iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 11 – గ్యాస్ నింపిన విషాదం

లాక్ డౌన్ రివ్యూ 11 – గ్యాస్ నింపిన విషాదం

ఇవాళ వైజాగ్ లో జరిగిన గ్యాస్ లీక్ ఉదంతంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. భారీ ప్రాణనష్టం జరక్కపోయినా పదికి పైగానే ప్రజలు మరణాన్ని చవిచూడటం బాధ కలిగించే విషయం. అసలే ఒకపక్క కరోనా వల్ల దేశమంతా లాక్ డౌన్ లో సమయాన్ని ఇళ్లలోనే గడుపుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు కలత పుట్టించేవే. కొందరు 1984లో జరిగిన భోపాల్ విషాదంతో దీన్ని పోలుస్తున్నారు కానీ నిజానికి రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ దుర్ఘటనను ఆధారంగా చేసుకుని 2014లో భోపాల్ ఏ ప్రేయర్ ఫర్ రైన్ అనే సినిమా వచ్చింది. లాక్ డౌన్ సిరీస్ లో భాగంగా దాని రివ్యూలోకి వెళదాం

కథ

1984 ప్రాంతంలో దిలీప్(రాజ్ పాల్ యాదవ్)అనే రిక్షా కార్మికుడు భోపాల్ నగరంలో జీవిస్తూ ఉంటాడు. అనుకోని సంఘటన వల్ల యూనియన్ కార్బైడ్ పెస్టిసైడ్ ఫ్యాక్టరీలో డైలీ లేబర్ గా ఉద్యోగంలో చేరతాడు. రోజువారీ వేతనంతో జీవితం ఆనందంగా గడుస్తూ ఉంటుంది. ప్రమాదకమైన కెమికల్స్ తయారు చేసే ఆ కంపెనీలో జరుగుతున్న అవకతవకల గురించి మోత్వానీ(కాల్ పెన్)తన పత్రికల్లో కథనాలు రాస్తాడు. నాణ్యతా ప్రమాణాలు నానాటికి తగ్గిపోవడం గురించి క్వాలిటీ ఆఫీసర్ రాయ్(జాయ్ సేన్ గుప్తా)హెచ్చరించినా యాజమాన్యం పెడచెవిన పెడుతుంది.

మిథైల్ ఐసోకనైట్ అనే ద్రావణం వల్ల ఓ కార్మికుడు చనిపోతే దాన్ని ప్రపంచానికి అసలు నిజం తెలియకుండా దాచి పెడతారు. దిలీప్ కు తగినంత నైపుణ్యం అర్హతా లేకపోయినా అతనికి ప్రమోషన్ మీద క్లిష్టమైన బాధ్యతలు అప్పగిస్తారు. విదేశాల్లో ఉండే సంస్థ సిఈఓ వారెన్ ఆండర్సన్(మార్టిన్ షీన్)ఓసారి ఇన్స్ పెక్షన్ కు వచ్చినప్పుడు రాయ్ చేసిన హెచ్చరికలు పట్టించుకోడు. ఫలితంగా కొంతకాలం తర్వాత కొన్ని సంఘటనల అనంతరం మేనేజ్ మెంట్ దుర్బుద్ధితో అమలు చేసిన పనుల వల్ల భారీ ఎత్తున గ్యాస్ లీకైపోయి భోపాల్ నగరంలో వేల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. లక్షలాది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. ఇదంతా ఎందుకు జరిగిందన్నదే భూపాల్ ఏ ప్రేయర్ ఫర్ రైన్ లో అసలు స్టోరీ

నటీనటులు

ఇందులో మరీ ఎక్కువగా పరిచయమున్న నటీనటులు లేరు కానీ నేటివిటీ కోసం తీసుకున్న హిందీ యాక్టర్స్ బాగా చేసి న్యాయం చేకూర్చారు. ఎక్కువగా ఆకట్టుకునేది రాజ్ పాల్ యాదవ్. చాలా సహజమైన నటనతో అన్ని ఎమోషన్స్ ఉన్న దిలీప్ పాత్రను చక్కగా పండించాడు. ఫ్యాక్టరీలో చేరాక ఇతని బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి పీక్స్ కు చేరుకుంటుంది. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో ఇతను కనిపించాడు. జాయ్ సేన్ గుప్తా క్వాలిటీ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. మనఃసాక్షికి అక్రమానికి మధ్య నలిగిపోతూ చిత్రవధ అనుభవించే ఉద్యోగిగా టైమింగ్ చూపించాడు. భోపాల్ దుర్ఘటనలో చరిత్ర మరువని దుర్మార్గుడిగా మిగిలిపోయిన అండర్ సన్ గా మార్టిన్ షీన్ న్యాచురల్ గా ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఉన్నంతలో పాత్ర పరిధి మేరకు ఇవ్వాల్సింది లోటు లేకుండా యాక్ట్ చేశారు

డైరెక్టర్ అండ్ టీం

భోపాల్ నిజ జీవిత దుర్ఘటనను ఆధారంగా చేసుకుని డేవిడ్ బ్రూక్స్ రాసిన పుస్తకం ఆధారంగా కథ రాసుకున్న దర్శకుడు రవి కుమార్ వీలైనంత రియలిస్టిక్ అప్రోచ్ లో భోపాల్ చిత్రాన్ని తీశారు. ఆర్ట్ వర్క్ తో పాటు ఇంటీరియర్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధ అడుగడుగునా కనిపిస్తుంది. దిలీప్ పాత్రను బేస్ గా తీసుకుని దాన్ని ఫ్యాక్టరీకి లింక్ చేసి అక్కడి నుంచి కథను నడిపించిన విధానం బాగుంది. అయితే ఫ్యాక్టరీలో జరిగిన అంతర్గత వ్యవహారాలు ఇంకాస్త డీటెయిల్ గా చూపించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

కాకపోతే ఇంగ్లీష్ లోనూ విడుదల చేయాలన్న ఉద్దేశంతో నిడివిని కేవలం 95 నిమిషాలకే పరిమితం చేయడంతో చాలా చోట్ల చెప్పాల్సిన విషయాలు మిస్ అయినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ రవి కుమార్ ప్రయత్నలోపం లేకుండా తక్కువ నిడివిలోనే ఎంగేజింగ్ అయ్యేలా చూశాడు. కమర్షియల్ అంశాలకు చోటు లేదు కాబట్టి కాంటెంపరరీ ఇష్యూస్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళకు తప్ప భోపాల్ ఏ ప్రేయర్ ఫర్ రెయిన్ మిగిలిన ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. బెంజమిన్ సంగీతం, చార్లీ-అనిల్ ల సంయుక్త ఛాయాగ్రహణం స్టాండర్డ్స్ లోనే ఉన్నాయి.

చివరి మాట

ప్రకృతి చేసే నష్టాల నుంచి మనిషి ఎలాగూ తప్పించుకోలేడు. కాని సాటి మనుషులు చేసే తప్పిదాల వల్ల స్వార్థాల వల్ల ఎన్ని జీవితాలు నాశనమవుతాయో చెప్పడానికి భోపాల్ గ్యాస్ ట్రాజెడీ కన్నా గొప్ప ఉదాహరణ అక్కర్లేదు. ఇప్పటికీ ఆ నగరంలో మూడు దశాబ్దాలు దాటినా అప్పటి ప్రమాదం వల్ల బాధితులుగా మిగిలిన కుటుంబాలు ఇంకా ఉన్నాయి. అప్పటి బాలలు ఇప్పుడు మధ్యవయస్కులుగా ఎందరో వైకల్యంతో జీవిస్తున్నారు. ఇలాంటివి ఎందుకు జరుగుతాయి, తెరవెనుక జరిగే కార్పొరేట్ దుర్మార్గాలు ఎలా ఉంటాయో అవగాహన రావాలంటే రావాలంటే భోపాల్ ఏ ప్రేయర్ ఫర్ రెయిన్ ని చూడొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి