iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 23 – 47 డేస్

లాక్ డౌన్ రివ్యూ 23 – 47 డేస్

టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరున్న సత్యదేవ్ హీరోగా నటించిన 47 డేస్ ప్రోమోస్ నుంచి ఆసక్తి రేపుతూ వచ్చింది. థియేటర్లు మూతబడి ఇంట్లోనే వినోదాన్ని అందుకోవాల్సిన వేళ అమృతారామమ్, పెంగ్విన్ తర్వాత తెలుగులో రిలీజవుతున్న చిత్రంగా 47 డేస్ మీద ప్రేక్షకులు చెప్పుకోదగ్గ అంచనాలే పెట్టుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో మేకర్స్ సైతం దీని ఫలితం పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. గత రెండేళ్లకు పైగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం మరి బుల్లితెరపైనైనా ఆకట్టుకునేలా సాగిందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

సత్య(సత్యదేవ్)సస్పెండ్ అయిన అసిస్టెంట్ పోలీస్ కమీషనర్. అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్న తన భార్య పద్దు(రోషిణి ప్రకాష్ ) మరణం వెనుక కారణాలు వెతుకుతూ ఉంటాడు. అనుమానాస్పద రీతిలో వైజాగ్ బీచ్ ఒడ్డున దొరికిన ఓ ఫార్మాసుటికల్ కంపెనీ సిఈఓ శవం చూశాక తన కేసుకు దీనికి ఏదో సంబంధం ఉందని అర్థం చేసుకుంటాడు. ప్రైవేట్ గా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే కనిపించిన జూలియట్(పూజా ఝవేరి)తనకో కీలక సాక్ష్యంగా తోస్తుంది. మరి సత్య లక్ష్యాన్ని చేరుకున్నాడా, ఇంతకీ ఈ మర్డర్ల వెనుక ఉన్న అసలు హంతకులు ఎవరు లాంటివి తెరమీద చూడాల్సిందే

నటీనటులు

నటుడిగా సత్యదేవ్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఉన్నంతలో బాగానే మెప్పిస్తూ ఇప్పటిదాకా ఆకట్టుకుంటూ వచ్చాడు. కాకపోతే అదృష్టం పక్షాన లేకపోవడంతో ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయాడు. యాక్టర్ గా సత్యదేవ్ 47 డేస్ లోనూ తనవరకూ చక్కగా చేశాడు. ఎమోషన్స్, ఎక్స్ ప్రెషన్స్ విషయంలో మెప్పించాడు. కాకపోతే 47 డేస్ సైతం అతనికి హెల్ప్ అయ్యేలా లేకపోవడం అతన్ని ఇష్టపడే వాళ్లకు బాధ కలిగించే విషయం. చాలా సన్నివేశాల్లో బలం లేకపోవడంతో నిస్సహాయంగా కనిపించాడు. అందులోనూ మరీ కొత్త సినిమా కాకపోవడంతో లుక్స్ పరంగా తేడాను స్పష్టంగా గమనించవచ్చు.

హీరోయిన్లు పెద్దగా చేసిందేమి లేదు. రోషిణి ప్రకాష్ లుక్స్ పరంగా బాగానే అనిపించినప్పటికీ తనకిచ్చిన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ కావడంతో పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ దొరకలేదు. ఉన్నంతలో పూజా ఝవేరికి ఎక్కువ సీన్లు పడ్డాయి. జస్ట్ ఓకే అనిపించింది. పోలీస్ ఆఫీసర్లుగా నటించిన రవివర్మ, ముక్తార్ ఖాన్ లు అవసరానికి మించి కొంచెం ఓవర్ చేశారు. ఇప్పటిదాకా వర్మ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా నెట్టుకొచ్చిన శ్రీకాంత్ అయ్యంగార్ కు ఇందులో హీరో తర్వాత అంత స్పాన్ ఉన్న రోల్ దక్కింది. క్లైమాక్స్ మొత్తం తనదే. దర్శకుడి డిమాండ్ మేరకు తన శాయశక్తులా కష్టపడ్డారు కానీ ఎందుకో ఇది డోస్ దాటిందనిపిస్తుంది. ఇక మిగిలినవారి గురించి చెప్పుకునేంత మ్యాటర్ ఏమి లేదు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు ప్రదీప్ మద్దాలి తీసుకున్న కథలో ఎలాంటి నవ్యతా లేదు. పోనీ అందులో కొత్తదనం లేకపోయినా కనీసం ట్రీట్మెంట్ తోనైనా బోర్ కొట్టకుండా కథనం నడిపించారా అంటే అదీ లేదు. కేవలం 1 గంట 44 నిముషాలు మాత్రమే నిడివి ఉన్న 47 డేస్ చాలా చోట్ల విసుగు పుట్టించిందంటే దానికి కారణం స్క్రీన్ ప్లే లోపమే. గతంలో ఎందరో దర్శకులు వాడేసిన చిన్న పాయింట్ ను తీసుకున్న ప్రదీప్ మద్దాలి ఏవో కొన్ని మలుపులైతే రాసుకున్నారు కానీ అవి నిజంగా ప్రేక్షకులను అరెస్ట్ చేసే విధంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోలేదు కాబోలు అవుట్ ఫుట్ కూడా దానికి తగ్గట్టే వచ్చింది. ఇలాంటి సినిమాల్లో విలన్ ఎవరూ ఊహించనివారు అయినంత మాత్రాన సరిపోదు. దానికి ముందు కట్టిపడేసే బలమైన సెటప్ కావాలి. అదే 47 డేస్ లో మిస్ అయ్యింది.

సత్యదేవ్ ఏదో ఇమేజ్ ఉన్న స్టార్ కాదు. ఖచ్చితంగా పాటలు, రొమాన్స్ ఉండి తీరాలని రూల్స్ పాటించడానికి. అయినా కూడా ప్రదీప్ ఇన్నేసి పాటలు పెట్టడంలో ఉద్దేశం సామాన్య ప్రేక్షకుడు అర్థం చేసుకోవడం కష్టం. స్టోరీ వీక్ గా ఉంది కాబట్టి నిడివి కోసమైనా వాటిని ఇరికించారు తప్ప నిజానికి ఇవే పంటి కింద రాళ్ళలా మారాయి. అసలు హంతకుడిని దాచడం కోసం ఇతర పాత్రల ద్వారా కొంత ఓవరాక్షన్ చేయించడం కూడా బెడిసి కొట్టింది. వాళ్ళ మీద అనుమానం రాదు సరికదా చిరాకు పుడుతుంది. హీరో భార్య/లవర్ చనిపోవడం అనే అనే పాయింట్ ని అప్పుడెప్పుడో క్రిమినల్ నుంచి మొన్న వచ్చిన నవదీప్ రన్ దాకా ఇంకా వాడుతూనే ఉండటం చూస్తే టాలీవుడ్ లో కథ కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రదీప్ లో మంచి టెక్నీషియన్ ని బ్యాడ్ స్టోరీ రైటర్ డామినేట్ చేయడంతో 47 డేస్ ఏ కోణంలోనూ సంతృప్తిపరచలేకపోయింది

సంగీత దర్శకుడు కం నిర్మాతల్లో ఒకరైన రఘు కుంచె ఆశ్చర్యకరంగా ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించారు. మంచి సౌండ్ తో మూడ్ ని క్యారీ చేసేలా బీజీఎమ్ ఇచ్చారు. అయితే పాటల విషయంలో మాత్రం నిరాశ తప్పలేదు. నిజానికి అవి బాగున్నాయా లేదా అనేది పక్కనబెడితే ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డు పడటంతో ఫార్వడ్ బటన్ వైపు వద్దన్నా వేలు వెళ్ళిపోతుంది . శేఖర్ ఎడిటింగ్ లో చాలా లోపాలున్నాయి. నిడివి తక్కువున్నా ఎక్కడా గ్రిప్పింగ్ గా అనిపించకపోవడంతో పాటు అవసరం లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి, వైజాగ్ అందాలను చక్కగా చూపిస్తూ మంచి క్వాలిటీతో ప్రొడక్షన్ వాల్యూస్ ని మైంటైన్ చేశారు.

ప్లస్ గా అనిపించేవి

సత్యదేవ్
ఛాయాగ్రహణం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ గా తోచేవి

అవుట్ డేటెడ్ స్టోరీ
సాగతీత
పాటలు
క్లైమాక్స్ నిడివి

కంక్లూజన్

ముందు ఓ రెండు మూడు ట్విస్టులు రాసుకుని ఆ తర్వాత కథను అల్లేసుకున్నంత మాత్రాన ప్రతి సినిమా థ్రిల్లర్ కాలేదు. దానికి ఉదాహరణగా 47 డేస్ ని చెప్పుకోవచ్చు. క్రైమ్ జానర్ లో సైతం కొత్తదనం ఆశిస్తున్న ప్రేక్షకులను మెప్పించాలంటే కాసిన్ని థ్రిల్స్ ఉంటే సరిపోదు. బలమైన థ్రెడ్ కావాలి. లీడ్ పెయిర్ కి సంబంధించిన ఎమోషన్ స్ట్రాంగ్ గా పండాలి. ఈ విషయంలో 47 డేస్ ఫెయిల్ కావడంతో ఇది కనీసం సగటు స్థాయిలో కూడా నిలవలేకపోయింది. ఓపికతో పాటు టైం పుష్కలంగా ఉందనుకుంటే తప్ప ఇంకేరకంగానూ 47 డేస్ డీసెంట్ వాచ్ గా నిలిచే అవకాశం ఇవ్వలేదు.

ఒక మాటలో

47 డేస్ – కంటెంట్ లాస్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి