iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 26 – ఆర్యా

లాక్ డౌన్ రివ్యూ 26 – ఆర్యా

థియేటర్లు మూతబడిన వేళ వినోదానికి వెబ్ సిరీస్ లు మంచి ఆప్షన్ గా నిలుస్తున్నాయి. బాషతో సంబంధం లేకుండా అన్ని రకాల యాప్స్ లోనూ వీటికి ఆదరణ దక్కుతోంది. కొన్ని ప్రత్యేకంగా లోకల్ లాంగ్వేజెస్ లో అనువదించి విడుదల చేస్తుండటంతో టైంపాస్ కు లోటు లేకుండా జరిగిపోతోంది. ఈ క్రమంలో ఇటీవలే డిస్నీ హాట్ స్టార్ ద్వారా రిలీజైన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఆర్య. మాజీ ప్రపంచసుందరి సుస్మిత సేన్ టైటిల్ రోల్ లో ట్రైలర్ నుంచే ఆసక్తి రేపుతూ వచ్చిన ఆర్య ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

తేజ్ సరీన్(చంద్రచూర్ సింగ్)ఫార్మా కంపెనీ నడుపుతూ అందులోనే అసాంఘిక పద్దతులలో కొన్ని డ్రగ్స్ ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటాడు. ఇతనికి తోడుగా బావమరిది సంగ్రాం(అంకుర్ భాటియా)తో పాటు మరో మిత్రుడు జవహర్(నమిత్ దాస్)వ్యవహారాలు నడిపిస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తారు. తేజ్ భార్య ఆర్య సరీన్(సుస్మితా సేన్)ముగ్గురు పిల్లల ఆలనాపాలనతో పాటు తన వృత్తిలో బిజీగా ఉంటుంది. లోకల్ డాన్ షికావత్(మనీష్ చౌదరి)కు చెందిన 300 కోట్ల కొకైన్ ని సంగ్రాం, జవహర్ లు దొంగలించి దాన్ని సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. దీన్ని తేజ్ వ్యతిరేకిస్తాడు. ఆర్య చెల్లి సౌందర్య(ప్రియాష భరద్వాజ్) పెళ్లి జరిగిన రోజు రైడింగ్ లో సంగ్రాం సరుకుతో పాటు దొరికిపోతాడు. ఆ తర్వాత తేజ్ ని గుర్తుతెలియని వ్యక్తి ఇంటి దగ్గర కాల్చి చంపేస్తాడు.

దీంతో బాధ్యత మొత్తం ఆర్య మీద పడుతుంది. తన సొత్తుని వెనక్కు ఇవ్వాలని కోరిన చోటుకి పంపించాలని షికావత్ ఆర్యను బెదిరించడం మొదలుపెడతాడు. తేజ్ హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న నార్కోటిక్స్ ఇన్స్ పెక్టర్ ఖాన్(వికాస్ కుమార్) ఆర్య కార్యకలాపాల మీద కన్నేసి నీడలా వెంటాడతాడు. తేజ్ తన వ్యాపారానికి సంబంధించిన వివరాలన్నీ ఒక పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసుంటాడు. దాని కోసమే అందరూ వెతుకుతుంటారు. మరో వైపు ఆర్య, జవహర్ జీవితాల్లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. భర్త జవాబుదారీతనాన్ని తన మీద వేసుకున్న ఆర్యకు దిగాక ఇదెంత పెద్ద పద్మవ్యూహమో అర్థమవుతుంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ చాలా సవాళ్ళను ఎదురుకుంటుంది. తను ఈ యుద్ధంలో ఎలా గెలిచిందనేదే ఇక్కడ ప్రస్తావించని ఎన్నో మలుపుల సమూహారం ఆర్య బాలన్స్ స్టొరీ

నటీనటులు

పదేళ్ళ గ్యాప్ తర్వాత ఆర్యతో కంబ్యాక్ ఇచ్చిన సుస్మిత సేన్ ఆర్యను అంతా తానై నడిపించింది. ఎమోషన్స్ పరంగా చాలా డెప్త్ ఉన్న పాత్ర కావడంతో వాటిని అద్భుతంగా బాలన్స్ చేస్తూ సిరీస్ చివరి దాకా చూడటంలో ప్రధాన కారణంగా నిలిచింది. ఇన్నేళ్ళ తర్వాత కూడా అదే స్పార్క్, గ్లామర్ మైంటైన్ చేస్తున్న సుస్మితా సేన్ ఆర్య చూశాక ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుందన్న ఫీలింగ్ కలుగుతుంది. మినిమం ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడానికే కిందా మీద పడుతున్న కొందరు యంగ్ జెనరేషన్ బ్యూటీస్ కి ఆర్యని మంచి రిఫరెన్స్ గా చూపోచ్చు. అయిదు పదుల వయసుకు అతి దగ్గరగా ఉన్న సుస్మితాలో మునుపటి ఫైర్ అలాగే ఉంది. భర్తను తలుచుకుని అతని వీడియో చూస్తూ కన్నీళ్ళు పెట్టుకునే సీన్లో, షెకావత్ లాంటి కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ తో తలపడే సన్నివేశాల్లో ఈ వేరియేషన్స్ ని బాగా గమనించవచ్చు. దాదాపు అన్ని ఎపిసోడ్లలో ప్రతి ఫ్రేమ్ లో కనిపించే సుస్మితా సేన్ ని కాకుండా ఇంకెవరైనా ఊహించుకోవడం కష్టమే.

ఎన్నో సంవత్సరాల తర్వాత దర్శనమిచ్చిన చంద్రచూర్ సింగ్ ది చాలా పరిమితమైన పాత్ర. రెండో ఎపిసోడ్ లోపే చనిపోవడంతో అతనికి పెర్ఫార్మ్ చేయడానికి అంతగా అవకాశం దక్కలేదు. ఉన్నంతలో డీసెంట్ గా చేసి మెప్పించాడు. మెయిన్ విలన్ గా నటించిన మనీష్ చౌదరి మాత్రం ఆ రోల్ లో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయాడు. ఏసిపి ఖాన్ గా చేసిన వికాస్ కుమార్ కొంచెం నవాజుద్దిన్ సిద్దిక్ స్టైల్ ని ఇమిటేట్ చేయబోయాడు కానీ ఫైనల్ గా పర్లేదు అనిపించాడు. ఇంకొంచెం సీనియర్ ఆర్టిస్టు చేసి ఉంటె బాగుండేదనిపిస్తుంది. సుస్మిత తండ్రిగా ముసలి వయసులోనూ పడుచు పొందు కోసం తపన పడే మరో కీలక పాత్ర చేసిన జయంత్ కృపలానీ ఆర్యకున్న మరో ప్రధాన బలం. ఆర్య పిల్లలుగా నటించిన వీరేన్, ప్రత్యక్ష్, విర్తి చాలా న్యాచురల్ గా ఉన్నారు. ఇందులో క్యాస్టింగ్ చాలా పెద్దదే ఉంది. అందరి పేర్లు ప్రస్తావించలేనంతగా ప్రతిఒక్కరి నుంచి చక్కని అవుట్ పుట్ రాబట్టుకున్నారు దర్శకులు

డైరెక్టర్ అండ్ టీం

దీనికి ముగ్గురు దర్శకులు సంయుక్తంగా పని చేశారు. రామ్ మధ్వని-సందీప్ మోడీ-వినోద్ రావట్. తొమ్మిది ఎపిసోడ్లు కలిపి ఏడున్నర గంటల సుదీర్ఘ నిడివిని సాధ్యమైనంత మేరకు విసుగు రాకుండా నడిపించే ప్రయత్నం గట్టిగానే చేశారు. కాని ఆ క్రమంలో కొంత తగ్గించే అవకాశం ఉన్నా కూడా సాగదీయడంతో మధ్యలో చాలాసేపు ల్యాగ్ అనిపించడమే కాక కొంత భాగం రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. నిజం చెప్పాలంటే ఓ మూడు గంటల సినిమాగా తీస్తే అద్భుతంగా పండే ఇలాంటి డ్రామాలు వెబ్ సిరీస్ గా మార్చే ప్రయత్నంలో అనవసరమైన ప్రహసనాలకు ఇష్టం లేకపోయినా చోటు ఇవ్వాల్సి వస్తుంది. ఈ విషయంగా వీళ్ళు పడిన ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తుంది.

ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ తో పాటు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోడవ్వడంతో ఆర్య కాస్త ఓపికతో చూస్తే డీసెంట్ వాచ్ గానే నిలుస్తుంది. వీటిలో ఏ మాత్రం తేడా కొట్టినా ఆర్యను ఇంతసేపు భరించడం కష్టమే. కీలకమైన మలుపును ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఓపెన్ చేసిన దర్శక ద్వయం ఆర్య చేతికి బిజినెస్ పగ్గాలు ఇవ్వడానికి చాలా సమయం తీసుకోవడం ఫ్లోకి స్పీడ్ బ్రేకర్ అయ్యింది. అది జరిగిపోయాక కథనం పరుగులు పెడుతుంది. ఆర్య ఫ్యామిలీలోని ఎమోషన్స్ ని చక్కగా ప్రెజెంట్ చేసిన ఈ ట్రిపుల్ డైరెక్టర్స్ టెంపోని మైంటైన్ చేయడంలో దాదాపుగా సక్సెస్ అయ్యారు. ఓ గంట కుదించి ఉంటే ఇంకా క్రిస్పీగా ఉండేది

పాటలు ఎక్కువగా లేని సిరీస్ కాబట్టి సంగీతపరంగా అంతగా ప్రాముఖ్యత దక్కలేదు. ఉన్నంతలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా కుదిరింది. విశాల్ ఖురానా పనితనం గొప్పగా లేకపోయినా మరీ చప్పగా అయితే అనిపించదు. హర్ష్వీర్ ఒబెరాయ్ ఛాయాగ్రహణం సినిమా స్థాయిలో కుదిరింది. ఖుష్బూ రాయ్-అభిమన్యు చౌదరిల ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. లొకేషన్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధ వల్ల మంచి రిచ్ నెస్ వచ్చింది

చివరి మాట

సినిమాకు ప్రత్యాన్మయంగా వెబ్ సిరీస్ లను పరిగణించలేం కానీ రాను రాను టేకింగ్ లోనూ, స్టాండర్డ్స్ లోనూ రెండూ పోటీ పడుతున్న మాట వాస్తవం. అందుకే బాలీవుడ్ మేకర్స్ క్వాలిటీ కంటెంట్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్లకు భారీ పారితోషికాలు ఇచ్చి మరీ వీటిలో నటింపజేస్తున్నారు. ఆర్యాలో అన్ని ఆకర్షణలతో పాటు కొన్ని మైనస్సులు కూడా ఉన్నాయి. వాటిని నిభాయించుకుని చూస్తే ఓ మాదిరిగా మెప్పించే అవకాశాలైతే ఉన్నాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందే క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళను ఆర్య మెప్పించే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. గొప్ప కథాకథనాలు అని చెప్పలేకపోయినా ఉన్నంతలో డీసెంట్ గా ఉన్న ఈ వెబ్ సిరీస్ కోసం కొంత భారీ సమయమే కేటాయించుకోవాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి