iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 57 – ఆకాశం నీ హద్దురా

లాక్ డౌన్ రివ్యూ 57 – ఆకాశం నీ హద్దురా

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఎన్నో సినిమాలు ఓటిటిలో రిలీజైనా సౌత్ నుంచి వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరో చిత్రమేది రాలేదన్న కొరతను తీరుస్తూ ఇవాళ ఆకాశం నీ హద్దురా ప్రైమ్ ద్వారా విడుదలయ్యింది. ప్రొడక్షన్ స్టేజి నుంచే మంచి అంచనాలు రేపిన ఈ మూవీ కోసం సూర్య మాములుగా కష్టపడలేదు. ఫిజిక్ ని మార్చుకోవడంతో పాటు తనే నిర్మాతగా ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి భారీ బడ్జెట్ తో దీన్ని తెరకెక్కించారు. వెంకటేష్ గురుతో మన ప్రేక్షకులకూ దగ్గరైన దర్శకురాలు సుధా కొంగర డైరెక్టర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ దీని మీద ఆసక్తి నెలకొంది. మరి ఇది అందరిని మెప్పించేలా ఉందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

ఏవియేషన్ చదువు పూర్తి చేసుకున్న చంద్ర మహేష్ అలియాస్ మహా(సూర్య)ఉద్యోగం కోసం చూసుకోకుండా స్వంతంగా విమానయాన సంస్థను పెట్టి అతి తక్కువ ధరకు సామాన్యులకు ఫ్లైట్ జర్నీ కలిగించాలనే లక్ష్యంతో ఉంటాడు. జీవితంలో స్థిరపడకుండానే తనను అర్థం చేసుకున్న సుందరి(అపర్ణ బాలమురళి)ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అనుమతులు పెట్టుబడుల కోసం ఆఫీసులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్న మహాకు కార్పొరేట్ దిగ్గజం జాజ్ సంస్థ అధినేత పరేష్(పరేష్ రావల్)నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అవన్నీ దాటుకుని మహా ఒక్క రూపాయికే విమానం టికెట్టుని అమ్మి తానేంటో ప్రపంచానికి ఎలా చూపించాడు అన్నదే మిగిలిన స్టోరీ

నటీనటులు

ఇది పూర్తిగా సూర్య సోలో షో. తారాగణం ఎక్కువే ఉన్నప్పటికీ రెండున్నర గంటలు అలా చూస్తూ ఉండాలనిపించిందంటే దానికి కారణం ఇతనొక్కడే. ఎంత కసితో పోరాడుతున్నా ఓటమి పదే పదే తరుముతుంటే కింద పడుతూ లేచే పాత్రలో అద్భుతంగా జీవించాడు. ముఖ్యంగా బాధను వ్యక్తపరుస్తూ తనకు మాత్రమే సాధ్యమయ్యే ఎక్స్ ప్రెషన్స్ తో ప్రాణం పోశాడు.గ్రాఫ్ ఎక్కడికక్కడ డ్రాప్ అవుతున్నా తన భుజాల మీద నిలబెడుతూ సినిమా చూసేందుకు ఒకే ఒక్క కారణంగా నిలిచాడు. ఫైట్లు, ఛాలెంజూలు లాంటి కమర్షియల్ అంశాలు లేకపోయినా తన న్యాచురల్ గ్రేస్ తో మహాగా గుర్తుండిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అయితే సత్యదేవ్ డబ్బింగ్ అంతగా సింక్ అవ్వలేదు.

సహజత్వం కోసం తీసుకున్నారేమో కానీ హీరోయిన్ అపర్ణ బాలమురళి నటనపరంగా బెస్ట్ ఇచ్చింది కానీ లుక్స్ విషయంలో మాత్రం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఉద్దేశపూర్వకంగానే తనను ఎంచుకున్నట్టు అర్థమవుతుంది. గ్లామర్ ఇమేజ్ ఉన్న వాళ్లైతే ఆడియన్స్ అటెన్షన్ పక్కకు వెళ్లే అవకాశం ఉందని కాబోలు డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో న్యాచులర్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. పరేష్ రావల్ డీసెంట్ గా ఉన్నారు. ఎప్పుడూ చేయని రోల్ అయితే కాదు. మోహన్ బాబు కొన్ని సన్నివేశాలకే పరిమితం. హుందాగా చేశారు. ఊర్వశి, ప్రకాష్ బేల్వాడి, అచ్యుత్ కుమార్, వినోదిని వైద్యనాధన్, కరుణాస్, కాళీ వెంకట్, రామ్స్, జ్ఞాన సంబందం అంతా ఆరవ బ్యాచే. ఒకరిద్దరు తప్ప మనకు పరిచయం లేని మొహాలే.

డైరెక్టర్ అండ్ టీమ్

ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాధ్ బయోపిక్ ని కథగా మలుచుకున్న దర్శకురాలు సుధా కొంగర గతంలో తీసిన గురు తరహాలోనే దీన్ని కూడా చాలా సిన్సియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికీ స్టోరీలో మైండ్ బ్లోయింగ్ అనిపించే మలుపులు ఉండవు. థ్రిల్ కు గురి చేసి కుర్చీకి అతుక్కుపోయేలా చేసే ట్విస్టులూ కనిపించవు. చాలా సింపుల్ గా మహా అనే ఓ గొప్ప లక్ష్యం ఉన్న వ్యక్తి ప్రయాణాన్ని అతి దగ్గరగా చూస్తున్నట్టు ఉంటుంది. తన ప్రయాణంలో ఎదురయ్యే అవమానాలు అడ్డంకులు ప్రేక్షకులూ ఫీలయ్యేలా చేస్తుంది. కొన్ని చోట్ల ఎమోషన్స్ కూడా చక్కగా పండాయి. అయితే ఆకాశం నీ హద్దురా ఒక గ్రేట్ మూవీ అనిపించుకోవడానికి మాత్రం ఇవి సరిపోలేదు.

ప్రయత్నంలో చాలా నిజాయితీ ఉంది అందులో సందేహం లేదు. మాములు జనానికి పెద్దగా అవగాహన లేని ఓ విజేత కథను మెప్పించేలా తీయడం అంత సులభం కాదు. రెండున్నర గంటల పాటు ఆడియన్స్ తెరమీద చూపిస్తున్న కాన్సెప్ట్ తో కనెక్ట్ అవ్వాలంటే దానికి సరిపడా డ్రామా పుష్కలంగా ఉండాలి. మహానటిలో అది పర్ఫెక్ట్ గా కుదిరితే ఎన్టీఆర్ కథానాయకుడులో పూర్తిగా జీరో అయ్యింది. ఆకాశం నీ హద్దురా ఈ రెండింటి మధ్య నిలిచింది. మహా పడే కష్టాలు అయ్యో అనిపిస్తాయి. తర్వాత ఏం చేస్తాడా అనే ఆసక్తినీ కలిగిస్తాయి. కానీ అంచనాలు రేపినంత టెంపో స్థాయిలో కొన్ని చోట్ల సన్నివేశాలు పండలేదు.

ఇది మరీ పెద్ద లోపమేమి కాదు కానీ ఇది సూర్య సినిమా కాబట్టి ఎంతో ఆశించే వాళ్ళను మాత్రం ఓ మాదిరి సంతృప్తినిస్తుంది అంతే. ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ తో చక్కగా ఓపెన్ చేసిన సుధా కొంగర ఆ తర్వాత మహా సుందరిల లవ్ ట్రాక్, మ్యారెజ్ ఎపిసోడ్ ని మాత్రం అంత ఎంగేజింగ్ గా తీయలేకపోయారు. అవన్నీ ఫోర్స్ తో జరుగుతున్నట్టు అనిపిస్తాయి. మహాకు అన్నేసి కఠిన సవాళ్లు ఎదురవుతున్నా అతను ఎదురుకునే తీరుకి మనం కొన్ని చోట్ల బాగా కనెక్ట్ కాగలుగుతాం. కృత్రిమ అంశాలు జోడించకూడదని సుధా కొంగర భావించడం వల్ల కాబోలు ఒకదశకు వచ్చాక కథనం చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. నిజ జీవితం కథైనా కల్పితమైన పరిగెత్తించే టెంపో చాలా అవసరం.

ఒకవేళ గోపినాధ్ తన కథను వాడుకోవడానికి ఏమైనా పరిమితులు విధించారో ఏమో కానీ నిడివి కోసం కొంత సాగతీత సెకండ్ హాఫ్ లో జరిగింది. కాస్త స్లో అవుతున్న ఫీలింగ్ వచ్చి వేగం తగ్గడంతో జరగబోయేది ప్రేక్షకుడు ముందుగానే ఊహించి సిద్ధమైపోవడంతో ఇక అక్కడి నుంచి జరిగేదంతా సాధారణంగా అనిపిస్తుంది. మహాను అణచడానికి పరేష్ వేసే ఎత్తుగడలు ఒక గొప్ప ప్రత్యర్థి స్థాయిలో అనిపించవు. నిజానికి ఒక్క రూపాయి విమానం టికెట్ అమ్మడానికి గోపినాధ్ పడిన యాతన మాములుది కాదు. ఇంకాస్త గ్రిప్పింగ్ గా కనక స్క్రీన్ ప్లే ని నడిపించి ఉంటే ఆకాశం నీ హద్దురాకు హద్దులు లేని విజయం సొంతమయ్యేది. అయినప్పటికీ గత కొంత కాలంగా నిరాశపరిచిన సూర్య గత సినిమాలతో పోల్చుకుని చూస్తే ఇది చాలా బెటర్

జివి ప్రకాష్ కుమార్ సంగీతం పర్వాలేదు. ఓ పాట తప్ప మిగిలినవి అంతగా గుర్తుండేలా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా సాగింది. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం చాలా బాగుంది. ఒకే టోన్ ని మైంటైన్ చేస్తూ ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన కథను ప్రెజెంట్ చేసిన తీరు మెచ్చుకునే స్థాయిలో సాగింది. సతీష్ సూర్య ఎడిటింగ్ కాస్త మొహమాటపడటం వల్ల లెన్త్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. జక్కి ఆర్ట్ వర్క్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. తన పనితనంతో సబ్జెక్టుకి లైఫ్ ఇచ్చారు. నిర్మాణ విషయంలో మాత్రం సూర్య అండ్ కో ఎక్కడా తగ్గలేదు. కోట్ల రూపాయల బడ్జెట్ కళ్ళముందు కనిపిస్తుంది.

ప్లస్ గా అనిపించేవి

సూర్య అద్భుత నటన
విజువల్స్
ఛాయాగ్రహణం
క్యాస్టింగ్
ఆర్ట్ వర్క్

మైనస్ గా తోచేవి

సినిమాకు కావాల్సిన డ్రామా తగ్గడం
సెకండ్ హాఫ్ ల్యాగ్
కొన్ని రిపీట్ సీన్స్

కంక్లూజన్

ఆకాశం నీ హద్దురా నిజాయితీతో కూడిన ఒక ప్రయత్నం. అద్భుతం, అమోఘం అనే ఉపమానాలు వర్తించకపోయినా సూర్య నటన కోసం, దర్శకురాలు సుధా కొంగర సిన్సియర్ గా ఒక విన్నర్ స్టోరీని చెప్పేందుకు పడిన తపన కోసం నిస్సందేహంగా ఓసారి చూడొచ్చు. ఎమోషన్స్ అక్కడక్కడా సాగతీతకు గురైనప్పటికీ మంచి తారాగణం కవచంలా నిలబడి ఎక్కడిక్కడ సాధ్యమైనంత కాపాడే ప్రయత్నం చేసింది. అంచనాలు తగ్గించేసుకుని కాస్త ఓపికను కూడగట్టుకుని ఆకాశం నీ హద్దురాని చూస్తే నిరాశపరిచే అవకాశాలు తక్కువే కానీ అసలు ఉండవని మాత్రం కాదు.

ఆకాశం నీ హద్దురా – మంచి ప్రయత్నమే 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి