iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 49 – అమరం అఖిలం ప్రేమ

లాక్ డౌన్ రివ్యూ 49 – అమరం అఖిలం ప్రేమ

ఈ మధ్య తమిళ మలయాళం డబ్బింగ్ సినిమాలతో పాటు తెలుగు స్ట్రెయిట్ రిలీజుల మీద గట్టి ఫోకస్ పెట్టిన ఆహా నుంచి వచ్చిన మరో కొత్త మూవీ అమరం అఖిలం ప్రేమ. లాక్ డౌన్ కు ముందే థియేట్రికల్ వాయిదా పడుతూ వచ్చిన చిత్రం ఎట్టకేలకు ఓటిటి ద్వారా ప్రేక్షకులను నేరుగా పలకరించేసింది. ట్రైలర్ తో పాటు ప్రమోషన్లో భాగంగా వదిలిన పోస్టర్లు వీడియోలు ఇదేదో ఎమోషనల్ ఫ్యామిలీ లవ్ స్టొరీ అనే ఫీలింగ్ ని ముందే కలిగించాయి. క్యాస్టింగ్ పెద్దగా పరిచయం లేనివారే ఉన్నప్పటికీ డిజిటల్ విడుదల కాబట్టి ఎక్కువ శాతం చూసే అవకాశం దక్కింది. మరి ఎలా ఉందో రివ్యూలో ఓ లుక్ వేసేద్దాం

కథ

ఒక్కగానొక్క గారాల కూతురు అఖిల(శివశక్తి సచ్ దేవ్)అంటే అరుణ్ ప్రసాద్(కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్)కు పంచ ప్రాణాలు. నిద్ర పాడవుతుందని స్కూల్ టైంని మార్చమని ప్రిన్సిపాల్ ని అడిగేంత పిచ్చి ప్రేమ. వయసొచ్చాక తను ప్రేమలో పడి ఓ సందర్భంలో ప్రియుడితో వెళ్ళడంతో దెబ్బతిని తిరిగి వచ్చాక తనతో మాట్లాడటం మానేస్తాడు. దీంతో తండ్రి లక్ష్యమైన ఐఎఎస్ ఆఫీసర్ అవ్వడం కోసం ఇల్లు వదిలి బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు పరిచయమవుతాడు బుక్ షాప్ నడిపే ఓనర్ కొడుకు అమర్(విజయ్ రామ్). ప్రేమిస్తున్నా అంటూ వెంటపడతాడు. అఖిలకు ఇష్టం ఉండదు. ఆ తర్వాత ఏమై ఉంటుందన్నది ఈజీగా మీరు గెస్ చేసే క్లైమాక్స్ కు దారి తీస్తుంది

నటీనటులు

విజయ్ రామ్ అచ్చం పక్కింటి కుర్రాడిలాగే ఉన్నాడు. కానీ నటన విషయంలో అంత సహజంగా కనిపించలేదు. ఈజీగా అనిపించే సన్నివేశాల్లో పాసైనప్పటికీ ఎమోషనల్ సీన్స్ లో చాలా మటుకు తేలిపోయాడు. మెరుగు పడాల్సింది ఎంతో ఉంది. ఇలాంటి ఎక్స్ ప్రెషన్లు షార్ట్ ఫిలింస్ వరకు పనికొస్తాయి కానీ వెండితెర మీద పండాలంటే మాత్రం చాలా హోమ్ వర్క్ చేయాలి. ఫలానా చోట భలే చేశాడే అనిపించుకునే అవకాశం విజయ్ రామ్ కు పెద్దగా దొరకలేదు. మెయిన్ అట్రాక్షన్ గా నిలిచిన హీరోయిన్ శివశక్తి సచ్ దేవ్ హోమ్లీగా అందంగా ఉంది. యాక్టింగ్ పరంగానూ గట్టిగానే నిలబెట్టింది. ఉన్న కొన్ని వీక్ నెస్ లు డబ్బింగ్ ఆర్టిస్టు టాలెంట్ తో కవర్ అయిపోవడంతో మరీ ఎక్కువగా లోపాలు ఎంచే ఛాన్స్ ఇవ్వలేదు.

తండ్రిగా నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ సరిగ్గా సరిపోయారు. ప్రీ క్లైమాక్స్ తో పాటు అక్కడక్కడా కాస్త బిగదీసుకున్నట్టు అనిపించినా ఓవరాల్ గా రొటీన్ నటులను ఇలాంటి ఫాదర్ క్యారెక్టర్స్ లో చూసిన ఆడియన్స్ కు కొంత రిలీఫ్ అనిపిస్తాడు. అన్నపూర్ణమ్మ గారు యథావిధిగా తనకు అలవాటైన రీతిలో అలవోకగా చేసుకుంటూ పోయారు. రంగస్థలం మహేష్ అలా ఐదు నిముషాలు కనిపిస్తాడు అంతే. సీనియర్ నరేష్ కు హీరో తండ్రిగా ఇది ఎన్నో సినిమానో లెక్క చెప్పడం కష్టం. హీరో హీరోయిన్ల తల్లులు, ఫ్రెండ్స్ కనిపించేది కాసేపే అందరూ న్యాచురల్ గా ఉండటం ప్లస్ అయ్యింది.

డైరెక్టర్ అండ్ టీమ్

ఏ కూతురైనా తల్లి కన్నా ఎక్కువగా తండ్రిని ప్రేమిస్తుందనేది మనం సినిమాల్లో, నిజ జీవితంలో కొన్ని వందలసార్లు చూసుంటాం. అదే తరహాలో నాన్న కూడా ఆడపిల్ల అంటే ఎంత అపురూపంగా చూసుకుంటాడో మనలో ఎందరికో అనుభవమే. దీన్ని ప్రేమతో ముడిపెట్టి ఎమోషనల్ గా చెప్పాలనుకున్న దర్శకుడు జోనాథన్ ఎడ్వర్డ్ ప్రయత్నం అంతగా పండని భావోద్వేగాల మధ్య నలిగిపోయింది. సినిమా టేకాఫ్ అయిన కొద్దినిమిషాలకే మనం అఖిల-అరుణ్ ప్రసాద్ లకు కనెక్ట్ అయిపోతాం. త్రివిక్రమ్ తీసిన నువ్వే నువ్వే ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ట్రీట్మెంట్ లో ఉన్న ఫ్రెష్ నెస్ వల్ల ఈ బాండింగ్ నుంచి ఎక్కువ ఆశిస్తాం. అయితే ప్రేమకథను ఎస్టాబ్లిష్ చేసే ఉద్దేశంతో ఎన్నోసార్లు చూసి అరిగిపోయిన పాత ఫార్ములా ట్రాక్స్ ని ఇందులో మళ్ళీ ఉపయోగించడంతో చాలా సేపు అమర్ అఖిలను ప్రేమలో పడేసేందుకు చేసే ప్రయత్నాలు అతి మామూలుగా అనిపిస్తాయి. అందుకే తానుగా బ్రేకప్ చెప్పుకునే ఎపిసోడ్ లో ఎలాంటి ఫీల్ కలగదు.

ప్రీ ఇంటర్వెల్ లో అమర్ ఓ మాట అంటాడు. నా అంత గొప్పగా నిన్ను ఎవరు ప్రేమించలేరు, నన్ను కాదనడానికి ఒక్క కారణం చెప్పు చాలు దూరమవుతానని అడుగుతాడు. నిజానికి ప్రేక్షకులకే అతన్ని తిరస్కరించడానికి వంద రీజన్లు అప్పటికే దొరికేశాయి. ఎలాంటి బాధ్యత లేకుండా తిరుగుతూ, ప్రాణంగా ప్రేమించే సంగీతంపైనా దృష్టి పెట్టకుండా కేవలం బస్ స్టాప్ లో చూసి నచ్చిన అమ్మాయి కోసం నానాపాట్లు పడటం నవ్వించవు సరికదా కనీసం ఎంటర్ టైన్ కూడా చేయవు. ఇంటికి వెళ్లి కేబుల్ ఆపరేటర్ అవతారం ఎత్తడం, సర్ప్రైజ్ అంటూ పుట్టినరోజు కానుకలు పంపడం ఇవన్నీ గొప్ప ప్రేమికుడి లక్షణాలు అని అనుకునేంత అమాయకత్వంలో ఆడియన్స్ లేరు. సుస్వాగతంలో పవన్ పాత్ర మీద విపరీతమైన సానుభూతి రావడానికి కారణం అతని ఎమోషన్ ని చూసేవాళ్ళు సొంతం చేసుకున్నారు కాబట్టి. కానీ ఇక్కడ అలాంటి వ్యవహారం ఏమి ఉండదు. మీ ఇంటి పనులు అన్ని చేశాను , వెంట తిరిగాను కాబట్టి నా ప్రేమ స్వచ్ఛమైనది అనే తరహాలో అమర్ చెప్పుకోవడం నిజానికి నవ్వు తెప్పిస్తుంది.

జోనాథన్ ఎడ్వర్డ్ లో మంచి టెక్నీషియన్ ఉన్నాడు. అందులో సందేహం లేదు. ప్రతి ఫ్రేమ్ లోనూ అది గమనించవచ్చు. ఫాదర్ సెంటిమెంట్ చూపించేసాం కాబట్టి లవ్ స్టోరీ ఎలా నడిచినా చల్తా అని ఎలా అనుకున్నారో కానీ అక్కడే తేడా కొట్టింది. హీరోతో చివర్లో క్లాస్ పీకించడం కోసమే తండ్రి పాత్రను మరీ అవసరానికి మించి ఓవర్ డ్రమాటిక్ గా మలిచినట్టు అనిపిస్తుంది. ప్రేమలో దెబ్బ తినడం ప్రపంచంలో ఎందరో అమ్మాయిలకు అనుభవం. కూతురిని అంతగా ప్రేమించినవాడు స్థిమితంగా ఆలోచించి తన బిడ్డ తప్పు తెలుసుకుని ఇంకోసారి చేయదు కదా అనే నమ్మకాన్ని ఎందుకు పెంచుకోడు. ఈ సందేహం సెకండ్ హాఫ్ అఖిల ఐఏఎస్ పాస్ అయ్యాక ఇంకా బలపడుతుంది. ఇలాంటి బలహీనతల వల్ల అమరం అఖిలం ప్రేమ జస్ట్ ఓకే లవ్ స్టోరీగా మిగిలిపోయింది కానీ పదే పదే చెప్పుకునేంత చూసుకునేంత స్థాయిలో నిలవలేదు

రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు ప్రాణం. చాలా తక్కువ బడ్జెట్ ని తన సీనియారిటీతో మంచి క్వాలిటీ చూపించి నిలబెట్టేశారు. రధన్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు ఓకే. పాటలు మళ్ళీ మళ్ళీ వినేలా లేవు. ఇలాంటి కథల్లో పాటలను గాయకులతో స్లోగా గట్టిగా పాటిస్తే చాలు యూత్ రిపీట్ మోడ్ లో వింటారనుకున్నారు కాబోలు. కానీ అర్జున్ రెడ్డి తరహా మేజిక్ ఇందులో సగం కూడా జరగలేదు. రామకృష్ణ-మౌనికల ఆర్ట్ వర్క్ ఈ మూవీ అవుట్ ఫుట్ సహజంగా వచ్చేందుకు చాలా ఉపయోగపడింది. అమర్ రెడ్డి ఎడిటింగ్ రాజీ పడకపోయి ఉంటే ఓ ఇరవై నిముషాలు ట్రిమ్ అయ్యి ఉండేది. నిర్మాణ విలువలు ఓకే.

ప్లస్ గా అనిపించేవి

శివశక్తి సచ్ దేవ్
బిజిఎం
క్యాస్టింగ్
ఛాయాగ్రహణం

మైనస్ గా తోచేవి

పాత కథ
పాటలు
ఫస్ట్ హాఫ్
ఎమోషన్ తగ్గడం

కంక్లూజన్

తండ్రి కూతుళ్ళ బాండింగ్ కి ప్రేమకథను ముడిపెట్టి చేసిన అమరం అఖిలం ప్రేమ టైటిల్ లో ఉన్నంత భావుకత సినిమా మొత్తంలో లేకపోయినప్పటికీ మరీ తీవ్రంగా నిరాశపరచకుండా ఓసారి చూడొచ్చనే అభిప్రాయం అయితే కలిగిస్తుంది. కాకపోతే ఇదే సినిమాను టికెట్ కొని వ్యయప్రయాసలు కూర్చి థియేటర్ కు వెళ్లి చూస్తే ఏమనిపిస్తుందంటే చెప్పడం కష్టం. ఎమోషన్ ని ప్రెజెంట్ చేయడంలో బాగా తడబడినప్పటికీ స్లోగా సాగే ఫ్యామిలీ లవ్ డ్రామాలను ఓపిగ్గా చూసే వాళ్ళు పర్లేదు అనుకుంటారు కానీ ప్రకాష్ రాజ్ నటించిన ఆకాశమంత స్థాయిలోనో లేదా నువ్వే నువ్వే టైపులోనో ఊహించుకోకుండా ఉంటే చాలు

అమరం అఖిలం ప్రేమ – బాగా నెమ్మదించిన ఎమోషన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి