iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 37 – నరకపు అంచుల్లో

లాక్ డౌన్ రివ్యూ 37 – నరకపు అంచుల్లో

ఫీల్ గుడ్ మూవీ అనే పదానికి సరైన నిర్వచనం ఇచ్చేలా ఇటీవలి కాలంలో మలయాళం సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే వస్తున్నాయి. నేటివిటీ పరంగా ఉన్న వ్యత్యాసాల కారణంగా అక్కడ విజయవంతమైన ప్రతి మూవీనీ ఇక్కడ రీమేక్ చేసి వర్కవుట్ చేసుకోలేం కానీ సబ్ టైటిల్స్ పుణ్యమాని ఉన్నచోటే చూసుకునే సౌలభ్యం డిజిటల్ యాప్స్ రూపంలో దక్కుతోంది. అందుకే ఆన్ లైన్లో ఏదైనా మల్లువుడ్ చిత్రం గురించి తెలిస్తే చాలు మన ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఆ మధ్య క్రిటిక్స్ మెప్పు పొందిన సినిమా హెలెన్. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో దీన్ని హిందిలో రీమేక్ చేయాలనే ప్లాన్ లో బోనీ కపూర్ ఉన్నట్టు తెలియడంతో దీనికి మిక్కిలి ప్రచారం దక్కుతోంది. అందుకే రివ్యూలో ఓ లుక్ వేద్దాం

కథ

హెలెన్(అన్నా బెన్)విదేశాలకు వెళ్ళే లక్ష్యంతో ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరోవైపు తన ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పెంచుకునే పనిలో ఉంటుంది. తను పని చేసే చికెన్ హబ్ రెస్టారెంట్ లో ఈవెనింగ్ షిఫ్ట్ లో చలాకిగా అందరితో కలివిడిగా ఉంటుంది. తల్లి లేని హెలెన్ ను నాన్న పాల్(లాల్)ఏ లోటు లేకుండా పెంచుతాడు. హెలెన్ అజర్(నోబెల్ బాబు థామస్)ను ప్రేమిస్తుంది. అతనూ జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఓ రాత్రి పనుల వల్ల ఆలస్యం కావడంతో హెలెన్ మాంసం తదితర సామాగ్రి భద్రపరిచిన ఎయిర్ కండీషన్డ్ రూమ్ లో చిక్కుబడిపోతుంది. ఎవరూ గమనించపోవడంతో మేనేజర్ తాళాలు వేసుకుని వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి అవుతున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు పాల్. అయినా సరైన సహకారం లభించదు. అనుమానం అజర్ మీదకు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే హెలెన్ స్టొరీ

నటీనటులు

ఇది పూర్తిగా అన్నా బెన్ షో. చురుకైన చూపులతో సహజమైన యాక్టింగ్ తో ఆద్యంతం ఆకట్టుకుంది. అచ్చం పక్కింటి అమ్మాయిలా ఇలాంటి కూతురు నాకూ ఉంటె బాగుంటుంది అనేలా దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. ముఖ్యంగా స్టోర్ లో చిక్కుబడిపోయాక టెంపరేచర్ అంతకంతా తగ్గుతూ చావును దగ్గర చేస్తున్న తరుణంలో అన్నా బెన్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అద్భుతం. ఇది సింగల్ సీన్ లో వచ్చే ట్రాక్ అయితే ఈజీగా ఉండేది కాని సినిమాలో సగభాగం ఒకే గదిలో జరుగుతుంది. అందుకే అన్నా బెన్ దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని మాటలకందని రీతిలో పెర్ఫార్మ్ చేసింది. చిట్టి ఎలుకతో స్నేహం చేయాల్సి వచ్చిన పరిస్థితిలో ఇద్దరిది జీవన్మరణ సమస్యే అని గుర్తించి చూపించే భావోద్వేగాలను మెథడ్ యాక్టింగ్ కు ఉదాహరణగా చూపొచ్చు.

అన్నా బెన్ తర్వాత అంతగా ఆకట్టుకునే నాన్న పాత్రలో చేసిన లాల్ మనకూ సుపరిచితుడే. పందెం కోడి, మన్యం పులి లాంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలతో ఇక్కడా గుర్తింపు తెచ్చుకున్నాడు. కంటిపాపలా పెంచుకున్న బిడ్డ రాత్రిపూట కనపడక మానసిక క్షోభతో అల్లాడిపోయే రోల్ లో జీవించేశాడు. తన అనుభవం బాగా ఉపయోగపడింది. ప్రేమికుడిగా చేసిన థామస్ ది కొంత భాగానికే పరిమితమయ్యింది. పోలీసులుగా నటించిన అజూ వర్గీస్, బిను పప్పు తదితరులు బాగా హెల్ప్ అయ్యారు. కొద్దీ నిమిషాలే అయినా సెక్యూరిటీ గార్డ్ గా నటించిన జయరాజ్ కీలక మలుపుకు కారణమయ్యాడు. క్యాస్టింగ్ లో ఇంకా చాలానే ఉన్నారు కానీ అందరూ పరిచయం లేని ముఖాలే కావడంతో గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది

డైరెక్టర్ అండ్ టీమ్

ఇదొక క్రైమ్ లేని సైకలాజికల్ థ్రిల్లర్. మాతుకుట్టి క్సేవియర్ తీసుకున్న వైవిద్యమైన కథలో చాలా రిస్క్ ఉంది. అయినప్పటికీ ఇంత మంచి అవుట్ ఫుట్ వచ్చిందంటే దానికి స్క్రీన్ ప్లేనే ప్రధాన కారణం. ఎక్కువ విసుగు రాకుండా మూవీ నడిచేది రెండు మూడు లొకేషన్లలో అయినా చాలా జాగ్రత్తగా రాసుకున్న కథనం ఫైనల్ గా మెచ్చుకునేలా చేసింది. హెలెన్ ఒంటరిగా స్టోర్ లో చిక్కుబడినప్పుడు తన మానసిక శారీరక సంఘర్షణను ఎమోషనల్ గా చూపించే క్రమంలో ఆయన చేసిన హోం వర్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో ఆషామాషీగా రూమ్ లో ఇరుక్కుని కష్టాలు పడుతున్నట్టు కాకుండా ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ వెతికి మరీ సన్నివేశాలు అల్లుకోవడం క్సేవియర్ ప్రతిభకు నిదర్శనం. అందులోనూ ఎక్కడ సెట్లు లేకుండా సహజమైన రియల్ లొకేషన్స్ లో తీయడంతో హెలెన్ తో పాటు ప్రేక్షకులు ప్రయాణం చేయగలిగారు.

షాన్ రెహమాన్ సంగీతం హృద్యంగా ఉంది. కథలోని మూడ్ కి తగ్గట్టు చక్కని అవుట్ ఫుట్ ఇచ్చాడు. ఇలాంటి వాటిలో మ్యూజికల్ గా ఎక్కువ స్కోప్ ఉండదు కాబట్టి ఏది ఆశించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నుంచే ఎక్స్ పెక్ట్ చేయాలి. ఆ విషయంలో షాన్ నిరాశ పరచలేదు. ఆనంద్ సి చంద్రన్ ఛాయాగ్రహణం కొచి నగర సహజత్వంతో పాటు చికెన్ హబ్ అంతర్గత భాగాన్ని బాగా క్యాప్చర్ చేసింది. షామీర్ ముహమ్మద్ ఎడిటింగ్ అక్కడక్కడా ల్యాగ్ అయ్యింది. ఓ పది నిముషాలు తగ్గిస్తే వేగం పెరిగేది. బడ్జెట్ లో మంచి సినిమాలు తీయాలనుకునే వాళ్ళకు హెలెన్ ని మంచి ఉదాహరణగా చూపొచ్చు. పెద్ద ఖర్చేమి లేదు మరి.

కంక్లూజన్

హెలెన్ లాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ చాలా అరుదుగా వస్తాయి. వీటిలో కమర్షియల్ అంశాలు, డ్యూయెట్లు, ఫైట్లు లాంటివి ఏవీ ఉండవు. ఇంకా చెప్పాలంటే సగటు మాస్ ప్రేక్షకుడికి అంతగా కొరుకుడుపడని కథాంశాలు ఇవి. ఈ కోణంలో చూడకుండా హెలెన్ ని ట్రై చేస్తే మాత్రం నిరాశపరచదు. కాకపోతే టిపికల్ కేరళ మేకింగ్ స్టైల్ కి అలవాటు పడిన వాళ్ళు హెలెన్ తో ఈజీగా కనెక్ట్ అవుతారు కానీ లేదంటే కొంత బోర్ గా అనిపించే ప్రమాదం ఇందులోనూ లేకపోలేదు. ఒక్క ఇంచు స్కిన్ షో లేకుండా కేవలం టాలెంట్ తోనే నెట్టుకురావాల్సిన పాత్రను చాలా ఈజ్ గా పోషించిన అన్నా బెన్ కోసమైనా ఈ సినిమాను చూడవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి