iDreamPost

లాక్‌డౌన్‌ 31 వరకేనా…?!

లాక్‌డౌన్‌ 31 వరకేనా…?!

తెలుగు రాష్ట్రాల లాక్‌ డౌన్‌ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే కాదా..? ఆ తర్వాత కొనసాగుతుందా..? క్రమ క్రమంగా ప్రభుత్వాలు రోజులు పెంచుకుంటూ పోతాయా..? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. నిన్న జరిగిన జనతా కర్ఫ్యూకు ముందు ప్రధాని సీఎంతో భేటీ, నిన్న సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్‌ ప్రకటనలు.. అన్నీ ముందుగా నిర్ణయించిన మేరకే జరుగుతున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని ప్రారంభంలో అడ్డుకోకుంటే ఆ తర్వాత ఏమీ చేయలేమని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకే పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరగకముందే. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించక మునుపే కేంద్రం లాక్‌ డౌన్‌ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జనతా కర్ఫ్యూకు రెండు రోజులు ముందు ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్‌డౌన్‌ అనంతరం తలెత్తె పరిణామాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధత.. వంటి అంశాలపై దిశానిర్ధేశం చేశారు. ఒక్కరోజు జనతా కర్ఫ్యూను అమలు చేసి ప్రజలను లాక్‌డౌన్‌ దిశగా నడిపించారు.

జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రమే దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలతో సహా దాదాపు 13 రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ప్రస్తుతం ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించినా.. అది తొలి దశ మాత్రమేనని తెలుస్తోంది. నిన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 31 వరకు లాక్‌డౌన్‌ చేస్తున్నాం. ఆ తర్వాత ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తం చేశారు.

ఏపీలో ఏప్రిల్‌ 4వ తేదీన వాలంటీర్ల ద్వారా రేషన్‌కార్డు కుటుంబాలకు వెయ్యి రూపాయల నగదు సహాయం చేస్తున్నారు. 14 రోజుల పాటు స్వియ నిర్భందంలో ఉంటే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని సీఎం చెప్పారు. అంటే ఏప్రిల్‌ 4వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగే అవకాశం ఉంది. ఈ లోపు కొత్త కేసులు నమోదు కాకపోతే లాక్‌డౌన్‌పై కొంత సడలింపు వస్తుంది. లేదంటే మరో 14 రోజులు లాక్‌డౌన్‌ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కార్పొరేటర్‌ సంస్థలు.. తమ ఉద్యోగులకు ఏప్రిల్‌ 20వ తేదీ వరకు వర్క్‌ ఫ్రం హోంను ప్రకటించాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి