iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 24 – భానుమతి & రామకృష్ణ

లాక్ డౌన్ రివ్యూ 24 – భానుమతి & రామకృష్ణ

థియేటర్లు మూతబడి వంద రోజులు దాటేసిన నేపధ్యంలో వినోదానికి ప్రేక్షకులకు ఓటిటి తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే నిర్మాతలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కే ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఇండిపెండెంట్ మూవీ భానుమతి & రామకృష్ణ. ఓల్డ్ ఫ్యాషన్డ్ టైటిల్ లా అనిపించినా టీజర్ తో పాటు యూనిట్ చేసిన ప్రమోషన్ అంతోఇంతో ఆసక్తిని రేపింది. అందుకే ఓ లుక్ వేద్దామనుకున్న వాళ్ళు చాలానే ఉన్నారు. మరి ఆ కాసిన్ని అంచనాలతో వచ్చిన ఈ భాను రాముల ప్రేమకథ ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం

కథ

భానుమతి(సలోని లుద్రా)మూడు పదుల వయసొచ్చినా ఇంకా పెళ్లి కాని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. ఆత్మవిశ్వాసాన్ని పొగరుగా మలుచుకుని ఒకరకమైన యాంత్రికమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఓ అబ్బాయితో బ్రేకప్ అయ్యాక కూడా తనలో మార్పు రాదు. ఆ టైంలో తన జూనియర్ గా చేరతాడు తెనాలి నుంచి వచ్చిన 33 ఏళ్ళ రామకృష్ణ(నవీన్ చంద్ర). పల్లెటూరి అమాయకత్వం కలబోసిన అతన్ని భానుమతి మొదట చిరాగ్గా చూసినా మెల్లగా ఆకర్షణకు లోనవుతుంది. అదే ప్రేమగా మారి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టనిస్తుంది. మరి ఇది పెళ్లి దాకా వెళ్ళిందా లేక ఏవైనా మలుపులు జరిగాయా లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే చూడాలి

నటీనటులు

లీడ్ పెయిర్ లో ఇద్దరున్నారన్న మాటేగాని నటనపరంగా ఎక్కువ స్కోప్ దక్కింది మాత్రం భానుమతిగా నటించిన సలోని లుధ్రాకే. దానికి తగ్గట్టే చక్కగా అందులో ఒదిగిపోయి పాత్ర స్వభావానికి తగ్గట్టు మంచి ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. అయితే లేట్ ఏజ్ లేడీ బ్యాచిలర్ కావాలనే ఉద్దేశంతో కోరిమరీ తనను తీసుకున్నారు కానీ లుక్స్ పరంగా ఇంకా ఎక్కువ వయసు ఉన్నట్టు కనిపించడం కొంత మైనస్ గా నిలిచింది. దాన్ని యాక్టింగ్, డబ్బింగ్ తో చాలా మటుకు కవర్ చేయడం భానుమతిని నిలబెట్టింది.

ఇక నవీన్ చంద్ర విషయానికి వస్తే సరైన పాత్ర ఇవ్వాలే కానీ తను ఎంత మంచి ఆర్టిస్టో ఇందులో మరోసారి ఋజువయ్యింది. అమాయకత్వం నిండిన పాత్రలో అలా ఒదిగిపోయాడు. కాకపోతే ఉన్న గంటన్నరలో స్క్రీన్ స్పేస్ తక్కువనిపించింది. ఒకవేళ ఇది పూర్తి నిడివి సినిమా అయ్యుంటే ఇంకా మంచి అవుట్ ఫుట్ ఇచ్చేవాడు. హీరోగా నిలదొక్కుకోలేక చిన్న క్యారెక్టర్స్ తో గట్టి పాత్రలు దక్కించుకోలేక నలుగుతున్న నవీన్ చంద్ర ఓటిటి మేకర్స్ కు వన్ అఫ్ ది బెస్ట్ ఆప్షన్ గా నిలవడం మాత్రం ఖాయం.

కామెడీ పరంగా రిలీఫ్ ఇచ్చింది మాత్రం వైవా హర్షానే. డైలాగ్స్ బాగా పేలాయి. కొన్ని నవ్వులు పంచాడు. హీరోయిన్ తో గొడవ పడే సీన్లో, రామకృష్ణ మొదటిసారి రూమ్ కు వచ్చినప్పుడు జరిగే సన్నివేశంలో తన టైమింగ్ బాగా ఉపయోగపడింది. సిరివెన్నెల గారి అబ్బాయి రాజ్ కనిపించేది కొన్ని నిమిషాల పాటే అయినా సింపుల్ గా కానిచ్చేశాడు. ఇక భానుమతి రూమ్ మేట్స్ గా నటించిన ఇద్దరు, ఆఫీస్ కొలీగ్స్, హీరో తల్లి ప్రత్యేకంగా వీళ్ళ గురించి చెప్పుకోవాల్సింది ఏమి లేదు

డైరెక్టర్ అండ్ టీం

ఇలాంటి ప్రేమ కథల్లో ఎక్కువ మలుపులు ఆశించలేం . ఎమోషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ నడిపించాలి. చూస్తున్నంత సేపు విసుగు రాకుండా జాగ్రత్త పడాలి. దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ విషయం గురించి బాగా అవగాహన ఉన్నవాడు కావడంతో రైటింగ్ లో ఉన్న పట్టుని సంభాషణల రూపంలో వాడుకుని సాధ్యమైనంత మేరకు ఎక్కడా విసుగు రాకుండా మంచి ప్రయత్నం చేశాడు. అయితే రెండూ బాలన్స్ చేయాలన్న ఇతని ఉద్దేశం తక్కువ నిడివి వల్ల చాలా పరిమితులకు కట్టుబడాల్సి వచ్చింది. కేవలం 90 నిమిషాల్లోనే తాను ప్రెజెంట్ చేయాలన్న టార్గెట్ తో టేకాఫ్ చక్కగా మొదలుపెట్టినా రెండో సగంలో మాత్రం హడావిడిగా పరుగులు పెట్టేశాడు. ఫలితంగా అద్భుతంగా పండాల్సిన భావోద్వేగాలు ఆ స్థాయిలో లేక ప్రేక్షకులకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అలా అని నిరాశపరిచిందని కాదు కొంత వెలితి మాత్రం సినిమా అయ్యాక వెంటాడుతూనే ఉంటుంది.

పెళ్లి ఆలస్యమైన ఓ యువతీ యువకుడు మధ్య ఓ క్యుట్ లవ్ స్టొరీని ప్రెజెంట్ చేయాలన్న శ్రీకాంత్ ఉద్దేశం టార్గెట్ ఆడియన్స్ వరకు బాగానే రీచ్ అయ్యింది. ఇంకొంచెం లెంత్ పెంచి భానుమతి రామకృష్ణల మధ్య లవ్ బాండింగ్ బలంగా రాసుకుని ఉంటే ఇది ఖచ్చితంగా ఇంకా మెరుగ్గా ఉండేది. సలోని పాత్రను తీర్చిదిద్ది దాన్ని రిజిస్టర్ చేసినంత బలంగా రామకృష్ణను చూపించలేకపోయాడు శ్రీకాంత్. అందుకే చివరి అరగంటలో ఆ ఇద్దరి మధ్య ఫీలింగ్స్ ని ఆడియన్స్ పర్సనల్ గా ఫీలయ్యే అవకాశం తగ్గింది. అరె ఇంకా బెటర్ గా ఉండొచ్చు కదా అనే భావన కలుగుతుంది. అందులోనూ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలోనూ నవీన్ చంద్ర కంటే సలోని కొంచెం పెద్ద వయసు దానిలా కనిపించడం కూడా ఒక కారణం కావొచ్చు. ఇవన్ని పక్కబెడితే తన మీద పెట్టుకున్న తక్కువ అంచనాలను శ్రీకాంత్ నాగోతి చాలా సులభంగా అందుకున్న మాట వాస్తవం. ఒకరకంగా చెప్పాలంటే దాటేశాడు. బడ్జెట్, టైం తదితర వనరులను పూర్తిగా ఇస్తే ఇతన్నుంచి మంచి సినిమాలు ఆశించవచ్చు

సంగీత దర్శకుడు అచ్చు రాజమణి నేపధ్య సంగీతం ఆశ్చర్యపరుస్తుంది. మాములుగా ఇలాంటి వెబ్ మూవీస్ లో బిజిఎం ఏమంత గొప్పగా ఉండదు. కాని దర్శకుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న రాజమణి ఎక్కడికక్కడ డిఫరెంట్ టోన్స్ తో మంచి మూడ్ క్యారీ అయ్యేలా కంపోజింగ్ చేయడం భానుమతి రామకృష్ణకు బాగా హెల్ప్ అయ్యింది. శ్రవణ్ భరద్వాజ్ పాటలు పర్వాలేదు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా అయితే లేవు. సాయి ప్రకాష్ ఛాయాగ్రహణం డీసెంట్ గా నడిచింది. లోకేషన్స్ తక్కువ కావడంతో తన ప్రతిభనంతా లైటింగ్, ఫ్రేమింగ్ మీద చక్కగా చూపించాడు. రవికాంత్ పేరేపు ఎడిటింగ్ గురించి కంప్లయింట్ ఏమి లేదు. పెద్దగా ల్యాగ్ అనిపించదు. డీసెంట్ బడ్జెట్ లో మంచి క్వాలిటీతో తీసిన నిర్మాతలను అభినందించాలి

ప్లస్ గా నిలిచినవి

నవీన్ చంద్ర, సలోని పాత్రలు
నేపధ్య సంగీతం
సంభాషణలు
లైట్ కామెడీ

మైనస్ గా అనిపించేవి

ఎమోషన్ తగ్గడం
సెకండ్ హాఫ్ కొంత
క్లైమాక్స్

కంక్లూజన్

ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా ఎక్కువ శ్రమ లేకుండా తాపీగా వినోదాన్ని కోరుకుంటున్న వాళ్ళకు భానుమతి రామకృష్ణ డీసెంట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఎక్కడో చిన్న అసంతృప్తి అనిపించినా ఓవరాల్ గా మరీ బోర్ కొట్టించకుండా తనలో రచయితతో శ్రీకాంత్ నాగోతి చేసిన ఈ సింపుల్ లవ్ స్టొరీ మరీ బెస్ట్ అనిపించకపోయినా ఇటీవల వచ్చిన కొన్ని డిజిటల్ రిలీజులలాగా వరస్ట్ ముద్ర పడకుండా బయట పడింది. ఇలాంటి ప్రేమ కథల నుంచి ఏది ఆశిస్తామో అది తగినంత మోతాదులోనే ఇచ్చిన భానుమతి రామకృష్ణలపై ఓసారి లుక్ వేయొచ్చు

ఒక్క మాటలో

భానుమతి & రామకృష్ణ – జస్ట్ పాస్ జంట

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి