన ఇతరులను ఓ పాడు బడిన బంగ్లాలో బంధించి తన డిమాండ్లు పంపిస్తాడు. తర్వాత ఏమైంది, హాండా మీద పూర్వం పోలీస్ ఆఫీసర్ గా ఉన్న పృథ్వి ఎందుకు అంత కక్ష కట్టాడు, చివరికి సిఎం క్షేమంగా బయటికి వచ్చాడా లేదా అనేదే క్లైమాక్స్

నటీనటులు

ఇందులో మెయిన్ పెర్ఫార్మర్ రోనిత్ రాయ్. సీజన్ 1లో అద్భుతంగా చేసిన ఇతను ఇందులో కూడా అదే తరహాలో నటించాడు కానీ ఎందుకో ఫైర్ తగ్గినట్టు అనిపిస్తుంది. కసి, కోపం, క్రూరత్వం, నిజాయితీ అన్నీ కలగలిసిన డిఫరెంట్ షేడ్స్ ని చక్కగా చూపించాడు. సిఎంగా నటించిన హాండా తన సీనియారిటీతో నిలబెట్టేశాడు. తెలుగులో కొత్త బంగారు లోకంతో గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్ జర్నలిస్ట్ గా ఆకట్టుకుంది. అంతో ఇంతో నిజంగా యాక్ట్ చేసింది కూడా రోనిత్ రాయ్ తర్వాత తనే. ఫస్ట్ పార్ట్ లో ఉన్న డాక్టర్ మీరాకు బదులు ఇందులో నెగోషియేటింగ్ ఆఫీసర్ గా తీసుకొచ్చిన దివ్య దత్త ఎందుకో కృత్రిమంగా కనిపించారు. ఇందులో సుమారు 40 దాకా తారాగణం ఉన్నారు కాబట్టి అందరి గురించి ప్రస్తావించడం ప్రయాస

డైరెక్టర్ అండ్ టీమ్

ఒక కథకు కొనసాగింపు చేయాలి అనుకున్నప్పుడు అదే దర్శకుడు టేకప్ చేస్తేనే ఫలితం బాగుంటుంది. హోస్టేజెస్ లో జరిగిన పొరపాటు ఇదే. ఫస్ట్ పార్ట్ ని చక్కగా డీల్ చేసిన సుధీర్ మిశ్రా సెట్ చేసిన స్టాండర్డ్ ను మ్యాచ్ కాలేక రెండో సీజన్ కు దర్శకత్వం వహించిన సచిన్ కృష్ణ్ తన మీద నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. దానికి తోడు పృథ్వి అందరినీ పాడు బడిన బంగ్లాలో బంధించాక నెట్ ఫ్లిక్స్ బ్లాక్ బస్టర్ సిరీస్ మనీ హీస్ట్ ఫార్మాట్ ని మక్కీకి మక్కీ కాపీ కొట్టడం పూర్తిగా బోల్తా కొట్టించింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న తరహాలో దాన్ని యథాతథంగా దించాలన్న ప్రయత్నం బెడిసింది.

స్క్రీన్ ప్లే కూడా తీసికట్టుగా ఉండటంతో సగానికి పైగా ఎపిసోడ్లు చాలా బోరింగ్ గా సాగుతాయి. ఏ దశలోనూ ఆసక్తి రేపవు. దానికి తోడు మధ్యలో బిల్డప్ కోసం పెట్టినట్టుగా ఇరికించిన కొన్ని ట్రాక్స్ అసలు కథకు లింక్ అయ్యేలోపే విసుగొచ్చి టీవీ ఆపేస్తాం. అంత చప్పగా సాగింది. ఓ ముఖ్యమంత్రి చనిపోయినట్టుగా ప్రచారం చేసి బ్రతికే ఉన్న అతన్ని ఊరంతా తిప్పి బయటికి తీసుకెళ్లడం లాజిక్ కి దూరంగా ఉన్నా కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. అందులోనూ బందీల మధ్య ఏదో ఎమోషన్స్ ని చూపించాలని ట్రై చేసిన సచిన్ వాటిని కనీస స్థాయిలో రాబట్టుకోలేకపోయాడు.

కరెల్ యాంటోనిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోనే. అక్కడక్కడా మెరుపులు తప్ప ఏమంత ప్రభావం చూపించలేకపోయాడు. దీనికి డైరెక్టరే కెమెరా మెన్. ఓకే అనిపించే అవుట్ ఫుట్ అంతే. అర్చిత్ డి రస్తోగి ఎడిటింగ్ కూడా అంతంత మాత్రమే. బడ్జెట్ డిమాండ్ చేసే ప్రాజెక్ట్ కాదు కాబట్టి ఖర్చు తక్కువగానే ఉంది. ఏదైనా బడ్జెట్ పెట్టారంటే అది క్యాస్టింగ్ కోసమే.

కంక్లూజన్

గంటల తరబడి సమయాన్ని వెచ్చించి చూడాల్సిన హోస్టెజస్ లాంటి సిరీస్ లకు స్క్రీన్ ప్లే ప్రధానం. అది ఏ మాత్రం చప్పగా సాగినా వెంటనే ప్రేక్షకుడు వేరే దానికి షిఫ్ట్ అయిపోతాడు. దురదృష్టవశాత్తు ఈ సీజన్ 2 తన మీద ఉన్న అంచనాలను పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేక నిరాశపరిచింది. ఆరున్నర గంటల నిడివికి దర్శకుడు న్యాయం చేకూర్చలేకపోయాడు. డైరెక్టర్ ఎందుకు మారాల్సి వచ్చిందనేది వాళ్ళ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ ఆ మార్పు నేరుగా ఫలితం మీద పడింది. మరీ ఖాళీ సమయం ఎక్కువగా ఉండి ఒంట్లో సత్తువ కన్నా ఓపిక ఎక్కువగా ఉంటే దీన్ని ట్రై చేయొచ్చు. లేదా ఫస్ట్ సీజన్ చూసేసి రిలాక్స్ అయిపోవడం ఉత్తమం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి