iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 18 – ఫోరెన్సిక్

లాక్ డౌన్ రివ్యూ 18 – ఫోరెన్సిక్

క్రైమ్ కథలు అందులోనూ సైకో కిల్లర్ స్టోరీస్ కి ఈ మధ్య బాగా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా రాక్షసుడు తెలుగు, తమిళ్ లో ఘన విజయం సాధించాక ఇవి ఊపందుకున్నాయి. మలయాళంలోనూ వీటి తాకిడి జోరుగానే ఉంది. అంజామ్ పతిరా తర్వాత ఇటీవలి కాలంలో మూవీస్ లవర్స్ దృష్టిలో పడ్డ సినిమా ఫోరెన్సిక్. పోస్టర్, ట్రైలర్ ని బట్టి ఇది కూడా అదే కోవలోకి చెందినట్టు అనిపిస్తుంది కానీ ట్రీట్మెంట్ విషయంలో ఉన్న తేడా మూవీ చూస్తే కానీ అర్థం కాదు. లాక్ డౌన్ టైంలో ఇలాంటి థ్రిల్లర్స్ కి డిమాండ్ ఉంటున్న వేళ ఈ ఫోరెన్సిక్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

కేరళ రాష్ట్రం త్రివేండ్రం నగరంలో ఐదేళ్ల ఆడపిల్లలు అంతుచిక్కని రీతిలో కిడ్నాప్ అవుతూ హత్యకు చేయబడతారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రభుత్వం పోలీస్ ఆఫీసర్ రితిక(మమతా మోహన్ దాస్)ని నియమిస్తుంది. సహాయంగా ఫోరెన్సిక్ నిపుణుడైన శామ్యూల్ జాన్(టోవినో థామస్)కూడా తన టీంలో జాయిన్ అవుతాడు. ఈ ఇద్దరికీ గతంలో వదినా మరిది బంధం ఉంటుంది. మరోవైపు సిటీలో ఇదే తరహాలో మర్డర్లు కొనసాగుతూ పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారుతుంది. సైకో కిల్లర్ ఎవరో, ఎక్కడుంటాడో అర్థం కాక రితిక బృందం చేసే ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. అయితే శ్యాముల్ తన మేధస్సును ఉపయోంచి ఒక్కో క్లూని చేధించుకుంటూ వెళ్లి అసలు హంతకుడిని పట్టేస్తాడు అసలేమాత్రం ఊహకందని మలుపులతో ఈ దారుణాలకు దారి తీసిన కారణాలు బయటపడతాయి. అది ఎవరు, శ్యాముల్ ఎలా ఈ కేసును చేధించాడు అనేదే ఫోరెన్సిక్ స్టొరీ

నటీనటులు

ఈ సినిమా బలం క్యాస్టింగ్. ప్రతి పాత్రకు సహజత్వం తీసుకొచ్చే నటీనటులను ఎంచుకోవడమే కాక వాళ్ళ నుంచి కావాల్సిన అవుట్ పుట్ రాబట్టుకోవడంలో దర్శకులు చూపిన పనితనం చాలా బాగుంది. టివినో థామస్ హీరోగానే అనిపిస్తాడు కాని ఇతనికి జోడిగా హీరొయిన్ కాని పాటలు కాని ఏమీ ఉండవు. కొలీగ్ గా ఓ అందమైన అమ్మాయిని సెట్ చేశారు. అయితే వాళ్ళ మధ్య మినిమమ్ రొమాన్స్ కూడా లేదు. టివినో చాలా సహజంగా ఫోరెన్సిక్ నిపుణుడిగా ఒదిగిపోయాడు. లుక్స్ పరంగానూ ఆకట్టుకునే రూపం కావడంతో ప్లస్ అయ్యాడు.

యమదొంగ, చింతకాయల రవి, కేడి సినిమాలతో మనకూ పరిచయమున్న మమతా మోహన్ దాస్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా షాక్ ఇచ్చింది. చాలా గ్యాప్ తర్వాత చూసినా యాక్టింగ్ టాలెంట్ తో రితిక పాత్రను నిలబెట్టింది. ఇక సెమీ కిల్లర్ గా నటించిన ఆరుమాన్షు దేవ్ అదరగొట్టాడు. వీళ్ళే కాక రితిక కూతురిగా కనిపించిన తమన్నా ప్రమోద్, డాక్టర్ గా చేసిన ప్రతాప్ పోతన్, సైకియాట్రిస్ట్ గా నటించిన గిజు జాన్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నారు కానీ అందరూ వారి వారి పరిధిలో చాలా సహజంగా నటించారు. కొందరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉన్నా కథలో ఉన్న ట్విస్టు రివీల్ అవుతుంది కాబట్టి చెప్పడం లేదు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకులు అఖిల్ పాల్ & అనస్ ఖాన్ హోమ్ వర్క్ ని మెచ్చుకోవాలి. ఒక రెగ్యులర్ సైకో థ్రిల్లర్ అనిపించే ఫీలింగ్ తో మొదలుపెట్టి క్రమంగా ఆసక్తి పెరిగేలా స్క్రీన్ ప్లే రాసుకున్న తీరు ఫోరెన్సిక్ కున్న ప్రధాన బలం. టేకాఫ్ కొంత స్లోగా అనిపించినా క్రమంగా వేగం పెంచుతూ ఎవరు హంతకులో అంతుచిక్కని రీతిలో ప్రెజెంట్ చేసిన తీరు మెప్పిస్తుంది. నిజానికి ఇలాంటి కథలు ఇప్పటికే చాలా వచ్చేశాయి. ఒకరకంగా చెప్పాలంటే కొంత బోర్ కూడా కొడుతున్నాయి. రాక్షసుడు తరహాలో ట్రీట్ మెంట్ డిఫరెంట్ గా ఉంటే తప్ప ప్రేక్షకులు అంత ఈజీగా కన్విన్స్ కావడం లేదు. అందుకే అఖిల్ ఆనస్ లు చాలా విభిన్నంగా ఆలోచించి కేసును ఫోరెన్సిక్ కోణంలో చూపించి మంచి మార్కులు కొట్టేశారు.

నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో పాటు ప్రతి చిన్న క్లూని డిటైల్డ్ గా చూపించడంతో సామాన్య ప్రేక్షకులకు అదంతా కొంచెం బోర్ కొట్టించే ఛాన్స్ ఉంది. కొన్ని సీన్లలో హింసను సహజత్వం కోసం జుగుప్సాకరంగా చూపడం సరికాదు. కొంత మోతాదుని మించింది కూడా. మొదటి ముప్పాతిక గంట ఓ మోస్తరుగా సాగినా ఆ తర్వాత అఖిల్ ఆనస్ కు కథనాన్ని పరుగులు పెట్టించారు. సెకండ్ హాఫ్ లో ఊహించని మలుపులతో పూర్తిగా ఎంగేజ్ చేస్తారు. సైకో ఫ్లాష్ బ్యాక్ ని కొంత తగ్గించి ఉంటే బాగుండేది. మొత్తానికి తమ టెక్నికల్ టాలెంట్ తో ఫోరెన్సిక్ ని గుడ్ వాచ్ క్యాటగిరీలో నిలిపారు.

సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ తన బీజీఎమ్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. కొన్ని చోట్ల మాత్రం గతంలో విన్న సౌండ్ లాగా అనిపించడం కొంత మైనస్. ఫైనల్ గా ఇలాంటి సినిమాకు కావాల్సిన స్కోర్ ని ఇచ్చాడు. అఖిల్ జార్జ్ ఛాయాగ్రహణం కూడా అదే స్థాయిలో ఉంది. ఫ్రేమ్స్ ని సెట్ చేసుకున్న తీరు మూవీ స్టాండర్డ్ ని పెంచింది. షమీర్ మొహమ్మద్ ఎడిటింగ్ మాత్రం ఇంకొంత క్రిస్పీగా ఉండాల్సింది. అవసరం లేని సన్నివేశాలు లెన్త్ ని పెంచాయి. జువిస్ సంస్థ నిర్మాణం బాగుంది.

చివరిగా చెప్పాలంటే

క్రైమ్ బేస్డ్ సైకో కథలు అన్ని వర్గాలకు ఉద్దేశించినవి కావు. వాటిని ఇష్టపడే బ్యాచ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ కోణంలో చూస్తే ఫోరెన్సిక్ నిరాశపరిచే అవకాశాలు తక్కువ. కొంతసేపు ఓపిగ్గా భరించగలిగితే ఆ తర్వాత వేగంతో దర్శక ద్వయం మిమ్మల్ని మెప్పిస్తారు. అయితే గ్రాఫ్ లో అప్ అండ్ డౌన్లు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అవి కూడా మేనేజ్ చేయగలిగితే ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ గా ఫోరెన్సిక్ నిలిచేది. ఆ ఛాన్స్ మిస్ అయినా టాప్ లిస్ట్ లో అయితే చోటు దక్కించుకుంది. పిల్లలు లేకుండా కేవలం పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఫోరెన్సిక్ ని హ్యాపీగా ట్రై చేయొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి